వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీ పేరిట బ్లూటిక్‌తో నకిలీ 'ఎక్స్' ఖాతాల కలకలం

  • 'ఆపరేషన్ సిందూర్' తర్వాత వెలుగులోకి వచ్చిన సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్
  • ఇద్దరి పేర్లతో 'ఎక్స్'లో పలు నకిలీ ఖాతాలు
  • తాజా చిత్రాలు, బ్లూటిక్‌తో ఉండటంతో నిజమైనవిగా చూపే ప్రయత్నం
  • నకిలీ ఖాతాలుగా స్పష్టం చేసిన పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం ఇద్దరు భారతీయ మహిళా సైనికాధికారులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. భారత ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్-హెలికాప్టర్ పైలట్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడించడంతో పాటు, తదుపరి పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వార్తల్లో నిలిచారు. అయితే, ఇప్పుడు వీరిద్దరి పేరుతో సామాజిక మాధ్యమ వేదికలపై పలు నకిలీ ఖాతాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్‌ల పేర్లతో అనేక ఖాతాలు 'ఎక్స్'లో కనిపిస్తున్నాయి. ఈ ఖాతాలలో వారి ఇటీవలి ఛాయాచిత్రాలను ఉపయోగించడంతో పాటు, కొన్ని ఖాతాలకు 'బ్లూటిక్' (ధ్రువీకరణ చిహ్నం) కూడా ఉండటం గమనార్హం. దీంతో చాలా మంది నెటిజన్లు ఇవి నిజమైన ఖాతాలేనని భావించి వాటిని అనుసరించడం ప్రారంభించారు. ఈ పరిణామం ప్రజల్లో కొంత గందరగోళానికి దారితీసింది.

ఈ నకిలీ ఖాతాల వ్యవహారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)కు చెందిన ఫ్యాక్ట్‌చెక్ విభాగం తక్షణమే స్పందించింది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ల పేరిట ప్రచారంలో ఉన్న పలు 'ఎక్స్' ఖాతాలు పూర్తిగా నకిలీవని స్పష్టం చేసింది. ప్రజలు ఇటువంటి నకిలీ ఖాతాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది.


More Telugu News