కేటీఆర్‌కు నాయకత్వ బాధ్యతలపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

  • బీఆర్ఎస్‌లో విభేదాలు లేవన్న హరీశ్ రావు
  • కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలు ఇస్తే స్వాగతిస్తానన్న మాజీ మంత్రి
  • కేసీఆర్ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ
  • కాంగ్రెస్ హామీల వైఫల్యంపై తీవ్ర విమర్శలు
  • ఎన్నికలొస్తే బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా
బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలున్నాయంటూ వస్తున్న ఊహాగానాలకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెరదించారు. పార్టీలో ఎలాంటి వర్గపోరు లేదని స్పష్టం చేస్తూనే, కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బీఆర్ఎస్ పార్టీలో తనకు, కేటీఆర్‌కు మధ్య విభేదాలున్నాయన్న ప్రచారాన్ని హరీశ్ రావు కొట్టిపారేశారు. ఒకవేళ కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తాను తప్పకుండా స్వాగతిస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని, ఆయన ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తానని తెలిపారు.

"కేసీఆర్‌‌కు నేను రాముడికి హనుమంతుడిలా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. కేసీఆర్ మాటే నా బాట. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ గీత దాటే ప్రసక్తి లేదు" అని హరీశ్ రావు స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని, అందరం కేసీఆర్ నాయకత్వంలోనే కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన తెలిపారు. గతంలోనూ ఈ అంశంపై చాలాసార్లు స్పష్టతనిచ్చానని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయామని ప్రజలు గ్రహించారని, తిరిగి కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.

రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను ప్రస్తుత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని, కాంగ్రెస్ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.


More Telugu News