బాలూతో పాడించొద్దని ఆ హీరోలు అనేవారు: సంగీత దర్శకుడు వాసూరావు

  • బాలూ మిమిక్రీ చేస్తారని అనేవారు
  • రామకృష్ణ గారికి అవకాశాలు వెళ్లేవి
  • మోహన్ బాబు ఎక్కువగా ఏసుదాస్ తో పాడించమనేవారు
  • సంగీత దర్శకుల అభిమాన సింగర్ బాలూనే     

సంగీత దర్శకుడిగా సాలూరి వాసూరావు అనేక చిత్రాలకు పనిచేశారు. బాలసుబ్రమణ్యంతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. తాజాగా ఆయన ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అనేక విషయాలను పంచుకున్నారు. బాలూగారు ఆర్టిస్ట్ కి తగినట్టుగా వాయిస్ మార్చి పాడేవారు. కమెడియన్స్ కి కూడా ఆయనే పాడేవారు. అది కొంతమంది హీరోలకు నచ్చేది కాదు" అని అన్నారు. 

"ఈ కారణంగానే కొంతమంది హీరోలు బాలూతో పాడించొద్దని అనేవారు. అప్పటివరకూ ఘంటసాల మాస్టారుతో పాడించినవారు, ఆ తరువాత రామకృష్ణతో పాడించమని చెప్పేవారు. అలాంటి హీరోలలో శోభన్ బాబు .. కృష్ణంరాజు ఉన్నారు. అందువల్లనే ఒకానొక సమయంలో రామకృష్ణ బాగా బిజీ అయ్యారు. అయితే ఆయన సినిమాలపై కాకుండా కచేరీలపై ఫోకస్ ఎక్కువగా పెట్టడం వలన అందుబాటులో ఉండేవారు కాదు" అని అన్నారు. 

ఇక మోహన్ బాబుగారు కూడా యేసుదాస్ తో పాడించడానికి ఎక్కువ ఆసక్తిని కనబరిచేవారు. యేసుదాసు కోసం ఆయన వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది హీరోలకు బాలూతో పాడించడం ఇష్టం లేకపోయినా, సంగీత దర్శకులంతా బాలూతో పాడించడానికే మొగ్గు చూపేవారు. ఎందుకంటే పాటను అర్థం చేసుకుని .. ఇంకా దానిలో వేయవలసిన సంగతులు వేసి పాడటం ఆయనకే తెలిసిన విద్య. ఆ టాలెంట్ తోనే బాలూ అలా దూసుకుపోయారు" అని చెప్పుకొచ్చారు.  




More Telugu News