ఆ ఫొటోలు చూస్తేనే రక్తం మరిగిపోతుంది... భారత్ ఊరుకుంటుందా? ఈ మోదీ ఊరుకుంటాడా?: ప్రధాని మోదీ

  • దేశ విభజన నాటి నుంచి భారత్‌తో శత్రుత్వమే పాక్ ఏకైక లక్ష్యమన్న ప్రధాని
  • పేదరిక నిర్మూలన, వికసిత భారత్ నిర్మాణమే తమ ధ్యేయమని స్పష్టీకరణ
  • పహల్గామ్ దాడి తర్వాత 'ఆపరేషన్ సింధూర్' విజయవంతమైందని వెల్లడి
  • దహోద్‌లో రూ.24,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం
  • కొత్త లోకోమోటివ్ ప్లాంట్, రైళ్లను జాతికి అంకితం చేసిన మోదీ
దేశ విభజన సమయం నుంచి పాకిస్థాన్ ఏకైక లక్ష్యం భారత్‌తో శత్రుత్వమేనని, అయితే భారతదేశం మాత్రం పేదరిక నిర్మూలన, దేశాభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గుజరాత్‌లోని దహోద్‌లో సోమవారం జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ, పహల్గామ్ దాడి అనంతరం భారత సాయుధ బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' విజయాన్ని గుర్తుచేస్తూ ఉగ్రవాదంపై తమ ప్రభుత్వ కఠిన వైఖరిని మరోసారి నొక్కిచెప్పారు. ఇదే పర్యటనలో భాగంగా రూ.24,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

"విభజన తర్వాత, కొత్తగా ఏర్పడిన దేశానికి (పాకిస్థాన్) ఒకే ఒక లక్ష్యం ఉంది... భారతదేశాన్ని ద్వేషించడం, మన పురోగతిని ఆపడానికి ప్రయత్నించడం. కానీ మనకు ఒకే ఒక లక్ష్యం ఉంది... ముందుకు సాగడం, పేదరికాన్ని నిర్మూలించడం, వికసిత భారత్‌ను నిర్మించడం" అని ప్రధాని మోదీ అన్నారు. "మన సాయుధ బలగాలు బలంగా ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి చెందిన భారతదేశం సాధ్యమవుతుంది. ఆర్థిక వ్యవస్థ కూడా పటిష్టంగా ఉండాలి. ఆ దిశగా మేం పూర్తి అంకితభావంతో, దృఢ నిశ్చయంతో నిరంతరం పనిచేస్తున్నాం" అని ఆయన తెలిపారు.

పహల్గామ్ ఘటనను ప్రస్తావిస్తూ, "మన సోదరీమణుల సిందూరాన్ని ఎవరైనా తుడిచివేయాలని చూస్తే, వారి అంతు చూస్తాం. అందుకే ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు. ఇది మన భారతీయుల సంస్కృతి, మనోభావాలకు నిదర్శనం" అని మోదీ భావోద్వేగంతో ప్రసంగించారు. "మాతృభూమిని, మానవత్వాన్ని కాపాడేందుకు మా తపస్సు, త్యాగానికి ఈ ప్రాంతం నిదర్శనం. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దానికి భారత్ మౌనంగా ఉంటుందా? మోదీ మౌనంగా ఉంటాడా? ఆ ఉగ్రవాదులు 140 కోట్ల మంది భారతీయులను సవాలు చేశారు. అందుకే, దేశ ప్రజలు నాకు అప్పగించిన ప్రధాన సేవకుడి బాధ్యతను నేను నిర్వర్తించాను" అని ఆయన వివరించారు.

పహల్గామ్‌లో 26 మంది మృతికి కారణమైన భయానక ఘటనను గుర్తుచేసుకుంటూ, "పిల్లల ముందే తండ్రులను కాల్చి చంపారు (పహల్గామ్‌లో). ఆ చిత్రాలు చూస్తే రక్తం మరిగిపోతుంది. ఉగ్రవాదులు 140 కోట్ల మంది భారతీయులను సవాలు చేశారు, అందుకే మీరు నాకు ప్రధానమంత్రిగా ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించాను... భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. మన వీరులు దశాబ్దాలుగా ప్రపంచం చూడని విధంగా పనిచేశారు... మేం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను గుర్తించాం. వాటి ఉనికిని ధృవీకరించుకున్నాం. 22 నిమిషాల్లో వాళ్లను మట్టిలో కలిపేశాం" అని ప్రధాని మోదీ ఘాటుగా వ్యాఖ్యానించారు.


More Telugu News