'ఆపరేషన్ సిందూర్' లోగోను సృష్టించింది ఎవరో తెలుసా?

  • పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన "ఆపరేషన్ సిందూర్"
  • మే 7న పాకిస్థాన్, పీఓకేలో ఉగ్రశిబిరాలపై భారత సైన్యం దాడులు
  • జైషే, లష్కరే, హిజ్బుల్ స్థావరాలే లక్ష్యంగా దాడులు, 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి
  • ఆపరేషన్ పేరుకు, ప్రత్యేక లోగోకు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం
పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం వ్యూహాత్మక ప్రతీకారంతో పాటు బలమైన సందేశాన్ని పంపేలా చర్యలు చేపట్టింది. మే 7వ తేదీన 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్‌పై భారత సైన్యం లక్షిత దాడులు నిర్వహించడమే కాకుండా, ఈ ఘటనలో ఎదురైన నష్టాన్ని, న్యాయం కోసం రగిలే ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా ఒక ప్రత్యేక చిహ్నాన్ని (లోగో) కూడా ఆవిష్కరించింది.

ఉగ్ర స్థావరాలపై నిర్దిష్ట దాడులు

'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక స్థావరాలు ధ్వంసమయ్యాయి. వీటిలో బహవల్పూర్, ముజఫరాబాద్, కోట్లి, సియాల్‌కోట్‌లోని శిబిరాలు కూడా ఉన్నాయి. హతమైన వారిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

'సిందూరం' పేరు వెనుక ఆవేదన

పహల్గామ్ మారణకాండ అనంతరం నెలకొన్న ఉద్వేగభరిత వాతావరణాన్ని, ముఖ్యంగా భర్తలను కోల్పోయిన మహిళల ఆవేదనను ప్రతిబింబించేలా 'ఆపరేషన్ సిందూర్' అనే పేరును ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హిందూ సంప్రదాయంలో వివాహిత మహిళలు ధరించే సిందూరం (కుంకుమ) సౌభాగ్యానికి చిహ్నం. పహల్గామ్ దాడిలో భర్తలను కోల్పోయి, సౌభాగ్యం దూరమైన మహిళల దుఃఖానికి ఈ పేరు ప్రతీకగా నిలుస్తుంది.

ఆగ్రహానికి, సంకల్పానికి ప్రతీకగా లోగో

ఈ ఆపరేషన్ కోసం భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ గుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్ ఒక ప్రత్యేక లోగోను రూపొందించారు. ఈ లోగో డిజైన్‌లో ఆపరేషన్ పేరును పెద్ద అక్షరాలతో ముద్రించారు. పేరులోని ఒక 'O' అక్షరాన్ని ఎర్రటి సిందూరం ఉన్న గిన్నె ఆకారంలో తీర్చిదిద్దారు. ఆ గిన్నె నుంచి ఒలికినట్లుగా ఉన్న సిందూరం, పహల్గామ్ దాడిలో అమరులైన వారి భార్యల వేదనకు ప్రతీక.

గతంలో పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్యలకు ఎక్కువగా సంప్రదాయ సైనిక పేర్లనే పెట్టేవారు. అవి అంతర్గతంగా ఆత్మవిశ్వాసాన్ని నింపేలా, బాహ్యంగా బలాన్ని ప్రదర్శించేలా ఉండేవి. కొన్నిసార్లు ఆపరేషన్ల గోప్యత కోసం, మరికొన్నిసార్లు భారతీయ పురాణాల నుంచి కూడా పేర్లను ఎంచుకునేవారు.


More Telugu News