ఐపీఎల్‌లో రోహిత్ శర్మ డబుల్ ధమాకా!

  • ఐపీఎల్‌లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రోహిత్ శర్మ 
  • విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్ రికార్డు
  • గుజరాత్ టైటాన్స్‌పై ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్
  • మొత్తం 300 సిక్సర్ల మార్క్‌ను కూడా దాటిన హిట్ మ్యాన్
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ ఐపీఎల్ 2025 సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో రెండు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మెగా టోర్నీలో 7000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో ఆటగాడిగా, అలాగే 300 సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ముల్లాన్‌పూర్‌లో గత రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఎలిమినేటర్ మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనతలు సాధించాడు.

ఈ మ్యాచ్‌కు ముందు కేవలం 15 సగటుతో ఉన్న రోహిత్ శర్మ.. కీలకమైన నాకౌట్ పోరులో విశ్వరూపం ప్రదర్శించాడు. గుజరాత్ బౌలర్లపై ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన రోహిత్ 50 బంతుల్లోనే 81 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో నాలుగు భారీ సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. రోహిత్ అద్భుత బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ నిలిచాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. మ్యాచ్ 9వ ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదడం ద్వారా రోహిత్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. కాగా, ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్‌కు రెండుసార్లు అదృష్టం కూడా కలిసొచ్చింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ చివరి బంతికి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో కోయెట్జీ సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అప్పుడు రోహిత్ కేవలం మూడు పరుగుల వద్ద ఉన్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లో మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బంతి రోహిత్ బ్యాట్ అంచును తాకినా కీపర్ కుశాల్ మెండిస్ దాన్ని అందుకోలేకపోయాడు. ఈ రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకున్న 38 ఏళ్ల రోహిత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ముఖ్యంగా గుజరాత్ స్పిన్నర్లు సాయి కిషోర్, రషీద్ ఖాన్‌లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు.

ఈ మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, ఐపీఎల్‌లో 300 సిక్సర్ల మార్క్‌ను కూడా దాటాడు. 'యూనివర్సల్ బాస్' క్రిస్ గేల్ (357 సిక్సర్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 302 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 291 సిక్సర్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 


More Telugu News