డ్రగ్స్ తీసుకున్నారా? అనే ప్రశ్నకు ఎలాన్ మస్క్ సమాధానం ఇదే

  • ఎలాన్ మస్క్ డ్రగ్స్ వాడకంపై అంతర్జాతీయ మీడియా కథనం
  • ఆరోపణలను తీవ్రంగా ఖండించిన బిలియనీర్ మస్క్
  • అవి తప్పుడు కథనాలంటూ మీడియాపై వ్యాఖ్య
తాను కొన్ని రకాల డ్రగ్స్‌ వినియోగిస్తున్నానంటూ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ తీవ్రంగా ఖండించారు. వైట్‌హౌస్‌లో సలహాదారుగా ఉన్నప్పుడు కూడా డ్రగ్స్‌ వాడారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా, అది తప్పుడు కథనాలు ప్రచురించే మీడియా సంస్థ అని ఆయన మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడికి సలహాదారు పదవి నుంచి వైదొలగిన సందర్భంగా మే 30న ఓవల్‌ ఆఫీసులో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో మస్క్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

డొనాల్డ్ ట్రంప్‌నకు సన్నిహిత సలహాదారుల్లో ఒకరిగా ఉన్నప్పుడు మస్క్‌ విపరీతంగా మాదకద్రవ్యాలు వినియోగించారని, కెటమిన్‌ తరచుగా తీసుకునేవారని, దీనివల్ల మూత్రాశయ సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక కథనం ప్రచురించింది. అయితే, గతంలో తాను మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు వైద్యుడి సూచన మేరకే కెటమిన్‌ తీసుకున్నానని మస్క్‌ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. టెస్లా పనితీరుపై ప్రభావం పడకూడదనే తాను అలా చేశానని ఆయన వివరించారు.

కాగా, వీడ్కోలు సమయంలో మస్క్‌ కంటిపై నల్లటి గాయం కనిపించడం చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన ఆయన, తన కుమారుడు ‘ఎక్స్‌’ కొట్టడం వల్లే ఆ గాయమైందని తెలిపారు. అయితే, డ్రగ్స్‌ వినియోగంపై వార్తలు వస్తున్న తరుణంలోనే ఈ గాయం కనిపించడంతో నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 


More Telugu News