పాత బకాయిల చెల్లింపు తర్వాతే పీఆర్సీ: సీఎం హామీని వివరించిన అశోక్ బాబు

  • సీఎం చంద్రబాబు ఉద్యోగులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని అశోక్ బాబు కితాబు
  • పాత బకాయిలు చెల్లించాకే కొత్త పీఆర్సీపై సీఎం చంద్రబాబు స్పష్టత
  • కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపై దృష్టి సారించాలని విజ్ఞప్తి
  • అవర్లీ లెక్చరర్ల జీతాల పెంపును ప్రస్తావించిన అశోక్ బాబు
  • వ్యక్తిగత ప్రయోజనాలు వీడి ఐక్యంగా పనిచేయాలని ఉద్యోగ సంఘాలకు పిలుపు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు కొనియాడారు. ముఖ్యంగా పాత బకాయిల చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని, ఆ తర్వాతే పీఆర్సీ ప్రక్రియ చేపడతామని చెప్పారని ఆయన తెలిపారు. ఉద్యోగ సంఘాల సమావేశంలో అశోక్ బాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన పీఆర్సీ (వేతన సవరణ సంఘం) ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో తాను చర్చించినట్లు అశోక్ బాబు వెల్లడించారు. "పీఆర్సీ కమిషన్ వేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. అయితే, పాత బకాయిలు చెల్లించిన తర్వాతే కొత్త పీఆర్సీ ప్రక్రియను ప్రారంభిద్దాం. లేకపోతే పాతవి, కొత్తవి కలిపి ప్రభుత్వానికి చెల్లింపులు కష్టమవుతాయి అని సీఎం చంద్రబాబు నాతో స్పష్టంగా చెప్పారు" అని అశోక్ బాబు వివరించారు. వారం, పది రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుని, దశలవారీగా పాత బకాయిలు చెల్లించి, అనంతరం పీఆర్సీ ప్రక్రియను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. గతంలో 1000 కోట్లు, ఇటీవల మరో 7000-8000 కోట్లు ఉద్యోగులకు చెల్లించారని, బ్యాలెన్స్ సున్నా చేయడం ఇదే మొదటిసారని అశోక్ బాబు గుర్తుచేశారు.

కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుదల, వారి సర్వీసుల క్రమబద్ధీకరణ వంటి అంశాలు కూడా పీఆర్సీతో ముడిపడి ఉన్నాయని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. నెలకు 10,000, 15,000, 20,000 రూపాయలతో వారు ఎలా జీవిస్తున్నారో ఆలోచించాలని, లక్షకు పైగా జీతం తీసుకుంటున్న ఉద్యోగులు వారి సమస్యల గురించి కూడా మాట్లాడాలని ఆయన సూచించారు. సమాన పనికి సమాన వేతనం అనే నినాదాన్ని అందరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో తాము, లోకేశ్ గారు చొరవ చూపడంతో అవర్లీ లెక్చరర్ల జీతాలను 10,500 రూపాయల నుంచి 27,500 రూపాయలకు పెంచిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తక్కువ జీతంతో ఎంఫిల్ చదివిన లెక్చరర్ పాఠాలు చెబితే, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగ సంఘాల తీరుపై కూడా అశోక్ బాబు స్పందించారు. "ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు గ్రూపులుగా విడిపోయాయి. కొందరు అమ్ముడుపోయారు, మరికొందరు రాజకీయ లబ్ధి కోసం వివిధ పార్టీల చుట్టూ తిరుగుతున్నారు" అని ఆయన విమర్శించారు. ఎన్జీవో సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేదని స్పష్టం చేస్తూనే, మారుతున్న కాలానికి అనుగుణంగా కొంత రాజకీయపరమైన అవగాహన, లాబీయింగ్ అవసరమని అభిప్రాయపడ్డారు. ఎక్కడ ఉద్యమించాలో, ఎక్కడ చర్చలు జరపాలో నాయకత్వం సరైన సమయంలో నిర్ణయించుకోవాలని సూచించారు.

తాను 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా, సెంట్రల్ ఆఫీస్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఉద్యోగుల కోసం అనేక విషయాల్లో కృషి చేశానని, కొన్నిసార్లు వారి కోసం చేసిన పనులకు తానే ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని అశోక్ బాబు అన్నారు. "పీఆర్సీ ఇప్పిస్తే కిందిస్థాయి ఉద్యోగులకు కూడా ప్రయోజనం కలుగుతుంది, వారి బతుకుల్లో కొద్దో గొప్పో వెలుగులు వస్తాయనేదే నా ఆలోచన" అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగులకు సంబంధించినవి కావని, ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని, ఫైనాన్స్ వ్యవహారాలు ప్రభుత్వం చూసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కింది స్థాయి ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోకుండా, మానవతా దృక్పథం లేకుండా కేవలం తమ గురించే ఆలోచిస్తే ప్రయోజనం ఉండదని హితవు పలికారు. 

సీఎం చంద్రబాబు పైకి కనిపించే వ్యక్తి వేరని, లోపల వ్యక్తి వేరని, గతంలో రైతు రుణమాఫీ కింద ఇవ్వాల్సిన వాయిదా లాంటి 5400 కోట్ల రూపాయల పీఆర్సీ ఎరియర్లను ఉద్యోగులకు అందించారని, యనమల రామకృష్ణుడు సూచన మేరకు ఆ మొత్తం చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పుడు నాయకత్వం కూడా దానికి తగ్గట్టుగా వ్యవహరించాలని అశోక్ బాబు సూచించారు.


More Telugu News