ఐపీఎల్ ఫైనల్: వర్షం అంతరాయం కలిగిస్తే విజేత ఎవరు? నియమాలు ఇవే!

  • ఆర్సీబీ, పంజాబ్ మధ్య అహ్మదాబాద్‌లో నేడు తుది సమరం
  • వర్షం పడితే అదనంగా రెండు గంటల సమయం కేటాయింపు
  • అప్పటికీ సాధ్యం కాకపోతే రిజర్వ్ డే లేదా సూపర్ ఓవర్
  • రెండు రోజులూ ఆట సాధ్యం కాకుంటే పంజాబ్‌ కింగ్స్‌కే టైటిల్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2025 టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కీలక పోరుకు వర్షం ముప్పు పొంచి ఉండటంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వాతావరణం అనుకూలించక మ్యాచ్‌కు అంతరాయం కలిగితే పరిస్థితి ఏంటి? విజేతను ఎలా నిర్ణయిస్తారు? అనే ప్రశ్నలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. 

వర్షం పడితే ఏం చేస్తారు?
షెడ్యూల్ ప్రకారం ఇవాళ జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డుతగిలితే, తొలుత ఆటను పూర్తి చేయడానికి అధికారులు 120 నిమిషాల (రెండు గంటల) అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ఈ అదనపు సమయాన్ని ఉపయోగించుకుని మ్యాచ్‌ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11:56 గంటల వరకు కూడా పూర్తి 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే, కనీసం చెరో ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించి ఫలితాన్ని తేల్చేందుకు ప్రయత్నిస్తారు. ఇది ఒక మ్యాచ్ ఫలితాన్ని నిర్ధారించడానికి అవసరమైన కనీస ఓవర్ల సంఖ్య.

సూపర్ ఓవర్ మరియు రిజర్వ్ డే
ఒకవేళ పరిస్థితులు అనుకూలించక, కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించడం సాధ్యపడని పక్షంలో నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్ కూడా టై అయితే, సమయం ఉన్నంత వరకు మరో సూపర్ ఓవర్, అదీ టై అయితే ఇంకో సూపర్ ఓవర్ చొప్పున ఆడిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా సూపర్ ఓవర్ నిర్వహించడం కూడా అసాధ్యమైతే, అప్పుడు ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే అయిన బుధ‌వారం (జూన్ 4న) మ్యాచ్‌ను నిర్వహిస్తారు. రిజర్వ్ డే రోజున, అంతకుముందు రోజు మ్యాచ్ ఏ దశలో ఆగిపోయిందో, అక్కడి నుంచే కొనసాగిస్తారు. లేదా ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దయివుంటే, రిజర్వ్ డే రోజున కొత్తగా మ్యాచ్ ప్రారంభిస్తారు.

రెండు రోజులూ ఆట రద్దయితే?
అత్యంత అరుదైన సందర్భంలో షెడ్యూల్డ్ రోజు (జూన్ 3), రిజర్వ్ డే (జూన్ 4) రోజు కూడా వర్షం కారణంగా ఆట పూర్తిగా రద్దయితే, అప్పుడు ఐపీఎల్ నియమావళి ప్రకారం లీగ్ దశ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచింది కాబట్టి, ఒకవేళ రెండు రోజులూ ఆట సాధ్యం కాకపోతే పీబీకేఎస్‌ను విజేతగా ప్రకటిస్తారు. 

కాగా, వాతావరణ శాఖ‌ వివ‌రాల ప్ర‌కారం... అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం కొద్దిసేపు వర్షం పడే అవకాశం ఉంది. ఇక‌, క్వాలిఫ‌య‌ర్‌-2 కూడా వ‌ర్షం కార‌ణంగా ఆల‌స్యంగా మొద‌లైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొంది. ఫైన‌ల్‌కు వ‌రుణుడు అడ్డంకిగా మార‌కూడ‌ద‌ని, పూర్తి మ్యాచ్ జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నారు.  


More Telugu News