జపాన్ ప్రైవేటు సంస్థ 'ఐస్పేస్' మూన్ మిషన్ విఫలం.. ల్యాండర్‌తో తెగిన సంబంధాలు

  • జపాన్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ 'ఐస్పేస్' చంద్రయాత్రలో అపశ్రుతి
  • చంద్రుడిపై దిగే సమయంలో 'రెసిలెన్స్' ల్యాండర్‌తో కమ్యూనికేషన్ పూర్తిగా కట్
  • ఈ ఉదయం 8 గంటలకు సంబంధాలు తెగిపోయాయని ఐస్పేస్ వెల్లడి
  •  ల్యాండర్‌ను తిరిగి సంప్రదించడం అసాధ్యమని, మిషన్ ముగిసినట్లు ప్రకటన
  •  ఐస్పేస్ సంస్థకు ఇది వరుసగా రెండో వైఫల్యం
జపాన్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఐస్పేస్' చేపట్టిన చంద్రుడి యాత్ర మరోసారి విఫలమైంది. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అవ్వాలన్న వారి ఆశలు ఆవిరయ్యాయి. సంస్థ ప్రయోగించిన 'రెసిలెన్స్' అనే ల్యాండర్ జాబిల్లిపై దిగే కీలక సమయంలో భూ నియంత్రణ కేంద్రంతో సంబంధాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఐస్పేస్ మిషన్ కంట్రోలర్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.

ఈ ఉదయం 8 గంటల సమయంలో 'రెసిలెన్స్' ల్యాండర్‌తో కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయినట్లు ఐస్పేస్ తెలిపింది. తెగిపోయిన సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలు ఫలించలేదని, ఇక అది సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొంది. దీంతో, ఈ మూన్ మిషన్‌ను ముగించినట్లు వారు ప్రకటించారు. ల్యాండర్ విఫలం కావడానికి గల కచ్చితమైన కారణాలను అన్వేషిస్తున్నామని ఐస్పేస్ వ్యవస్థాపకుడు, సీఈవో తకేషి హకమడ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఏడాది జనవరిలో అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 'రెసిలెన్స్' ల్యాండర్‌ను ప్రయోగించారు. సుమారు ఐదు నెలల సుదీర్ఘ ప్రయాణం అనంతరం మేలో ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. ముందుగా నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ఈ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై 'మేర్ ఫ్రిగోరిస్' (చలి సముద్రం) అనే నిర్దిష్ట ప్రదేశంలో సాఫ్ట్‌గా ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే, చంద్రుడి కక్ష్య నుంచి విడిపోయి ల్యాండింగ్ ప్రదేశం వైపు వెళ్తున్న సమయంలోనే మిషన్ కంట్రోల్ కేంద్రానికి ల్యాండర్‌తో ఉన్న అన్ని రకాల సంబంధాలు తెగిపోయాయి.

కాగా, చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపేందుకు ఐస్పేస్ సంస్థ ప్రయత్నించడం ఇది రెండవసారి. 2023లో కూడా ఇలాంటి ఒక ప్రయోగాన్ని చేపట్టగా, అప్పుడు కూడా అది విఫలమైంది. ఇదిలా ఉంటే, చంద్రుడిపై విజయవంతంగా కాలుమోపిన ఐదో దేశంగా జపాన్ ఇప్పటికే చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. గత ఏడాది జపాన్ ప్రభుత్వ అంతరిక్ష సంస్థ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (స్లిమ్) అనే ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగింది. అయితే, ప్రైవేటు సంస్థ ఐస్పేస్ ప్రయత్నాలు మాత్రం ఇంకా ఫలించలేదు.


More Telugu News