హృదయ విదారకం.. పిల్లలకు చిప్స్ కొనిచ్చి రైలు కిందకు తోసేసిన తండ్రి.. తానూ ఆత్మహత్య

  • హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘటన
  • భార్యతో గొడవపడి నలుగురు కొడుకులతో తండ్రి ఆత్మహత్య
  • రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్న వైనం
  • మృతుడు బీహార్‌కు చెందిన దినసరి కూలీ మనోజ్ కుమార్‌గా గుర్తింపు
  • ఘటనకు ముందు పిల్లలకు చిప్స్, కూల్ డ్రింక్స్ కొనిచ్చిన తండ్రి
హర్యానాలోని ఫరీదాబాద్‌లో హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది. భార్యతో జరిగిన గొడవ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి, తన నలుగురు చిన్న పిల్లలతో సహా వేగంగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం బల్లభ్‌గఢ్‌లో చోటుచేసుకుంది. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... బీహార్‌లోని సీతామర్హికి చెందిన మనోజ్ కుమార్ (45) అనే వ్యక్తి దినసరి కూలీగా పనిచేస్తూ ఫరీదాబాద్‌లోని సుభాశ్‌ కాలనీలో తన కుటుంబంతో క‌లిసి నివసిస్తున్నాడు. ఈ కాలనీ రైల్వే ట్రాక్‌లకు కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉంది. నిన్న మధ్యాహ్నం మనోజ్ కుమార్ తన నలుగురు కుమారులతో కలిసి ఆల్సన్ చౌక్ వద్ద జీటీ రోడ్డుపై ఉన్న రైల్వే ఓవర్‌బ్రిడ్జి సమీపంలో రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. 

గోల్డెన్ టెంపుల్ మెయిల్ డ్రైవర్ మధ్యాహ్నం సుమారు 1:20 గంటలకు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సమాచారం అందించారు. రైలు ఢీకొన్న తీవ్రతకు మృతదేహాలు ఛిద్రమై ట్రాక్‌పై సుమారు 100 నుంచి 200 మీటర్ల దూరం వరకు చెల్లాచెదురుగా పడిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ దారుణానికి పాల్పడటానికి ముందు మనోజ్ కుమార్ అరగంటకు పైగా తన పిల్లలతో రైల్వే ట్రాక్ సమీపంలో కూర్చున్నట్లు కొందరు స్థానికులు చెప్పారు. ఆ సమయంలో మనోజ్ తన పిల్లలకు చిప్స్, కూల్ డ్రింక్స్ కూడా కొనిచ్చినట్లు తెలిసింది. అయితే, ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఎవరూ ఊహించలేకపోయారు.

భార్య ప్రవర్తనపై అనుమానంతో మనోజ్ తరచూ గొడవపడేవాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మంగళవారం ఉదయం కూడా భార్య ప్రియతో మనోజ్‌కు తీవ్ర వాగ్వాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పిల్లలను పార్కుకు తీసుకెళ్తున్నానని భార్యకు చెప్పి, వారిని రైల్వే ట్రాక్‌ల వద్దకు తీసుకువచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మనోజ్ జేబులో లభించిన ఆధార్ కార్డు, అతని భార్య ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలు సేకరించారు. భార్య ప్రియకు విషయం తెలియజేసి ఘటనా స్థలానికి తీసుకురాగా.. భర్త, పిల్లల మృతదేహాలను చూసి ఆమె కుప్పకూలిపోయారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఫరీదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News