పదవి లేకున్నా ప్రజాసేవ.. పార్టీ బలోపేతమే ధ్యేయం: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

  • ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న మునుగోడు ఎమ్మెల్యే
  • నూతన మంత్రులకు అభినందనలు
  • పదవులు, అధికారం రాజకీయాలకు ముఖ్యం కాదని వ్యాఖ్య
  • ప్రజల మధ్య పనిచేయడమే శక్తిమంతమైన మార్గమని స్పష్టీకరణ
తనకు మంత్రి పదవి దక్కనందుకు బాధగా లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రిని కాకపోయినప్పటికీ పార్టీ బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తానని, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం 'ఎక్స్' వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇటీవల జరిగిన క్యాబినెట్ విస్తరణలో భాగంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు రాజగోపాల్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ప్రజలకు సేవ చేసే విషయంలో వారు పూర్తిస్థాయిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. రాజకీయాలంటే కేవలం పదవులు, అధికారంతో ముడిపడినవి కావని పేర్కొన్నారు. ప్రజల పట్ల తనకున్న నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణంపై ఉన్న ఆకాంక్షలే తనను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చేలా ప్రోత్సహించాయని ఆయన గుర్తుచేశారు.

తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ముగిసిపోదని, కొన్ని సందర్భాల్లో ఎలాంటి పదవిలో లేనప్పటికీ ప్రజల మధ్య ఉంటూ పనిచేసే అవకాశమే మరింత శక్తిమంతంగా మారుతుందని తాను విశ్వసిస్తున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాను ఆ మార్గాన్నే ఎంచుకున్నట్లు ఆయన స్పష్టంచేశారు. మంత్రిగా అవకాశం రాకపోయినప్పటికీ, ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ, పార్టీ అభివృద్ధికి దోహదపడతానని పేర్కొన్నారు.


More Telugu News