బాబాయ్‌ ని తిట్టే సీన్లలో ఇబ్బందిపడ్డా..: రానా దగ్గుబాటి

  • ‘రానా నాయుడు 2’ ప్రమోషన్స్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించిన నటుడు
  • తెలుగు డబ్బింగ్‌లో బాబాయ్‌ను తిట్టలేకపోయా
  • బాబాయ్‌తో కలిసి నటించాలన్న కల నెరవేరింది
  • వెంకటేశ్‌తో సీన్లపై రానా ఆసక్తికర వ్యాఖ్యలు
వెంకటేశ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రానా నాయుడు 2’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2023లో విడుదలైన మొదటి భాగానికి మంచి స్పందన లభించగా, రెండో భాగం రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

సిరీస్‌లో బాబాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి రావడం గురించి రానా మాట్లాడుతూ ‘‘హిందీలో కొన్ని పదాలకు నాకు సరైన అర్థం తెలియదు. మొదటి భాగం డబ్బింగ్ సమయంలో వాటిని కేవలం డైలాగ్స్‌గానే పలికాను తప్ప, బాబాయ్‌ని తిడుతున్నాననే భావన కలగలేదు. కానీ, తెలుగు డబ్బింగ్‌కు వచ్చేసరికి చాలా ఇబ్బంది పడ్డాను. అయితే, నటీనటులుగా పాత్రల్లోకి ప్రవేశించినప్పుడు ఇలాంటివి తప్పవని అర్థం చేసుకున్నాను’’ అని తెలిపారు.

చిన్నప్పటి నుంచి బాబాయ్ వెంకటేశ్‌తో కలిసి పనిచేయాలని కలలు కన్నానని, ఈ సిరీస్‌తో ఆ కోరిక నెరవేరిందని రానా ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి ప్రాజెక్ట్‌లో మేమిద్దరం కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఇది చాలా విభిన్నమైన సిరీస్. నటుడిగా ఆయన మాలో ఎంతో స్ఫూర్తి నింపారు. సెట్‌లో నన్ను నేను మరింత మెరుగుపరచుకోవడానికి ఆయన ప్రోత్సహించేవారు. సిరీస్‌లో నా పాత్ర పేరు రైనా అయినా, బాబాయ్ నన్ను తరచూ ‘రానా రానా’ అని పిలిచేవారు. కొన్నిసార్లు డైలాగ్ చెబుతున్నప్పుడు, ఆయన నన్ను తిడుతున్నారో లేక పాత్రను తిడుతున్నారో అర్థమయ్యేది కాదు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు.

యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ‘రానా నాయుడు’ సిరీస్‌కు సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సిరీస్, అసభ్య పదజాలం ఎక్కువగా ఉందంటూ కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ, తమ కుటుంబ సభ్యులందరూ ఈ సిరీస్‌ను వీక్షించారని రానా పేర్కొన్నారు.


More Telugu News