అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఫ్లైట్ నెంబర్ 171కు వీడ్కోలు!

  • అహ్మదాబాద్-లండన్ గ్యాట్విక్ విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
  • 'ఏఐ 171' ఫ్లైట్ నంబర్‌ను నిలిపివేసిన సంస్థ
  • 'ఐఎక్స్ 171' నంబర్‌ను కూడా తొలగించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
  • ప్రమాద మృతులకు నివాళిగా చర్యలు
  • జూన్ 17 నుంచి 'ఏఐ 159' కొత్త నంబర్‌తో అహ్మదాబాద్-లండన్ సర్వీస్
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం 'ఏఐ 171' టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలి 274 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నేపథ్యంలో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై '171' ఫ్లైట్ నంబర్‌ను నిలిపివేయాలని నిర్ణయించాయి. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది.

ఈ దుర్ఘటన తర్వాత, మృతులకు నివాళిగా '171' ఫ్లైట్ నంబర్‌ను శాశ్వతంగా నిలిపివేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. సాధారణంగా, ప్రాణాంతకమైన ప్రమాదాలు జరిగినప్పుడు విమానయాన సంస్థలు సంబంధిత ఫ్లైట్ నంబర్లను ఉపయోగించడం మానేస్తాయి.

ఈ నిర్ణయానికి అనుగుణంగా, అహ్మదాబాద్-లండన్ గ్యాట్విక్ సర్వీసును జూన్ 17 నుంచి 'ఏఐ 171' స్థానంలో 'ఏఐ 159' కొత్త ఫ్లైట్ నంబర్‌తో నడపనున్నారు. ఇందుకు సంబంధించిన మార్పులను ఎయిర్ ఇండియా శుక్రవారమే తమ బుకింగ్ సిస్టమ్‌లో అమలు చేసిందని సమాచారం. ఇదే బాటలో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా తమ 'ఐఎక్స్ 171' ఫ్లైట్ నంబర్‌ను నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు ధృవీకరించాయి.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2020లో కోజికోడ్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాదంలో 21 మంది మరణించినప్పుడు కూడా ఆ సంస్థ సంబంధిత విమాన ఫ్లైట్ నంబర్‌ను నిలిపివేసింది.


More Telugu News