‘ఏదో తేడాగా ఉంది’.. విమానం టేకాఫ్‌కు ముందు భర్తకు ఫోన్ చేసిన భార్య

  • లండన్‌లో బేబీ షవర్ కోసం వెళ్తూ విమాన ప్రమాదంలో ముగ్గురు కుటుంబ సభ్యుల మృతి
  • వడోదరకు చెందిన యాస్మిన్ వోరా, ఆమె మేనల్లుడు పర్వేజ్, అతడి నాలుగేళ్ల కుమార్తె జువేరియా దుర్మరణం
  • పర్వేజ్‌ కుటుంబంతో కలిసి వెళ్లేందుకు యాస్మిన్ తన ప్రయాణ తేదీని మార్చుకున్న వైనం
  • టేకాఫ్‌కు ముందు విమానం ఏసీ పనిచేయడం లేదని, ఆందోళనగా ఉందని భర్తకు ఫోన్
  • ఆ తర్వాత కొద్దిసేపటికే కుప్పకూలిన విమానం
లండన్‌లో జరగాల్సిన బేబీ షవర్ వేడుకకు బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. వడోదరకు చెందిన యాస్మిన్ వోరా (51), ఆమె మేనల్లుడు పర్వేజ్ వోరా (30), ఆయన నాలుగేళ్ల కుమార్తె జువేరియా ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త వారి కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది.

యాస్మిన్ వోరా వాస్తవానికి జూన్ 9వ తేదీనే లండన్‌కు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే, థాస్రాకు చెందిన తన మేనల్లుడు పర్వేజ్, అతని కుమార్తె జువేరియాతో కలిసి ప్రయాణించేందుకు ఆమె తన టికెట్‌ను 12వ తేదీకి మార్చుకున్నారని యాస్మిన్ భర్త యాసిన్ కన్నీటిపర్యంతమయ్యారు. లండన్‌లో స్థిరపడిన తమ ఇద్దరు కుమారుల పిల్లల బేబీ షవర్ కార్యక్రమాల కోసం యాస్మిన్ సుమారు ఐదు నుంచి ఆరు నెలల పాటు అక్కడే ఉండాలని ప్రణాళిక వేసుకున్నట్లు ఆయన తెలిపారు.

12న యాసిన్ స్వయంగా యాస్మిన్‌ను అహ్మదాబాద్ విమానాశ్రయంలో డ్రాప్ చేశారు. విమానం టేకాఫ్ అవడానికి కొద్ది నిమిషాల ముందు యాస్మిన్ తన భర్త యాసిన్‌కు ఫోన్ చేసి విమానంలో ఏసీ సరిగ్గా పనిచేయడం లేదని, తనకు ఏదో తెలియని ఆందోళనగా, అదోలా అనిపిస్తోందని చెప్పినట్టు యాసిన్ గుర్తుచేసుకున్నారు. "అలాంటిదేమీ ఉండదు, కాసేపటికి ఏసీ ఆన్ అవుతుందిలే అని నేను ఆమెకు ధైర్యం చెప్పాను" అని ఆయన ఆ చివరి సంభాషణను తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

యాసిన్ విమానాశ్రయం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత లండన్ బయలుదేరిన విమానం కుప్పకూలిపోయిందని బంధువుల నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ వార్త విన్న ఆయన నిర్ఘాంతపోయారు. మధ్యాహ్నం 3 గంటల కల్లా అందిన మృతుల జాబితాలో యాస్మిన్, పర్వేజ్, జువేరియా పేర్లు ఉండటంతో వారి కుటుంబంలో పెను విషాదం నెలకొంది. 


More Telugu News