ఫార్ములా-ఈ కేసు: కేటీఆర్‌కు 8 గంటల పాటు 60 ప్రశ్నలు సంధించిన ఏసీబీ అధికారులు!

  • ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌ పై ఆరోపణలు
  • నేడు ఏసీబీ సుదీర్ఘ విచారణ
  • హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంపైనే ప్రధానంగా ప్రశ్నలు
  • ఎఫ్ఈవోకు నిధులు బదిలీ చేశా, లబ్ధి పొందలేదన్న కేటీఆర్
ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ సోమవారం ముగిసింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయనను దాదాపు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఉదయం ప్రారంభమైన విచారణలో సుమారు 60 ప్రశ్నలను కేటీఆర్‌పై సంధించినట్లు సమాచారం. ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించడం ఇది రెండోసారి.

ఎఫ్ఈవో (ఫార్ములా ఈ ఆపరేషన్స్) కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించారని సమాచారం. ప్రధానంగా హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధులను ఎలా మళ్లించారన్న అంశాలపై ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించారు.

ఏసీబీ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు చెప్పారు. హెచ్ఎండీఏ నిధులను ఎఫ్ఈవో సంస్థకు నిబంధనల ప్రకారమే పంపామని, ఈ వ్యవహారంలో తాను వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధి పొందలేదని ఆయన అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్ల వ్యవహారమంతా అధికారులే చూసుకున్నారని, స్పాన్సర్లు చివరి నిమిషంలో వెనక్కి తగ్గడంతో హెచ్ఎండీఏ నిధులతో ఫీజులు చెల్లించాల్సి వచ్చిందని కేటీఆర్ వివరించినట్లుగా తెలుస్తోంది.


More Telugu News