‘అయ్యా.. నేను బతికే ఉన్నాను!.. ప్లకార్డుతో కలెక్టర్ వద్దకు మహిళ

  • ఉత్తరప్రదేశ్‌లో ఆస్తి కోసం దాయాదుల దారుణం
  • బతికున్న మహిళనే చనిపోయినట్లు రికార్డుల తారుమారు
  • తండ్రి వీలునామా రాసిన ఆస్తిని దక్కించుకునేందుకు బంధువుల కుట్ర
  • వారం రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎస్డీఎంకు డీఎం ఆదేశం
  • నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం జారీపై కఠిన చర్యలు
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్తిని కాజేయాలనే దురుద్దేశంతో కొందరు బంధువులు బతికున్న మహిళనే చనిపోయినట్టు రికార్డులు సృష్టించారు. ఈ దారుణంపై బాధితురాలు ‘అయ్యా, నేను బతికే ఉన్నాను’ అని రాసి ఉన్న కాగితాన్ని ప్రదర్శిస్తూ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి చేరుకుని న్యాయం కోసం మొరపెట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. శారదా దేవి అనే మహిళ తన తండ్రికి ఏకైక సంతానం. ఆమె తండ్రి మరణానికి ముందే తన యావదాస్తిని కుమార్తె శారదా దేవి పేరు మీద వీలునామా రాశారు. తండ్రి మరణానంతరం తొలుత ఆస్తి మొత్తం చట్టప్రకారంగా ఆమె పేరు మీదకు బదిలీ అయింది. అయితే, కొన్నేళ్ల తర్వాత శారదా దేవి తండ్రి అన్న కొడుకులు (దాయాదులు) కుట్ర పన్నారు. శారదా దేవి మరణించినట్టు తప్పుడు రికార్డులను సృష్టించి, ఆస్తిని తమ పేరు మీదకు మార్చుకున్నారు.

ఈ మోసపూరిత బదిలీ జరిగిన నాటి నుంచి తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి శారదా దేవి అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తహసీల్ స్థాయిలో తనకు న్యాయం జరగకపోవడంతో చివరికి జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్‌ను ఆశ్రయించారు. "కేవలం నా ఆస్తిని లాక్కోవడం కోసమే, బతికుండగానే నన్ను చనిపోయినట్టుగా ప్రకటించారు" అంటూ తన చేతిలోని కాగితాన్ని చూపిస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఫిర్యాదు అందినట్టు జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ ధ్రువీకరించారు. శారదా దేవి అనే మహిళ తనను కలిసి, తన తండ్రి ఆస్తిని వీలునామా ద్వారా తనకు ఇచ్చారని, దాని ప్రకారం మ్యుటేషన్ కూడా జరిగిందని తెలిపే పత్రాలు సమర్పించినట్టు ఆయన చెప్పారు. అయితే, ఆమె దాయాదులు ఆమె చనిపోయినట్టు తప్పుడు సమాచారం ఇచ్చి, మ్యుటేషన్‌ను సవరించి తమ పేర్ల మీదకు మార్చుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు.

ఈ ఫిర్యాదులో ప్రాథమికంగా వాస్తవం ఉన్నట్టు కనిపిస్తోందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)ను ఆదేశించినట్టు రవీంద్ర కుమార్ తెలిపారు. ఒకవేళ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఉపయోగించినట్టు తేలితే, ఆ పత్రం జారీలో పాలుపంచుకున్న అధికారులతో సహా బాధ్యులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దోషులపై కేసు కూడా నమోదు చేస్తామని జిల్లా మేజిస్ట్రేట్ హామీ ఇచ్చారు.


More Telugu News