లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు!

  • నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్
  • శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న భారత జట్టు
  • హెడింగ్లీ టెస్టుకు వాతావరణం అడ్డంకిగా మారే సూచనలు
  • రెండు రోజుల పాటు వర్షం.. ఐదు రోజులు మేఘావృత వాతావరణం
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సమరానికి రంగం సిద్ధమైంది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో నేటి తొలి టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టుల నుండి వైదొలగడంతో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అయితే, ఈ కీలకమైన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుతో పాటు ప్రతికూల వాతావరణం కూడా గిల్ సేనకు పెను సవాల్ విసిరేలా కనిపిస్తోంది.

వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, హెడింగ్లీలో మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు ఆకాశం ఎక్కువగా మేఘాలతో కప్పబడి ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులు సాధారణంగా పేస్ బౌలర్లకు అనుకూలిస్తాయి. బ్యాటర్లకు మాత్రం కఠిన సవాల్‌గా మారతాయి. దీనికి తోడు మ్యాచ్ జరిగే సమయంలో రెండు రోజుల పాటు వర్షం కూడా అంతరాయం కలిగించే సూచనలున్నాయి. ముఖ్యంగా టెస్టులో రెండో, మూడో రోజు ఉదయం పూట సుమారు గంటసేపు వర్షం పడే అవకాశం ఉందని, ఇది ఆట సాగడానికి ఆటంకం కలిగించవచ్చని అంచనా. 

అంతేకాకుండా మూడో, నాలుగో రోజు సాయంత్రం వేళల్లో తేలికపాటి జల్లులు కురిసే సూచనలు కూడా ఉన్నాయి. ఈ జల్లుల వల్ల మరుసటి రోజు ఆటపై, ముఖ్యంగా అవుట్‌ఫీల్డ్‌పై ప్రభావం పడే వీలుంది. అయితే, మ్యాచ్ మొదటి రోజు, చివరిదైన ఐదో రోజు మాత్రం వాతావరణం ఆట సజావుగా సాగేందుకు అనుకూలంగా ఉంటుందని సమాచారం.

ఇంగ్లాండ్‌లో క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో వర్షం పడటం, వాతావరణం తరచూ మారడం చాలా సాధారణ విషయం. ఈ నేపథ్యంలో ఈ మొత్తం ఐదు టెస్టుల సిరీస్‌లో వరుణుడు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం హెడింగ్లీలో నెలకొన్న మేఘావృత వాతావరణం, వర్ష సూచన వంటి అంశాలు భారత జట్టు తుది కూర్పుపై (ప్లేయింగ్ ఎలెవన్‌పై) ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. 

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, టీమిండియా నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగే వ్యూహాన్ని పరిశీలించవచ్చు. అలాంటప్పుడు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్లలో ఒక్కరికి మాత్రమే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ వాతావరణ సవాళ్లను అధిగమించి గిల్ సేన ఎలా రాణిస్తుందో చూడాలి.


More Telugu News