నాలుగు క్యాచ్ లు వదిలేసిన జైస్వాల్... సిరాజ్ ఆగ్రహం

  • ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ ఫీల్డింగ్ విలవిల
  • నాలుగు కీలక క్యాచ్‌లు నేలపాలు.. సహచరుల అసహనం
  • గంభీర్ ముఖంలో కోపం!
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో హెడింగ్లీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఫీల్డింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ ఫీల్డింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు క్యాచ్‌లను అతను నేలపాలు చేశాడు. 

టెస్టు మ్యాచ్ చివరి రోజు, ఆట కీలక దశలో ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. భారత బౌలర్లు వికెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలో, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బెన్ డకెట్ కొట్టిన షాట్ టాప్ ఎడ్జ్ తీసుకుంది. జైస్వాల్ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి, ముందుకు డైవ్ చేసి బంతిని అందుకున్నట్టే అందుకుని వదిలేశాడు.

ఈ పరిణామంతో బౌలర్ సిరాజ్ తీవ్ర అసహనానికి గురవ్వగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కెమెరా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపు తిరిగినప్పుడు, అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం, ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు వదిలేసిన భారత ఫీల్డర్ల సరసన జైస్వాల్ నిలిచాడు.


More Telugu News