రియల్ ఎస్టేట్ దందా.. రూ.8 కోట్ల టోకరా.. వైసీపీ నేత కుమారుడు అరెస్ట్

  • ఏవీ ఇన్‌ఫ్రాకాన్‌ డైరెక్టర్ లక్ష్మీ విజయ్‌కుమార్‌ అరెస్ట్
  • ప్రీలాంచ్, బైబ్యాక్ స్కీముల పేరుతో ఘరానా మోసం
  • రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల మంది బాధితులు
  • వైసీపీ నేత, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు కుమారుడే నిందితుడు
రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీలాంచ్ ఆఫర్లు, బైబ్యాక్ హామీల పేరుతో వందలాది మందిని మోసగించి, కోట్లాది రూపాయలు దండుకున్నారన్న ఆరోపణలపై ఏవీ ఇన్‌ఫ్రాకాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ లక్ష్మీ విజయ్‌కుమార్‌ను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేశారు. సుమారు నెల రోజులుగా పరారీలో ఉన్న ఇతను, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్‌, వైసీపీ నేత గోగుల రమణారావు కుమారుడు కావడం గమనార్హం. ఈ మోసం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని వందలాది మంది నుంచి సుమారు రూ.8 కోట్లు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

సైబరాబాద్ ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్, ఏసీపీ హుస్సేన్‌నాయుడు బుధవారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందిన లక్ష్మీ విజయ్‌కుమార్‌ తేలికగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఈ మోసానికి పథకం పన్నాడు. తన అనుచరులతో కలిసి మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో ఏవీ ఇన్‌ఫ్రాకాన్, ఏవీ ఆర్గానో ఫామ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేర్లతో కార్యాలయాలను ప్రారంభించాడు. వాస్తవానికి తన వద్ద ఎలాంటి భూమి లేకపోయినా ఉన్నట్లుగా నమ్మించాడు.

ఆకర్షణీయమైన బ్రోచర్లు, వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రీలాంచ్‌ ఆఫర్లు, పెట్టుబడులపై అధిక రాబడి, బైబ్యాక్ గ్యారెంటీ వంటి హామీలిస్తూ ప్రజలను ఆకర్షించాడు. ప్లాట్లు కొనుగోలు చేస్తే తక్కువ కాలంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మించడంతో వందలాది మంది ఇతని వలలో చిక్కారు.

బాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం లక్ష్మీ విజయ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. దుర్వినియోగం చేసిన నిధుల లెక్క తేల్చేందుకు, మోసం పూర్తి స్వరూపాన్ని వెలికితీసేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News