యాదాద్రి జిల్లాలో... ఓ రిసార్ట్ లో ప్రేమజంట బలవన్మరణం

  • పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట సుధాకర్, సుష్మిత
  • బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని రిసార్ట్స్‌లో ఘటన 
  • బావ రంజిత్‌కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పిన సుధాకర్
  • మొబైల్ నెట్ వర్క్ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని రిసార్ట్స్‌లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. యువతి, యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా రామంతాపూర్ కేసీఆర్ నగర్‌కు చెందిన బంధబాల సుధాకర్ (39), రామంతాపూర్‌లోని గాంధీనగర్‌కు చెందిన పాసాల సుష్మిత (35) సమీప బంధువులు. వీరిద్దరూ వరుసకు బావమరదలు అవుతారు. ఇద్దరికీ వేర్వేరుగా వివాహాలు జరిగాయి. అయితే, వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో అక్రమ సంబంధం కొనసాగుతోందని ఇరు కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి.

ఈ కారణంగానే నల్గొండ జిల్లాలోని కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో సుష్మితపై ఆమె భర్త కేసు పెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన సుష్మిత సుధాకర్ వద్దకు వచ్చేసింది. వీరు ఇద్దరు రెండు రోజులుగా బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని రిసార్ట్స్‌లో గది అద్దెకు తీసుకుని అక్కడే ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం సమయంలో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ విషయాన్ని సుధాకర్ తన బావ రంజిత్‌కు వీడియో కాల్ చేసి చెప్పాడు. అయితే, వారు ఎక్కడ ఉన్నారో మాత్రం చెప్పలేదు. దీంతో రంజిత్ ఉప్పల్ పోలీసుల సహాయంతో బీబీనగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. ఈ క్రమంలో వారి మొబైల్ నెట్‌వర్క్ ఆధారంగా కొండమడుగు శివారులోని రిసార్ట్స్‌కు పోలీసులు చేరుకున్నారు.

వారు ఉంటున్న గది తలుపులు పగులగొట్టి చూడగా, ఇద్దరూ మృతి చెంది ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. 


More Telugu News