హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ ఖ్యాతి.. యూఐటీపీ అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు

  • జర్మనీలోని హాంబర్గ్‌లో యూఐటీపీ-2025 పురస్కారాల్లో ప్రత్యేక గుర్తింపు
  • 'ఆపరేషనల్ ఎక్సలెన్స్' విభాగంలో టాప్ 5 ఫైనలిస్ట్‌గా ఎంపిక
  • డేటా ఆధారిత సమర్థ నిర్వహణకు గాను ఈ పురస్కారం
  • ప్రపంచ వేదికపై మెట్రోను నిలపడం గర్వకారణమన్న ఎండీ కేవీబీ రెడ్డి
హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలుస్తున్న మెట్రో రైలు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. ప్రజా రవాణా రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే ప్రతిష్ఠాత్మక 'ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్' (యూఐటీపీ)-2025 పురస్కారాల్లో హైదరాబాద్ మెట్రోకు ప్రత్యేక గుర్తింపు లభించింది. జర్మనీలోని హాంబర్గ్‌లో ఇటీవల జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రవాణా సంస్థల నుంచి సుమారు 500 ఎంట్రీలు రాగా, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌) ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.

మెట్రో రైలు కార్యకలాపాలను సమర్థంగా నిర్వహిస్తూ, ఆదాయాన్ని పెంచుకునేందుకు రూపొందించిన 'ఆప్టిమైజ్డ్‌ మెట్రో ఆపరేషన్ ప్లాన్స్‌ లీడింగ్‌ టు ఇన్‌క్రీజ్డ్‌ రెవెన్యూ ఫర్‌ ట్రెయిన్‌' ప్రాజెక్టుకు గాను ఈ గుర్తింపు లభించింది. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టీఏ) సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 'ఆపరేషనల్ ఎక్సలెన్స్' కేటగిరీలో సమర్పించారు. డేటా ఆధారిత విధానాలతో నిర్వహణ సామర్థ్యాన్ని పెంచినందుకు గాను, ఈ కేటగిరీలో హైదరాబాద్ మెట్రో టాప్ 5 ఫైనలిస్టులలో ఒకటిగా నిలిచింది.

ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. "పట్టణ రవాణాలో అత్యుత్తమ విధానాలు పాటిస్తున్న సంస్థలకు యూఐటీపీ ఏటా పురస్కారాలు అందిస్తుంది. మా వినూత్న వ్యూహాలు, నిర్వహణ సామర్థ్యాలతో హైదరాబాద్ మెట్రోను ప్రపంచ వేదికపై నిలపడం గర్వంగా ఉంది" అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకోవడం హైదరాబాద్ మెట్రో అందిస్తున్న నాణ్యమైన సేవలకు నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News