గూగుల్ స్టోరేజ్ ను పైసా ఖర్చు లేకుండా పెంచుకోవచ్చు.. ఎలాగంటే?
- ఫోటోల క్వాలిటీ తగ్గించి స్టోరేజ్ ఆదా చేసుకునే వెసులుబాటు
- జియో, ఎయిర్‌టెల్ అందిస్తున్న ఉచిత క్లౌడ్ స్టోరేజ్ సేవలు వాడుకోవచ్చు
- ఫోటోల బ్యాకప్ కోసం మరో ఈ-మెయిల్ ఐడీ వినియోగించడం ఉత్తమం
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు "స్టోరేజ్ ఫుల్" అనే హెచ్చరిక చాలా సాధారణం. గూగుల్ అందించే జీమెయిల్, డ్రైవ్, ఫోటోస్ వంటి అన్ని సేవలకు కలిపి కేవలం 15 జీబీ ఉచిత స్టోరేజ్‌ను కేటాయిస్తారు. ఇది నిండిపోతే ముఖ్యమైన మెయిల్స్ కూడా రావడం ఆగిపోతుంది. అయితే, ఈ ఇబ్బందిని అధిగమించేందుకు టెక్ నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. వీటిని పాటిస్తే నెలనెలా డబ్బులు చెల్లిస్తూ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
- గూగుల్ వన్ స్టోరేజ్ మేనేజర్‌లోకి వెళ్లి ఏ సర్వీసులో ఎక్కువ స్పేస్ వాడుతున్నారో గమనించాలి. సాధారణంగా ఫొటోలతోనే గూగుల్ స్టోరేజ్ నిండిపోతుంది. అందులో పెద్ద సైజు వీడియోలు, డూప్లికేట్ ఫోటోలు, అనవసరమైన స్క్రీన్‌షాట్‌లను తొలగిస్తే చాలా వరకు స్థలం ఖాళీ అవుతుంది.
- అప్పటికీ స్టోరేజ్ సరిపోకపోతే పెద్ద సైజు ఉన్న ఫొటోలను కంప్రెస్ చేయాలని సూచిస్తున్నారు. గూగుల్ ఫోటోస్‌లో "స్టోరేజ్ సేవర్" ఆప్షన్ ఎంచుకుంటే, ఫోటోల నాణ్యత కొద్దిగా తగ్గినా స్టోరేజ్ భారీగా ఆదా అవుతుంది. అయితే, ఒకసారి కంప్రెస్ చేసిన ఫొటోలను తిరిగి ఒరిజినల్ క్వాలిటీకి మార్చే వీలుండదు.
- గూగుల్ టేక్‌అవుట్ సదుపాయంతో ఫోటోలు, వీడియోలను కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని, ఆ తర్వాత గూగుల్ ఖాతా నుంచి డిలీట్ చేయవచ్చు.
- జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం సంస్థలు తమ ప్లాన్‌లతో పాటు అందిస్తున్న ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను ఉపయోగించుకోవచ్చు.
- కేవలం ఫొటోలు, వీడియోల బ్యాకప్ కోసం ప్రత్యేకంగా మరో జీమెయిల్ ఖాతాను వాడటం వల్ల రెగ్యులర్ మెయిల్ ఐడీకి స్టోరేజ్ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ప్రభుత్వ డాక్యుమెంట్లను గూగుల్ డ్రైవ్‌కు బదులుగా డిజీలాకర్‌లో భద్రపరుచుకోవచ్చు.