పుతిన్‌తో ట్రంప్ చర్చలు.. గంటల వ్యవధిలోనే కీవ్‌పై రష్యా భీకర దాడి

  • పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరిపిన మరుసటి రోజే ఉక్రెయిన్‌పై రష్యా దాడి
  • 539 డ్రోన్లు, 11 క్షిపణులతో విరుచుకుపడిన మాస్కో సేనలు
  • కీవ్‌లోని పోలండ్ దౌత్య కార్యాలయానికి స్వల్ప నష్టం
  • 8 ప్రాంతాల్లో విధ్వంసం, 40 అపార్ట్‌మెంట్లు ధ్వంసం
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య యుద్ధ నివారణపై సుదీర్ఘ చర్చలు జరిగిన గంటల వ్యవధిలోనే మాస్కో సేనలు దాడులకు దిగడం కలకలం రేపింది. శుక్రవారం నాడు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాలపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడికి పాల్పడింది.

ఈ దాడుల్లో భాగంగా మొత్తం 539 డ్రోన్లు, 11 క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వాయుసేన వెల్లడించింది. కీవ్‌లో జరిగిన దాడిలో పోలండ్ దౌత్య కార్యాలయ భవనం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. దాడుల సమయంలో బాంబుల నుంచి రక్షించుకోవడానికి స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని మొత్తం 8 ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం జరిగినట్లు కీవ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడుల్లో సుమారు 40 అపార్ట్‌మెంట్లు, పలు పాఠశాలలు ధ్వంసమయ్యాయని తెలిపింది. అదేవిధంగా రైల్వే మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించింది. రైల్వే ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థకు నష్టం వాటిల్లడంతో పలు రైళ్లను వేరే మార్గాల్లో మళ్లించినట్లు ఉక్రెయిన్ రైల్వే శాఖ ఒక ప్రకటనలో వివరించింది.


More Telugu News