'సుపరిపాలనలో తొలి అడుగు'.. తిరుపతి రూరల్ లో పులివర్తి నాని పర్యటన

  • 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని
  • తిరుపతి రూరల్ మండలం మంగళం పంచాయతీలో విస్తృత పర్యటన
  • ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ తో కలిసి ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే
  • అభివృద్ధి పనుల వివరాలతో ప్రజలకు కరపత్రాల పంపిణీ
  • స్థానిక సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ప్రజలకు హామీ
సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తిరుపతి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి రూరల్ మండలంలోని మంగళం పంచాయతీలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌తో కలిసి ఆయన పర్యటించారు.

ముందుగా మంగళం పంచాయతీకి చేరుకున్న ఎమ్మెల్యే, ఎంపీలకు స్థానిక నాయకులు, మహిళలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వారు పంచాయతీ పరిధిలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో నేరుగా మాట్లాడారు. తిరుపతి రూరల్ మండలంలో తాము చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే పులివర్తి నాని, వాటిని వీలైనంత వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, పారదర్శక పాలన అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.


More Telugu News