acid attack: వరంగల్ లో యువతిపై యాసిడ్ దాడి చేసింది మాజీ ప్రియుడు... యువతి వివరాలు!
- యాసిడ్ దాడి బాధితురాలు మట్టెవాడకు చెందిన మాధురిగా గుర్తింపు
- ఆటో డ్రైవర్ చందుతో ప్రేమ
- అంతలోనే విభేదాలు.. అతనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపణలు
వరంగల్ అర్బన్ జిల్లాలో యాసిడ్ దాడికి గురైన బాధితురాలిని మట్టెవాడకు చెందిన మాధురిగా గుర్తించారు. బాధితురాలు అపస్మారక స్థితికి చేరడంతో ఎమర్జెన్సీ కేసుగా భావించిన ఎంజీఎం హాస్పిటల్ కు చెందిన వైద్యనిపుణులు ఆమెను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 80 శాతం గాయాలకు గురవడంతో కొన్ని గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వారు చెబుతున్నారు.
కాగా, ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో మాధురికి నాలుగేళ్ల క్రితం వివాహం జరగగా ఒక పిల్ల ఉన్నట్టు తెలుస్తోంది. భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న మాధురి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. రెండేళ్ల క్రితం చందు అనే ఆటోడ్రైవర్ తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
ఈ క్రమంలో వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అంతలోనే విభేదాలు తలెత్తడంతో పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమెపై కక్ష పెంచుకున్న చందు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని మాధురి చెల్లెలు ఆరోపించింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో మాధురి రెండోదని, తన సోదరి మంచిదని ఆమె చెబుతోంది. కాగా, చందు పరారీలో ఉన్నాడు. వారం రోజుల క్రితం ఇంటికి వచ్చి ఆమెను బెదిరించాడని ఆమె చెబుతోంది. నేడు ఆటోలో ఆమెను బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లాడని ఆమె ఆరోపిస్తోంది.