Anand Mahindra: రాఖీ పండుగ వేళ చెల్లికి క్షమాపణలు చెప్పిన వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా
- రక్షాబంధన్ సందర్భంగా తన సోదరి రాధికతో ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆనంద్
- బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ఒకరు కలర్ గా మార్చారని వెల్లడి
- ఫొటో తీసుకునే సమయానికి ఇంకా పుట్టని చెల్లెలు అనూజకు సారీ చెప్పిన ఆనంద్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేయడంతో పాటు వర్తమాన అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. అయితే, 'రక్షా బంధన్' సందర్భంగా చిన్నప్పుడు తన సోదరి రాధికతో రాఖీ కట్టించుకున్న ఫొటోను షేర్ చేస్తూ, చెల్లికి మాత్రం ఆయన ట్విట్టర్ లో క్షమాపణ చెప్పారు.
'కొన్ని సంవత్సరాల క్రితం కిందట నా సోదరి రాధిక, నేను కలిసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేశాను. అయితే ఎవరో దీన్ని కలర్ ఫోటోగా మార్చారు. రక్షాబంధన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే, నా చెల్లెలు అనూజకు మాత్రం క్షమాపణలు చెబుతున్నా. ఎందుకంటే ఈ ఫొటో తీసిన సమయానికి ఆమె ఇంకా పుట్టలేదు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.