చైత్ర జె ఆచార్ .. ఓటీటీ ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. నటిగా ఆమెకి మంచి పేరు ఉంది. ఆమె ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే '418'. హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమా ఇది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను విడుదల చేయడం మరో విశేషం. కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. 

అది ఊరికి దూరంగా .. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఒక మెడికల్ కాలేజీ. దాదాపు 15 ఏళ్లుగా మూతబడి ఉన్న ఆ కాలేజ్ ను ఆ ఏడాదే తిరిగి ఓపెన్ చేస్తారు. ఆ కాలేజ్ కి సంబంధించిన బాయ్స్ హాస్టల్ నాలుగు అంతస్తులను కలిగి ఉంటుంది. నాలుగో అంతస్తుకి చెందిన రూమ్ నెంబర్ 418 వైపు వెళ్లొద్దని వార్డెన్ అందరినీ హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ మెడికల్ కాలేజ్ లోనే చేరతాడు వివేక్ (సూర్య రాజ్). ఎన్నో రకాల జాగ్రత్తలు చెప్పిమరీ పేరెంట్స్ అతనిని ఆ కాలేజ్ లో జాయిన్ చేసి వెళతారు. 

సాధారణంగా హాస్టల్ బిల్డింగ్స్ లోకి మందు .. సిగరెట్టు వంటివి తీసుకురాకూడదనే నిబంధనలు కనిపిస్తూ ఉంటాయి. ఈ హాస్టల్లో మాత్రం అమ్మాయిలను ఎలాంటి పరిస్థితులలో తీసుకురాకూడదనే ఒక నిబంధన ఉంటుంది. అమ్మాయిలను ఆ హాస్టల్ గేటు దాటి లోపలి రాకూడదని చెప్పడానికీ .. 418 రూమ్ వైపుకు వెళ్లకూడదనే హెచ్చరించడానికి వెనుక ఏదో బలమైన కారణం ఉందని వివేక్ భావిస్తాడు. ఆ రూమ్ లో ఏదో జరిగిందనే అనుమానం అతనిలో పెరుగుతూ పోతుంది.

ఆ రూమ్ పై దృష్టి పెట్టిన దగ్గర నుంచి వివేక్ కి భయంకరమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. దాంతో అతను ఆ రూమ్ కి దూరంగా ఉంటూ, రహస్యంగా పరిశోధన చేయడం మొదలుపెడతాడు. 'దేవిక' అనే ప్రేతాత్మ ఆ రూమ్ లో ఉందనీ .. ఆ రూమ్ లోకి  అడుగుపెట్టినవారిని అది బలి తీసుకుంటుందని వివేక్ తెలుసుకుంటాడు. అదే సమయంలో తన ఫ్రెండ్స్ తో ఛాలెంజ్ చేసి, బాయ్స్ హాస్టల్ లోకి అడుగుపెడుతుంది సాయేషా (ప్రీతీ పగడాల). అప్పుడు ఏం జరుగుతుంది? దేవిక ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? ఎందుకు ఆమె ప్రేతాత్మగా మారింది? అనేది మిగతా కథ.

హారర్ కథలలో ఒక లక్షణం కనిపిస్తూ ఉంటుంది. అవి ఒక పాడుబడిన బంగ్లాకి .. తోట బంగళాకి పరిమితమవుతూ ఉంటాయి. ఒక రకంగా దీనికి కారణం బడ్జెట్ అనే అనుకోవలసి ఉంటుంది. పాత్రలు ఆ బంగళాను వెతుక్కుంటూ వెళతాయే తప్ప, ఆ బంగాళా గేటు దాటి మాత్రం కథ  బయటికి రాదు. ప్రేతాత్మలు ఎంత శక్తిమంతమైనప్పటికీ, ఆ శక్తులు ఆ నాలుగు గోడల మధ్యన మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. అదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చిన సినిమానే '418'. 

దెయ్యం సినిమాలకు వెళుతున్న ప్రేక్షకులకు .. ఆ సినిమాలో దెయ్యం ఉంటుందనే విషయం ముందుగానే తెలుసు. అయితే ఆ దెయ్యం అక్కడ ఎందుకు ఉంది? దెయ్యంలా ఎందుకు మారింది? అనేదే ఆడియన్స్ లో కుతూహలాన్ని రేకెత్తించే అంశాలుగా కనిపిస్తాయి. ఆ విషయాలను కనుక్కోవడానికి వివేక్ చేసే ప్రయత్నాలతో ఈ సినిమా ఫస్టాఫ్ నడుస్తుంది. దేవిక జీవితం ఎలాంటిది? ఆమె ఏ కారణంగా చనిపోయి ప్రేతాత్మగా మారింది? అనేది సెకండాఫ్ లో తెలుస్తుంది.

 తల్లిదండ్రులు గారంగా పెంచడం వలన సహజంగానే వివేక్ పిరికివాడిగా తయారవుతాడు. కొత్త ప్రదేశాలు అతనికి అనేక రకాల అనుమానాలు సందేహాలు కలిగిస్తూ ఉంటాయి. అందునా ఆ కాలేజ్ హాస్టల్ గురించిన మాటలు అతన్ని మరింతగా భయపడుతూ ఉంటాయి. అలాంటివాడు నేరుగా వచ్చి, ప్రేతాత్మ ఉన్న రూమ్ పక్కనే దిగడం ఆడియన్స్ లో ఆసక్తిని రేపుతోంది.  'ఇక  ఇక్కడి నుంచి మొదలవుతుంది అసలు కథ' అన్నట్టుగా ఆడియన్స్ ప్రిపేర్ అవుతారు. 

మెడికల్ కాలేజ్ లోకి వివేక్ అడుగుపెట్టిన దగ్గర నుంచి, ఇంటర్వెల్ వరకూ కూడా దర్శకుడు అప్పుడప్పుడూ భయపెడుతూ వెళ్లాడు. ఇంటర్వెల్ తరువాత నుంచి మాత్రమే అసలు కథ మొదలవుతుంది. ప్రేతాత్మగా మారిన దేవికకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఆసక్తికరంగా మారుతుంది. ప్రేతాత్మ రూమ్ లోకి సాయేషా వెళ్లడానికి చేసే ప్రయత్నంతో కథ క్లైమాక్స్ దిశగా పరిగెడుతుంది. చివరి అరగంట మాత్రం కాస్త భయపెడుతుంది. 

 ప్రేతాత్మగా మారడం .. ప్రతీకారం తీర్చుకోవడం వంటి కథలతో గతంలో చాలానే సినిమాలు తెరపైకి వచ్చాయి. అయితే దర్శకుడు ఈ కథను 'యక్షగానం'తో ముడిపెట్టి కాస్త కొత్తదనం తీసుకురావడానికి ప్రయత్నించాడు. అలాగే ఒక మూఢనమ్మకం ఎంత బలంగా ప్రభావితం చేస్తుందనేది చూపించాడు. అదే పనిగా అవమానిస్తూ వెళితే ఒక మనిషి స్వభావం ఎంత రాక్షసంగా మారిపోతుందనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు కూడా ఆలోచింపజేస్తుంది.   

హారర్ థ్రిల్లర్ సినిమాకి వచ్చిన ప్రేక్షకులను భయపెట్టేవి ఒకటి కెమెరా పనితనం .. రెండోది సౌండ్ ఎఫెక్ట్స్ అని చెప్పాలి. ఆ రెండు అంశాలు ఈ సినిమా విషయంలో కాస్త బలంగానే కనిపిస్తాయి. ఎడిటింగ్ ఫరవాలేదు. చైత్ర జె ఆచార్ తో పాటు మిగతా ఆర్టిస్టులంతా బాగానే చేశారు. ఈ సినిమా కథాకథనాలు అంత బలంగా ఏమీ కనిపించవు. కాకపోతే ఒక హారర్ సినిమాకి సంబంధించిన లక్షణాలు అక్కడక్కడా బలంగా కనిపిస్తాయంతే. 

దేవిక పాత్రలో చైత్ర ఆచార్ నటన మెప్పిస్తుంది. సినిమా మొత్తంలో ఆడియన్స్ ను  ఆకట్టుకునేది దేవిక ఫ్లాష్ బ్యాక్ మాత్రమే. మిగతా కథంతా రొటీన్ కి భిన్నంగా ఏమీ అనిపించదు. ఆల్రెడీ చూసేసిన సన్నివేశాలని మళ్లీ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.  ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతానికి సంబంధించిన ప్రతిభనే ఆడియన్స్ ను అలా కూర్చోబెడుతుంది. జోనర్ కి తగినట్టుగా కాస్త భయపెడుతుంది.