రానా నాయుడు - వెబ్ సిరీస్ రివ్యూ

Movie Name: Rana Nayudu

Release Date: 2023-03-10
Cast: Venkatesh, Rana, Survin Chawla, Gaurav Chopra, Sushanth Singh, Suchitra Pillai, Adithya Menon
Director: Karan Anshuman, Suparn Varma
Producer: Sundar Aaron
Music: John Stewart Eduri
Banner: Locomotive Global
Rating: 3.00 out of 5
  • నెట్ ఫ్లిక్స్ లో 'రానా నాయుడు'
  • సమాంతరంగా కనిపించిన వెంకటేశ్ - రానా పాత్రలు 
  • సాధారణమైన కథను స్క్రీన్ ప్లే తో నడిపించిన తీరు 
  • అభ్యంతరకరమైన సీన్స్ .. డైలాగ్స్ ఎక్కువ 
  • అనవసరమైన పాత్రలు ఎక్కువే 
  • ఎంత మాత్రం కనెక్ట్ కాని ఎమోషన్స్ 
  • భారీతనమే ప్రధానమైన ఆకర్షణ

ఈ మధ్య కాలంలో అందరిలో ఎక్కువ ఆసక్తిని రేకెత్తించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు' అనే చెప్పాలి. వెంకటేశ్ - రానా కాంబోలో మల్టీ స్టారర్ మూవీ చూడాలని అభిమానులు భావించారు. కానీ వారి నుంచి ముందుగా వెబ్ సిరీస్ వచ్చింది. ఇది వెంకటేశ్ కి ఫస్టు వెబ్ సిరీస్ కావడం .. వెంకటేశ్ - రానా తండ్రీ కొడుకులుగా నటించడం ..  టైటిల్ కూడా వారికి సంబంధించినదే కావడం ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకతలుగా కనిపిస్తాయి. 'నెట్ ఫ్లిక్స్' లో 10 ఎపిసోడ్స్ గా నిన్ననే ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేశారు. 

కథలోకి వెళితే .. నాగ నాయుడు (వెంకటేశ్)కి ముగ్గురు కొడుకులు. ఒకరు తేజ్ (సుశాంత్ సింగ్) ఒకరు జఫ్ఫా (అభిషేక్ బెనర్జీ) .. మరొకరు రానా (రానా). ఈ ముగ్గురిలో రానా చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఒక హత్య కేసు విషయంలో నాగ నాయుడు జైలు శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. దాంతో తన సోదరులతో కలిసి రానా ముంబయి చేరుకుంటాడు. ఈ విషయంలో రానాకి అతని పెదనాన్న సూర్య (ఆశిష్ విద్యార్ధి), సినిమా హీరో ప్రిన్స్ (గౌరవ్ చోప్రా) సహకరిస్తారు. 

ముంబయిలోని సెలబ్రిటీలకు రానా తలలో నాలుకలా మెలుగుతుంటాడు. వారి పరువు ప్రతిష్ఠలకు సంబంధించిన విషయాలను తెలివిగా .. ధైర్యంగా డీల్ చేస్తుంటాడు. అందువలన పెద్ద పెద్ద వాళ్లంతా ఆయనతో స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటారు. రానా భార్య నైనా (సుర్వీన్ చావ్లా) .. వారి సంతానమే అనిరుధ్ - నిత్య. వారి జీవితం అలా సాగిపోతున్న సమయంలో, 15 ఏళ్ల శిక్షను పూర్తిచేసుకున్న నాగ నాయుడు,  హైదరాబాద్ సెంట్రల్ జైలు నుంచి విడుదలవుతాడు. 

ముంబయి చేరుకున్న నాగ నాయుడు తన ముగ్గురు కొడుకుల ఆచూకీ తెలుసుకుంటాడు. వాళ్లను కలుసుకుని ఆనందంతో పొంగిపోతాడు. మనవడు .. మనవరాలిని చూసుకుని సంతోషిస్తాడు. తన కూతురు మరణాన్ని తలచుకుని బాధపడతాడు. అతని రాకపట్ల రానా మాత్రం కాస్త అసహనంగా ఉంటాడు. తనని హత్య కేసులో ఇరికించింది తన కొడుకు రానానే అనీ, అసలు హంతకుడు హీరో ప్రిన్స్ అనే విషయం నాగ నాయుడికి తెలుస్తుంది. అప్పుడు నాగ నాయుడు ఏం చేస్తాడు? పర్యవసానంగా చోటుచేసుకునే మలుపులు ఎలాంటివి?  నాగ నాయుడు కూతురు ఎలా చనిపోయింది? అతనిపై రానాకి ఎందుకు అంతటి ద్వేషం? అనేవి ఆసక్తికరమైన మలుపులుగా అనిపిస్తాయి.

ఈ వెబ్ సిరీస్ కి కరణ్ అన్షుమాన్ - సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ కథ అప్పుడప్పుడు హైదరాబాద్ నేపథ్యాన్ని టచ్ చేసినప్పటికీ, ముంబై నేపథ్యంలోనే ఎక్కువగా నడుస్తుంది. అక్కడి సెలబిట్రీల లైఫ్ స్టైల్ ను ఆవిష్కరిస్తూ ముందుకు వెళ్లారు. నిజానికి ఈ  కథలో అంత బలం కనిపించదు. కథనంతోనే చాలావరకూ నెట్టుకొచ్చారు. వెంకటేశ్ - రానా వంటి స్టార్స్ ఉండటం .. భారీ బడ్జెట్ తో రిచ్ నెస్ తీసుకుని రావడం కొంతవరకూ కవర్ చేసింది. 

నాగ నాయుడు తన ఫ్యామిలీ కోసం గతంలో చేసిన త్యాగాలేమీ చూపించలేదు. రానా నాయుడికి నైతిక విలువలు లేవు. మిగతా ట్రాకులలో కనిపించే పాత్రలు ఇంతకంటే దారుణంగా ఉంటాయి. నాగ నాయుడు కూతురు మరణం నుంచి కూడా ఎమోషన్ ను రాబట్టలేకపోయారు. అందువలన కథ ఎమోషనల్ గా ఎక్కడా కనెక్ట్ కాదు. ఏ పాత్ర ద్వారా ఎలాంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మద్యం .. మగువ .. డబ్బు ... సెక్స్ ఈ నాలుగు అంశాల చుట్టూనే ఈ కథను కట్టేసి తిప్పారు. ఈ నాలుగు అంశాల్లో ఏదో ఒకటి స్క్రీన్ పై కనిపిస్తూనే ఉంటుంది.

నాగ నాయుడు .. రానా నాయుడు ట్రాక్, ఈ రెండు పాత్రలతో ముడిపడిన  ప్రిన్స్ - సూర్య పాత్రలకు సంబంధించిన ట్రాకులు మినహా, ఇతర ట్రాకులతో ఎంతమాత్రం ప్రయోజనం లేకపోవడం కనిపిస్తుంది. ఇక బాల్యంలోనే ఒక పెద్ద మనిషి చేతిలో జఫ్ఫా లైంగిక వేధింపులకు గురై మానసికంగా కుంగిపోవడం అనే లైన్ ను అనవసరంగా చాలా పెద్దది చేశారనిపిస్తుంది. అలాగే తేజు .. తుఫాన్ .. ఓబీ .. చాందిని .. ఆనా .. అర్జున్ పాత్రలు అనవసరమనిపిస్తాయి. వినలేని స్థాయిలో బూతులు వినిపిస్తూ ఉంటాయి. 

నిర్మాణ విలువల పరంగా చూసుకుంటే ఎక్కడా రాజీ పడలేదనే మాట వాస్తవం. వెంకటేశ్ గానీ .. రానా గాని పెద్ద గ్యాప్ తీసుకోకుండా స్క్రీన్ పై కనిపించేలా స్క్రీన్ ప్లే రాసుకోవడం ప్లస్ అయింది. ఖరీదైన లొకేషన్స్ .. జాన్ స్టీవర్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. జయకృష్ణ గుమ్మడి ఫొటోగ్రఫీ .. ఖనోల్కర్ ఎడిటింగ్ ఈ వెబ్ సిరీస్ కి అదనపు బలంగా నిలిచాయని చెప్పచ్చు.  

ప్లస్ పాయింట్స్ : వెంకటేశ్ - రానా లుక్స్ ..  స్క్రీన్ ప్లే .. కథకి తగిన ఖరీదైన లొకేషన్స్ .. భారీతనం .. చిత్రీకరణ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ. 

మైనస్ పాయింట్స్: అభ్యంతరకరమైన సన్నివేశాలు, డైలాగ్స్ పదే పదే రావడం, కొన్ని సన్నివేశాలకు ఎలాంటి ప్రయోజనం లేకపోవడం .. కొన్ని పాత్రలు అనవసరం అనిపించడం .. ఎమోషన్స్ ను కనెక్ట్ చేయకపోవడం.

ఈ వెబ్ సిరీస్ ను ఫ్యామిలీతో కలిసి చూడొద్దని వెంకటేశ్ - రానా ప్రమోషన్స్ లో చెప్పారు. కేవలం బూతు డైలాగ్స్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని అలా చెప్పి ఉంటారనుకుంటే పొరపాటే. ఆ తరహా  సన్నివేశాలను చూపించడంలోను ఎంతమాత్రం తగ్గలేదు. అందువలన ఈ వెబ్ సిరీస్ ను ఎవరి ఫోన్లో వారు .. ఎవరి గదిలో వారు చూడటమే బెటర్. 

Trailer

More Movie Reviews