'శాకుంతలం' - మూవీ రివ్యూ

Movie Name: Shaakuntalam

Release Date: 2023-04-14
Cast: Samantha, Dev Mohan, Mohan Babu, Gouthami, Prakash Raj
Director: Gunasekhar
Producer: Dil Raju
Music: Manisharma
Banner: Guna Team Works
Rating: 2.75 out of 5
  • సమంత ప్రధానమైన పాత్రను పోషించిన 'శాకుంతలం' 
  • విజువల్ వండర్ అనిపించదగిన దృశ్యాలు 
  • ఆకట్టుకునే ప్రత్యేకమైన సెట్స్ 
  • అదనపు బలంగా నిలిచిన సంగీతం 
  • కొన్ని చోట్ల తేలిపోయిన సన్నివేశాలు
మహాకవి కాళిదాసు రచనల్లో 'అభిజ్ఞాన శాకుంతలం' ఒక ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తుంది. ఈ కథ శకుంతలను ప్రధానమైన పాత్రగా చేసుకుని నడుస్తుంది. శకుంతల పాత్రను చేయడానికి ఉత్సాహాన్ని చూపించని కథానాయికలు ఉండరు. చాలా తక్కువమంది కథానాయికలకు ఆ అవకాశం లభించింది. అలాంటివారిలో సమంతను ఒకరుగా చెప్పుకోవచ్చు. దిల్ రాజు నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఇక 'శకుంతల'గా సమంత ఎంతవరకూ ప్రేక్షకులను మెప్పించిందనేది చూద్దాం. 

హిమాలయాల్లోని 'మాలినీ నదీ' తీరంలో .. అరణ్య ప్రాంతంలో కణ్వమహర్షి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, తన శిష్యులతో కలిసి యజ్ఞయాగాలు నిర్వహిస్తూ ఉంటాడు. మేనక - విశ్వామిత్రుల కూతురు పసికందుగా కణ్వ మహర్షికి దొరుకుతుంది. పక్షుల సంరక్షణలో ఉన్న ఆ పసికందును ఆయన దత్తత చేసుకుని 'శకుంతల' అని నామకరణం చేస్తాడు. ఆమె బాగోగులు ఆశ్రమ నిర్వాహకురాలైన గౌతమిమాత ( గౌతమి) చూస్తూ వస్తుంటుంది. 

యవ్వనంలోకి అడుగుపెట్టిన శకుంతల (సమంత) ప్రకృతి ప్రేమికురాలు. అలాగే అక్కడి లేళ్లు .. నెమళ్లు .. కుందేళ్లు అన్నీ ఆమెతో చనువుగా ఉంటూ ఉంటాయి. 'ప్రతిష్ఠానపురం' పాలకుడైన దుష్యంతుడు ( దేవ్ మోహన్) క్రూర మృగాల నుంచి నగర సంరక్షణ చేయదలచి వేట మొదలుపెడతాడు. అలా మృగాలను వేటాడుతూ కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గరికి వస్తాడు. అక్కడ శకుంతలను .. ఆమె సౌందర్యాన్ని చూసి ముగ్ధుడవుతాడు. 

కణ్వ మహర్షి ఆశ్రమంలో లేని ఆ సమయంలో శకుంతల కూడా దుష్యంతుడిని చూసి ఆకర్షితురాలు అవుతుంది. దుష్యంతుడు తన రాజముద్రికను ఆమె వ్రేలికి తొడిగి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. శారీరకంగా వారిద్దరూ ఒకటవుతారు. మళ్లీ వచ్చి మహారాణి హోదాలో ఆమెని తీసుకుని వెళతానని చెప్పి దుష్యంతుడు వెళ్లిపోతాడు. అతని ఆలోచనలో కాలం గడుపుతూ దుర్వాస మహర్షి రాకను ఆమె పట్టించుకోదు. ఎవరి ధ్యాసలో ఆమె ఉందో, ఆ వ్యక్తి ఆమెను మరిచిపోవాలని దుర్వాసుడు శపిస్తాడు. అయితే ఆ శాపం కూడా ఆమె చెవిన పడదు. ఆ తరువాత శకుంతలకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది మిగతా కథ.

దర్శకుడు గుణశేఖర్ కి ఈ తరహా జోనర్ లో సినిమాలు చేయడంలో మంచి అనుభవం ఉంది. తక్కువ పాత్రలతో విస్తారమైన కథను కలిగి ఉండటం ఈ కావ్యం ప్రత్యేకత. ఈ కథలో ప్రకృతి ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. అందులో ముఖ్యమైన పాత్రగానే శకుంతల కనిపిస్తుంది. అలాంటి  శకుంతల పాత్రను తీర్చిదిద్దడం అంత ఆషామాషీ విషయమేం కాదు. అలాగే ఒక వైపున ఆశ్రమవాసాలు ..మరో వైపున రాజరికాలు .. అందుకు సంబంధించిన వాతావరణం బ్యాలెన్స్ చేయడం కూడా అంత తేలికైన పని కాదు. 


ఆశ్రమవాసిగా ఇటు శకుంతలను .. రాజుగా దుష్యంతుడి పాత్రలను గొప్పగా డిజైన్ చేయవలసి ఉంటుంది. శకుంతల పాత్ర వైపు నుంచి ప్రేమ .. విరహం .. వియోగం .. విషాదం వంటి హావభావాలను ఆవిష్కరించాలి. దుష్యంతుడి పాత్ర వైపు నుంచి వీరత్వం .. పశ్చాత్తాపం అనేవి చూపించవలసి ఉంటుంది. ప్రకృతినీ .. అందులో మమేకమైపోయిన శకుంతలను .. ఆమెతో సాన్నిహిత్యంతో మెలిగే జీవరాశిని ఈ కథలో కలుపుకుంటూ వెళ్లాలి.  ఈ అంశాలన్నీ ఒకదగ్గర వరుసగా పేర్చుకుని చూస్తే గుణశేఖర్ కొన్ని విషయాల్లో మాత్రమే సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. 

సమంత విషయానికే వస్తే .. ప్రధానమైన శకుంతల పాత్రను పోషించిన ఆమెకి హెయిర్ స్టైల్ నప్పలేదు. పూలతోనే సర్వాలంకారాలు చేసుకునే ఆమెకి సరైన లుక్ తీసుకుని రాలేకపోయారు. చాలా చోట్ల ఆమె బోసిమెడతోనే కనిపిస్తుంది.  బి. సరోజాదేవి ప్రధాన పాత్రగా కమలాకర కామేశ్వరరావు చిత్రీకరించిన 'శకుంతల'లో ఆమె మెడలో తప్పనిసరిగా 'పూలహారం' కనిపిస్తుంది. అలా ఈ పాత్రను డిజైన్ చేయలేకపోయారు. సమంతకి  కాస్ట్యూమ్స్ సెట్ కాలేదా? .. లేదంటే ఆమెనే ఈ పాత్రకి సెట్ కాలేదా? అనే డౌట్ చాలా సేపు మనలను వెంటాడుతూనే ఉంటుంది.

 సమంత మంచి ఆర్టిస్ట్ అయినా, పాత్రపరమైన సున్నితమైన హావభావాలకు ఆమె దూరంగానే ఉండిపోయింది. ఇక ఆమె నిండు చూలాలు అని తెలియడం కోసం, ఆమె కడుపు భాగాన్ని చాలావరకూ బయటికి వదిలేయడం పాత్ర ఔన్నత్యాన్ని దెబ్బ తీసినట్టుగా అనిపిస్తుంది. లోకులు శకుంతలను నిందచేయడం కూడా స్థాయిని దాటిపోయినట్టుగా అనిపిస్తుంది. దుష్యంతుడి పాత్రకి దేవ్ మోహన్ పెర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఆ పాత్రకి ఆయనను ఎంచుకోవడం గుణశేఖర్ తీసుకున్న గొప్ప నిర్ణయమనే చెప్పాలి. 

ఇక కథలో కీలకమైన పాత్రలైన కణ్వ మహర్షిగా సచిన్ ఖేడేకర్ .. కశ్యప ప్రజాపతిగా కబీర్ బేడీ కనిపిస్తారు. ఆ పాత్రకి వాళ్లు అతకలేదేమోనని అనిపిస్తుంది. దుర్వాస మహర్షిగా మోహన్ బాబు .. పడవ నడిపే వ్యక్తిగా ప్రకాశ్ రాజ్ తెరపై కనిపించింది కొంతసేపే అయినా, ప్రేక్షకులను ప్రభావితం చేశారు. ఆశ్రమవాసం నేపథ్యంలోని సెట్స్ .. ప్రతిష్ఠానపురం రాజసౌధానికి సంబంధించిన సెట్ .. దేవేంద్రుడి అమరావతి సెట్ ను గుణశేఖర్ డిజైన్ చేయించిన తీరు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి.

పాటల పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా మణిశర్మ ఈ సినిమాను నిలబెట్టడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. 'రుషి వనంలోన..' .. 'మల్లికా మల్లికా' .. 'ఏలేలో ఏలేలో' .. 'మధుర గతమా' పాటలు ఆకట్టుకుంటాయి. శేఖర్ వి జోసెఫ్ కెమెరా పనితనం గొప్పగా ఉంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓకే. కాలనేమి ఫ్లాష్ బ్యాక్ .. దుర్వాసుడి ఫ్లాష్ బ్యాక్ కట్ చేయవలసింది. అందువలన కథకి ఇబ్బంది కూడా లేదు. ప్రధానమైన కథకు అనుసంధానంగా నడిచే కాలనేమి ఎపిసోడ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 

నిజానికి ఈ కథ నడకనే నిదానంగా ఉంటుంది. అది ఈ స్పీడ్ జనరేషన్ కి  కాస్త అసహననాన్ని కలిగించవచ్చు. అలాగే జంతువులకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పై గుణశేఖర్ మరింత శ్రద్ధ పెడితే బాగుండేది. గ్రాఫిక్స్ కోసం ఆయన తీసుకున్న సమయానికి తగిన అవుట్ పుట్ రాలేదేమో అనిపిస్తోంది. ఈ కథను విజువల్ వండర్ గానే గుణశేఖర్ తీర్చిదిద్దాడు. కాకపోతే అద్భుతమైన ఆ దృశ్యాలలో అక్కడక్కడా మాత్రమే జీవం కనిపిస్తుంది. ఏదేవైనా ఈ జనరేషన్ కి 'శకుంతల' కథను చెప్పడానికి గుణశేఖర్ చేసిన ప్రయత్నాన్ని అభినందించవచ్చు. 

ప్లస్ పాయింట్స్: విజువల్ వండర్ అనిపించే చిత్రీకరణ .. ప్రత్యేకమైన సెట్స్ .. సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ. 

మైనస్ పాయింట్స్: సమంత కాస్ట్యుమ్స్ .. పెర్ఫెక్ట్ గా లేని గ్రాఫిక్స్ .. అనవసరమైన ఫ్లాష్ బ్యాక్ లు ,,.. యుద్ధం నేపథ్యంలోని సన్నివేశాలు 

Trailer

More Movie Reviews