'పులి' - 19వ శతాబ్దం' - ఓటీటీ రివ్యూ

Movie Name: Puli -19th Century

Release Date: 2023-05-20
Cast: Siju Wilson, Kayadu Lohar, Anoop Menon, Chemban Vinod Jose, Sudev Nair
Director: Vinayan
Producer: Gokulam Gopalan
Music: Santosh Narayan
Banner: Sree Gokulam Movies
Rating: 3.00 out of 5
  • మలయాళంలో వచ్చిన 'పథోమ్ పథం నూట్టండు '
  • తెలుగు వెర్షన్ టైటిల్ గా 'పులి'
  • అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో 
  • ట్రావెన్ కోర్ నేపథ్యంలో సాగే కథ
  • సిజు విల్సన్ నటన ప్రధానమైన ఆకర్షణ  
  • ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..సెట్స్ .. ఫైట్స్ .. హైలైట్

మలయాళంలో చారిత్రక నేపథ్యంలో ఇంతవరకూ చాలానే సినిమాలు వచ్చాయి. ఇలాంటి కథలను తెరకెక్కించడం అంత తేలికైన విషయమేం కాదు. ఆ కాలం నాటి పరిస్థితులు .. సామాజిక .. రాజకీయ వాతావరణం ..ప్రజల జీవన విధానం .. ఆ కాలం నాటి నిర్మాణాలను పోలిన సెట్స్ .. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. అలా 19వ శతాబ్దంలో ట్రావెన్ కోర్ ప్రాంతంలోని పరిస్థితులను ఆధారంగా చేసుకుని నిర్మితమైన సినిమానే 'పులి'.

 ఈ సినిమా క్రితం ఏడాది చివరిలోనే అక్కడ థియేటర్లకు వచ్చింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలను అందుకుంది. అలాంటి ఈ సినిమాను రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. ఆనాటి ట్రావెన్ కోర్ పరిస్థితులకు అద్దం పట్టిన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

ట్రావెన్ కోర్ ప్రాంతాన్ని రామవర్మ (అనూప్ మీనన్) పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన భార్య కల్యాణి (పూనమ్ బజ్వా) కూడా రాజకీయ పరమైన విషయాలను పరిశీలిస్తూ ఉంటుంది. రామవర్మ పాలనలో అధికార ప్రతినిధులుగా పడవీడన్ నంబి (సుదేవ్ వర్మ), కైమాల్ (సురేశ్ కృష్ణ), కన్నన్ కురుప్ (విష్ణు వినయ్) ఉంటారు. ఈ ముగ్గురూ కూడా రాజు దగ్గర ఒకరి అభిప్రాయాలను ఒకరు సమర్ధిస్తూ, వాటిని చట్టాలుగా .. శాసనాలుగా మారుస్తుంటారు. 

పరిపాలన సంబంధమైన అన్ని వ్యవహారాలలో అగ్రకులాల వారే పెత్తనం చెలాయిస్తుంటారు. తక్కువ కులానికి చెందినవారు అగ్రకులాల వారికి సమీపంలోకి కూడా రాకూడదు. వారికి ఆలయ ప్రవేశం అసలే లేదు.. దైవ సంబంధమైన కార్యక్రమాలకి కూడా వారు హాజరు కాకూడదు. తక్కువ కులానికి చెందిన స్త్రీలు దేహాన్ని పూర్తిగా కప్పుతూ వస్త్రధారణ చేయకూడదు. వారు ముక్కెర ధరించకూడదు. ఇలాంటి నియమాలతో వాళ్లను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటారు. 

తక్కువ కులంలో పుట్టినప్పటికీ ఒక వ్యక్తి అంటే మాత్రం వారందరికీ భయం .. అతని పేరే వేలాయుధన్. యుద్ధ విద్యల్లో అతను ఆరితేరినవాడు. రాజ ప్రతినిధుల చేత పీడించబడుతున్నవారికి అతనే నాయకుడు. అతనిని అనేక మార్లు రాజు ముందు దోషిగా నిలబెట్టడానికి అవినీతి అధికారులంతా నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు .. అవకాశం చిక్కితే అంతం చేయాలనే ఆలోచనలో ఉంటారు. 

అలాంటి పరిస్థితుల్లోనే అనంతపద్మనాభస్వామికి చెందిన ఆభరణాలు దొంగిలించబడతాయి. ఆ నగలను కొచ్చున్ అనే బందిపోటు దొంగిలించాడనే విషయం రాజుకి తెలుస్తుంది. అతన్ని బంధించి .. నగలను తన స్వాధీనం చేయమని అధికార ప్రతినిధులను రాజు హెచ్చరిస్తాడు. అప్పుడు వారు ఏం చేస్తారు? ఈ విషయం తెలిసి వేలాయుధన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేదే కథ.

 గోకులం గోపాలన్ నిర్మించిన ఈ సినిమాకి, వినయన్ దర్శకత్వం వహించాడు. చారిత్రక ఛాయలో ఈ సినిమా కనిపిస్తుంది. రాజు మంచివాడే .. కానీ ఆయన అధికార ప్రతినిధులు అగ్రవర్ణాలవారు. వాళ్లంతా తక్కువ కులస్థులను చట్టాల పేరుతో ఎలా వేధించారు? అనే కోణంలో ఈ కథను రాసుకున్నాడు. తక్కువ కులంలో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు, ప్రజలలో ధైర్యాన్ని నింపి వారిలో తిరుగుబాటు ఆలోచన ఎలా కలిగించాడు? అనే దారిలో ఈ కథ నడుస్తుంది. 

ఇది ఒక చారిత్రక కథ అన్నట్టుగానే కథనం ముందుకు వెళుతుంది. హీరో మహా వీరుడు .. అయినా ఆయన వైపు నుంచి ఎలాంటి లవ్ ట్రాక్ ఉండదు. అలాగే ఆయనను చూసి వేరే యువతులు మనసులు పారేసుకుని కలలు కనడం .. వాటిల్లో నుంచి పాటలు పుట్టడం ఉండదు. సందర్భానికి తగిన పాటలు మాత్రమే వచ్చి వెళుతుంటాయి. సినిమా టిక్ అంశాలు ఏమీ లేకుండా .. ఒక చారిత్రక నవలను చదువుతున్నట్టుగా ఈ సినిమా ఉంటుంది. 

దర్శకుడు సహజత్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. రాజు - రాణి పాత్రల మినహా మిగతా పాత్రలకు మేకప్ లేకుండానే నడిపించాడు. ఈ కథ అంతా కూడా ఒక ప్రాంతం .. ఒక పరిధిలో జరుగుతుంది. అందుకు సంబంధించిన అద్భుతమైన లొకేషన్స్ లో సన్నివేశాలను ఆవిష్కరించాడు. హీరో వేలాయుధన్ పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు బాగుంది. ఆ పాత్రలో సిజు విల్సన్ జీవించాడు. మిగతా వాళ్లంతా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పచ్చు. షాజీ కుమార్ కెమెరా పనితనాన్ని అభినందించకుండా ఉండలేం. అద్భుతమైన ఫ్రేమ్స్ నుంచి సన్నివేశాలను ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. అడవి .. చీకటి .. వర్షం .. పోరాటాల నేపథ్యంలోని సన్నివేశాలను గొప్పగా చూపించాడు. ఆయన సెట్ చేసిన లైటింగ్ బాగుంది. వివేక్ హర్షన్ ఎడిటింగ్ కి .. అజయన్ సెట్స్ కి మంచి మార్కులు ఇవ్వచ్చు. 

ప్లస్ పాయింట్స్: కథాకథనాలు .. హీరో పాత్రను మలచిన తీరు .. కాస్ట్యూమ్స్ ..  ఫొటోగ్రఫీ ... బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ... సెట్స్. 

మైనస్ పాయింట్స్: 
డబ్బింగులో జనాలకు సంబంధించి సామూహిక వాయిస్ లు .. నినాదాల విషయంలో సరైన కేర్ తీసుకోలేదు. అలాగే ఆ పాత్రలకి సంబంధించిన పేర్లను స్పష్టంగా ఇతర పాత్రలు పలక్కపోవడం కొంత అసహనాన్ని కలిగిస్తుంది. సినిమా పరమైన హంగులు లేకుండా .. చరిత్రను చెప్పడానికి చేసిన ప్రయత్నంగా చూసుకుంటే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. 

Trailer

More Movie Reviews