'ఇష్క్ నెక్స్ట్ డోర్' - (జియో) వెబ్ సిరీస్ రివ్యూ

Movie Name: Ishq Next Door

Release Date: 2023-07-03
Cast: Abhay Mahajan, Natasha Bharadwaj, Mrinal Dutt, Purav Jha, Pragathi, Nidhi,
Director: Akhilesh Vats
Producer: Jyothi Deshpande
Music: Manpal Singh
Banner: Rusk Studios
Rating: 2.50 out of 5
  • ప్రేమ ప్రధానంగా సాగే వెబ్ సిరీస్ 
  • ఈ నెల 3 నుంచి ఒక్కో ఎపిసోడ్ స్ట్రీమింగ్ 
  • ఎలాంటి ట్విస్టులు లేకుండా నడిచే కథ
  • లవ్ .. ఎమోషన్స్ పరంగా కనెక్ట్ కానీ వెబ్ సిరీస్

లవ్ .. కామెడీ టచ్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే కంటెంట్ కి జియో సినిమా ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది. తాజాగా ఇదే జోనర్ కి సంబంధించి, ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఈ నెల 3వ తేదీ నుంచి 'ఇష్క్ నెక్స్ట్ డోర్' వెబ్ సిరీస్ ను వదిలారు. రోజుకి ఒక ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేస్తూ వస్తున్నారు. అలా ఫస్టు సీజన్ కి సంబంధించిన 12 ఎపిసోడ్స్ లో, ఈ రోజుతో 8 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ కథ ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం.

'రజత్ విహార్' అనే కాలనీలో దేవ్ కుమార్ మిశ్రా (అభయ్ మహాజన్) నివసిస్తూ ఉంటాడు. అతను ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. తండ్రి చనిపోవడంతో ఆ కుటుంబ బాధ్యత మొత్తం అతని భుజాలపై పడుతుంది. తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ, తమ్ముడు 'చుట్టన్' (పురవ్)ను చదివిస్తూ ఉంటాడు. కుటుంబ బాధ్యతల కారణంగా పెళ్లి పట్ల పెద్దగా ఆసక్తిని చూపించడు. సంబంధాలు చూడటానికి ప్రయత్నిస్తున్న తల్లి పట్ల కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తుంటాడు. 

అలాంటి పరిస్థితుల్లోనే అదే కాలనీకి చెందిన మెహర్ (నటాషా భరద్వాజ్)తో పరిచయం కలుగుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతూ ఉంటుంది. అయితే గతంలో ఆమె అశ్విన్ (మృణాళ్ దత్)తో ప్రేమలో పడిందనే విషయం దేవ్ కి తెలుస్తుంది. అదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావిస్తే, అదంతా గతం అంటుంది. అశ్విన్ దగ్గర దేవ్ ఆ విషయాన్ని కదిలిస్తే, ప్రస్తుతం కూడా మెహర్ తన పట్ల ప్రేమతోనే ఉంటుందని అంటాడు. 

మెహర్ విషయంలో దేవ్ ఎటూ తేల్చుకోలేకపోతున్న సమయంలోనే, అతని బ్యాంక్ నుంచి అశ్విన్ కి లోన్ ఇవ్వమని మెహర్ సిఫార్స్ చేస్తుంది. మెహర్ కోసం అశ్విన్ కి లోన్ ఇప్పించాలని దేవ్ నిర్ణయించుకుంటాడు. అయితే అశ్విన్ తో ఆమె అనుబంధం బలంగానే ఉందని భావించిన దేవ్, ఆమెను ఎవైడ్ చేయడం మొదలుపెడతాడు. అది గ్రహించిన మెహర్, అతనికి తన మనసులో మాట చెప్పడానికి దేవ్ ఇంటికి వెళుతుంది. 

ఆ సమయంలో మరొక యువతితో దేవ్ కి పెళ్లిచూపులు జరుగుతూ ఉంటాయి. దాంతో మౌనంగా వెనక్కితిరిగి వచ్చేస్తుంది. దేవ్ కి తన పట్ల ప్రేమలేకపోవడం వల్లనే అతను వేరొకరితో పెళ్లి చూపులకు అంగీకరించాడని మెహర్ అనుకుంటుంది. ఆమె అశ్విన్ రిలేషన్ లోనే ఉందని దేవ్ భావిస్తాడు. మెహర్ ను మళ్లీ తనవైపుకు తిప్పుకోవడానికి ఇదే మంచి సమయమని అశ్విన్ ఆలోచన చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? దేవ్ - మెహర్ మధ్య అపోహలు తొలగిపోతాయా? అశ్విన్ వేసిన ప్లాన్ ఫలిస్తుందా? అనేది కథ. 

 
ఈ వెబ్ సిరీస్ కి దర్శకుడు అఖిలేశ్. కాస్త మంచితనం .. మానవత్వం కలిగిన హీరో పాత్రను .. తాను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే నెగెటివ్ షేడ్స్ కలిగిన విలన్ తరహా పాత్రను .. ఇద్దరి వ్యక్తిత్వాలను అంచనా వేసుకుని, హీరో పాత్ర పట్ల ఆరాధన భావం పెంచుకోవడం మొదలుపెట్టిన ఒక యువతి పాత్రను ప్రధానంగా చేసుకుని దర్శకుడు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని అల్లుకున్నాడు. ఈ మూడు పాత్రల చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది.

సాధారణంగా ప్రతి కాలనీలోను ఇలాంటి ప్రేమకథలు కనిపిస్తూనే ఉంటాయి .. వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి ఒక కథను సహజత్వానికి దగ్గరగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వెళ్లడానికి దర్శకుడు తనవంతు ప్రయత్నం చేశాడు. మంచి టైటిల్ ను సెట్ చేసుకునే వచ్చాడు. అయితే టైటిల్ ఆసక్తి రేకెత్తించినంతగా ఈ వెబ్ సిరీస్ కథాకథనాలు ఆకట్టుకోవు. ఎక్కడా ఎలాంటి ట్విస్టులు లేకుండా సాదా సీదాగా అలా నడుస్తూ వెళుతూ ఉంటుంది. ఈ జనరేషన్ స్పీడ్ కి చాలా దూరంగా కనిపిస్తుంది. 

ఈ మధ్య కాలంలో ఏ భాషకి చెందిన వెబ్ సిరీస్ ను అయినా, చాలా సహజంగా అనిపించేలా డబ్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో కొన్ని పాత్రలకి కొన్ని వాయిస్ లు ఎంతమాత్రం సెట్ కాలేదు. మరీ ఇలా వచ్చి . అలా వెళ్లిపోయే పాత్రల వాయిస్ లపై దృష్టిపెట్టలేదు. ఒక డబ్బింగ్ వెబ్ సిరీస్ ను చూస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. పస లేని సన్నివేశాలు .. పట్టు లేని స్క్రీన్ ప్లే కాస్త అసహనాన్ని కలిగిస్తూ ఉంటాయి. 

దసరా ఉత్సవాల నేపథ్యంలో వచ్చే సీన్స్ .. కాలనీ ఎన్నికల హడావిడి .. సత్తూ బ్యాంకు లోన్ గొడవ .. ఇలా కొన్ని అనవసరమైన సీన్స్ గా అనిపిస్తాయి. లవ్ .. ఎమోషన్స్ కి సంబంధించిన ట్రాకులలో ఎక్కడా ఏదీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే స్థాయిలో కనిపించవు. మాన్పల్ సింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. మిథున్ చంద్రన్ ఫొటోగ్రఫీ ఫరవాలేదు. ప్రశాంత్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. ట్రిమ్  చేస్తూ వెళితే, ఈ 8 ఎపిసోడ్స్ ను 6 ఎపిసోడ్స్ కి కుదించవచ్చు. 

* కొత్తదనం లేని కథ .. నిదానంగా సాగే కథనం .. అనవసరమైన సన్నివేశాలకు చోటు ఇవ్వడం ..   డబ్బింగ్ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం మైనస్ పాయింట్స్ గా కనిపిస్తాయి. 

Trailer

More Movie Reviews