'దో గుబ్బారే' - (జియో) వెబ్ సిరీస్ రివ్యూ

Movie Name: Do Gubbare

Release Date: 2023-07-20
Cast: Mohan Agashe, Siddharth Shaw, Malhaar, Manasi, Hethavi Sharma, Hemangi, Advaith
Director: Varun Narvekar
Producer: Ranjith Gugle
Music: Sourabh
Banner: Bahwa Entertainment
Rating: 2.75 out of 5
  • 6 ఎపిసోడ్స్ గా వచ్చిన 'దో గుబ్బారే'
  • తక్కువ పాత్రల మధ్య నడిచే బలమైన కథ 
  • సహజత్వమే ప్రధానమైన బలంగా కనిపించిన వెబ్ సిరీస్ 
  • సున్నితమైన ఫీలింగ్స్ కీ .. ఎమోషన్స్ కి పెద్దపీట వేసిన డైరెక్టర్ 

'దో గుబ్బారే' అనే వెబ్ సిరీస్ 'జియో సినిమా'లో అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఈ నెల 20వ తేదీ నుంచి మొదలైంది. ప్రతి రోజు ఒక ఎపిసోడ్ చొప్పున స్ట్రీమింగ్ చేస్తూ వచ్చారు. అలా ఈ రోజున జరిగిన 6వ ఎపిసోడ్ స్ట్రీమింగ్ తో ఈ వెబ్ సిరీస్ పూర్తయింది. వరుణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ కథ 'పూణె'లో మొదలై చివరివరకూ అక్కడే జరుగుతుంది. ఆజోబా (మోహన్) ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆరు నెలల క్రితమే భార్య చనిపోవడంతో, వయసు పైబడిన ఆయన ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఉంటాడు. ఆయన పెద్ద కొడుకు - కోడలు .. వారి పిల్లలు అమెరికాలో ఉంటారు. అక్కడికి రమ్మని వాళ్లు ఒత్తిడి చేస్తున్నా, ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వెళుతూ ఉంటాడు. ఇక చిన్నకొడుకు భార్య అశ్విని (మానసి) ఆమె కూతురు 'సారా' బెంగుళూరులో ఉంటూ ఉంటారు. 

ఆజోబా పద్ధతి గల వ్యక్తి .. క్రమశిక్షణ .. పరిశుభ్రత విషయంలో ఆయన చాలా నిక్కచ్చిగా ఉంటూ ఉంటాడు. అలాంటి ఆయన ఇంట్లో పేయింగ్ గెస్టుగా రోహిత్ (సిద్ధార్థ్) దిగుతాడు. అతను ఇష్టపడిన అమ్మాయి 'మనూ' (మల్హార్) పూణెలోనే ఉంటుంది. తనకి గుండె మార్పిడి చికిత్స జరిగిన విషయాన్ని రోహిత్ దగ్గర తప్ప ఆమె మరెవరి దగ్గర ప్రస్తావించదు. ఆమె కోసమే పూణెలో జాబ్ వెతుక్కోవడానికి రోహిత్ వచ్చాడనే విషయం ఆజోబాకి అర్థమవుతుంది.

ఆజోబా ఇంట్లో వంట మనిషిగా ఉన్న రాధ (హేమాంగి), రోహిత్ కి కూడా వండిపెడుతూ ఉంటుంది. పేయింగ్ గెస్టులా కాకుండా, ఆ కుటుంబ సభ్యుడిలా రోహిత్ మారిపోతాడు. ఆజోబా చిన్న చిన్న సంతోషాలతో ఎక్కువ అనుభూతులను ఏరుకుంటూ ఉండటం రోహిత్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరినీ ప్రేమించడం .. ప్రకృతితో మమేకం కావడం .. స్నేహానికి విలువనివ్వడం .. తనకి ఇష్టమైన వంటకాలను ఆస్వాదించే తీరు, రోహిత్ కి బాగా నచ్చుతుంది.

ఈ నేపథ్యంలోనే ఆజోబా చిన్న కోడలు అశ్విని ఒక నిర్ణయానికి వస్తుంది. ఆమె తన నిర్ణయాన్ని ఆజోబాకి తెలియజేస్తుంది. ఇక 'మనూ' తనకి గుండెను ఇచ్చిన దాతలు ఎవరనేది తెలుసుకుని, ఆ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలపాలని భావిస్తుంది. అతి కష్టం మీద దాతల వివరాలను హాస్పిటల్ నుంచి ఆమె సేకరిస్తుంది. ఎప్పుడూ పెద్ద కొడుకు గురించి మాట్లాడే ఆజోబా, చిన్న కొడుకు గురించి ప్రస్తావించకపోవడం రోహిత్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

అదే విషయాన్ని గురించి అతను ఆజోబాను అడుగుతాడు. అంతగా చిన్నకొడుతో ఏం గొడవ జరిగిందని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆజోబా ఏం చెబుతాడు? అది విన్న రోహిత్ ఎలా స్పందిస్తాడు?  అశ్విని తీసుకున్న నిర్ణయం ఏమిటి? డోనర్స్ కి సంబంధించిన వివరాలను సేకరిస్తూ వెళ్లిన మనూకి ఎలాంటి నిజం తెలుస్తుంది? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అనేది కథలో చోటుచేసుకునే ఆసక్తికరమైన అంశాలు. 

దర్శకుడు వరుణ్ ఈ కథను తయారు చేసుకున్న తీరు .. పాత్రలను తీర్చిదిద్దిన విధానం .. వాటిని ఆవిష్కరించిన పద్ధతి చాలా సహజంగా అనిపిస్తాయి. చాలా తక్కువ పాత్రల మధ్య ఆయన అల్లుకున్న ఈ కథ, మనసుకు హత్తుకుంటుంది.  4వ ఎపిసోడ్ లో ఒక ట్విస్ట్ .. చివరి ఎపిసోడ్ లోని ట్విస్ట్ మనసును భారం చేస్తాయి. తరాల మధ్య అంతరం ఉన్నప్పటికీ, పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.

 కుటుంబ జీవనంలో ఒంటరితనాన్ని ఓడించడానికి పిలల్లతో పెద్దలు కలిసి ఉండాలి. జీవితంలో ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలినా, చిరునవ్వుతో వాటిని ఎదుర్కుంటూ ముందుకు సాగడానికి అవసరమైన ధైర్యాన్ని అలవర్చుకోవడం కోసం పెద్దలతో పిల్లలు కలిసి ఉండాలనే సందేశం ఈ కథలో మనకి కనిపిస్తుంది. కథలో ఎక్కడా కూడా అనవసరమైన హడావిడి కనిపించదు. ఒక కథను కాకుండా ఒక జీవితాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. ఏడు పదుల వయసు దాటినవాళ్లు తమ జీవితాల్లోకి తొంగిచూసినట్టుగా ఉంటుంది. 

ప్రతి ఒక్కరి జీవితంలోకి ఏదో ఒక వైపు నుంచి దుఃఖం ప్రవేశిస్తూనే ఉంటుంది. జీవితమనేది ఒక్కోసారి ఎవరూ లేని ఏకాకిని చేసి నిలబెడుతుంది. చనిపోయేవరకూ బ్రతకాల్సిందే .. అప్పటివరకూ బ్రతకడానికి కొన్ని అనుభూతులు .. మరికొన్ని జ్ఞాపకాలు .. ఇంకొన్ని పరిచయాలు కావలసిందే అనే విషయాన్ని చాటిచెప్పిన కథ ఇది. సాఫీగా సాగుతూ వచ్చినప్పటికీ, కథ ఎక్కడా బోర్ కొట్టదు. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు జీవం పోశారు. సౌరభ్ సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. సహజత్వంతో అనుభూతి ప్రధానంగా సాగడమే ఈ కథలోని అసలైన బలం అని చెప్పచ్చు. 

Trailer

More Movie Reviews