'బెదురులంక 2012'- మూవీ రివ్యూ

Movie Name: Bedurulanka 2012

Release Date: 2023-08-25
Cast: Kartikeya Gummakonda, Neha Shetty, Ajay Ghosh, Srikanth Iyengar, L. B. Sriram, Vennela Kishore
Director: Clax
Producer: Ravindra Benerjee
Music: Manisharma
Banner: Loukya Entertainments
Rating: 2.50 out of 5
  • కార్తికేయ నుంచి వచ్చిన 'బెదురులంక 2012'
  • వినోదమే ప్రధానంగా రూపొందిన సినిమా 
  • ఆ విషయంలో కొంతవరకే సక్సెస్ అయిన టీమ్ 
  • పెర్ఫెక్ట్ గా డిజైన్ చేయబడని కంటెంట్
  • మణిశర్మ స్థాయిలో వినిపించని బ్యాక్ గ్రౌండ్ స్కోర్

కార్తికేయ కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సరైన కథలను ఎంచుకోవాలనే ఉద్దేశంతో కొంత గ్యాప్ కూడా తీసుకున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆయన చేసిన సినిమానే 'బెదురులంక 2012'. 'క్లాక్స్' దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కార్తికేయ సరసన నాయికగా నేహా శెట్టి నటించింది. ఈ రోజునే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

ఈ కథ అంతా 2012 కాలంలో .. 'బెదురులంక' అనే గ్రామంలో జరుగుతుంది. గోదావరి ప్రాంతంలోని లంకల గ్రామాల్లో ఇది ఒకటి. ఆ గ్రామానికి చెందిన శివ (కార్తికేయ) హైదరాబాద్ లో గ్రాఫిక్స్ కి సంబంధించిన సంస్థలో పనిచేస్తూ ఉంటాడు.  'బెదురులంక' ప్రెసిడెంట్ కూతురు చిత్ర (నేహా శెట్టి) శివను ప్రేమిస్తూ ఉంటుంది. తాను పనిచేసే చోట సంతృప్తి లేకపోవడం వలన, శివ తన గ్రామానికి చేరుకుంటాడు. ఆ సమయంలో 'యుగాంతం' గురించే అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. 

అది 2012 .. డిసెంబర్ 21వ తేదీన యుగాంతం జరిగిపోతుందని టీవీల్లో వార్తలు భయపెట్టేస్తూ ఉంటాయి. టీవీ ఛానల్స్ వారు రేటింగ్ కోసం ఇలా హడావిడి చేస్తూ ఉంటారనే ఒక అవగాహన ఉన్న భూషణం ( అజయ్ ఘోష్) తనతో సన్నిహితంగా ఉండే బ్రహ్మం ( శ్రీకాంత్ అయ్యంగార్) .. డేనియల్ (రామ్ ప్రసాద్)తో కలిసి, జనంలోని  భయాన్ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటాడు. ఆ ఊరు చర్చి ఫాదర్ పై .. బ్రహ్మయ్యపై జనానికి గల నమ్మకాన్ని తనకి అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. 

ఇదే సమయంలో ప్రెసిడెంటు కూతురు చిత్ర .. శివ ప్రేమించుకుంటున్నారనే విషయం భూషణానికి తెలుస్తుంది. ఆస్తి కోసం తన కొడుకు కసిరాజు (రాజ్ కుమార్)కి .. చిత్రతో పెళ్లి చేయాలనే ప్లాన్ లో ఆయన ఉంటాడు. అందువలన ఆ ఊరు నుంచి శివను తరిమేయడానికి తగిన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆయన అనుకున్న సమయం రానే వస్తుంది. యుగాంతం పట్ల జనంలో ఉన్న మూఢనమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, వాళ్లను మోసం చేయడానికి భూషణం మిత్ర బృందం పెద్ద పథకమే వేస్తారు. 

ఈ విషయంలో శివ సహకరించకపోవడం ప్రెసిడెంటుకి కోపాన్ని కలిగిస్తుంది. అదే అదనుగా భావించి ఆయనను భూషణం మరింత రెచ్చగొడతాడు. దాంతో శివను ఆ ప్రెసిడెంటు ఊరు నుంచి వెలి వేస్తాడు. అప్పుడు శివ ఏం చేస్తాడు? తాను ప్రేమించిన యువతిని పొందడం కోసం .. స్వార్థపరుల చేతుల్లో నుంచి తన గ్రామాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? చివరికి ఏం జరుగుతుంది? అనేది కథ.

'2012 యుగాంతం' అనే అంశం గురించి అప్పట్లో అంతా మాట్లాడుకున్నారు. ఈ టాపిక్ పై హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది .. అదే జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆ సినిమా కళ్లకు కట్టింది. ఇప్పడు అదే టాపిక్ ను తీసుకుని .. 'యుగాంతం' అనే విషయం పట్ల ఒక గ్రామం ప్రజలు ఎలా స్పందించారు? వాళ్ల ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చాయి? యుగాంతం అనే ఒక భయం కారణంగా ఆ గ్రామం ముఖ చిత్రం ఎలా మారిపోయింది? అనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. 

గ్రామంలో కొన్ని ముఖ్యమైన పాత్రలను ఎంచుకుని, ఆ పాత్రలను టచ్ చేస్తూ దర్శకుడు ఈ కథను నడిపించాడు. రేపటి రోజున మనం ఎవరమూ ఉండం అనే విషయం తెలిస్తే, అప్పటి వరకూ కట్టుబాట్లకు .. పరువు ప్రతిష్టలకు భయపడుతూ బ్రతికిన వాళ్లు, అధికారం .. పెద్దరికం అంటూ దర్జాను వెలగబెట్టే వాళ్లు వాటిని ఎలా వదిలేస్తారు? వాళ్ల ధోరణి ఎలా మారిపోతుంది? అనే అంశాలు కాస్త నవ్వును తెప్పిస్తాయి.

నిజానికి దర్శకుడు ఎంచుకున్న పాయింటు మంచిదే .. కావలసినంత కామెడీని పిండడానికి అవకాశం ఉన్నదే. కానీ క్లాక్స్ ఈ విషయంలో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. ఒక ఊరిలో జరిగే కథను చాలా టైట్ చేసి కామెడీని కదను తొక్కించవచ్చు. కానీ ఆయన ఆ దిశగా సరైన కసరత్తు చేయలేదేమో అనిపిస్తుంది. హీరో తన నిర్ణయాలు మార్చుకోవడం, భూషణం - బ్రహ్మం .. డేనియల్ పాత్రలకి సంబంధించిన ట్రాకులు స్టేజ్ డ్రామాను చూస్తున్నట్టుగా చాలా నాటకీయంగా అనిపిస్తాయి.

హీరో పాత్రను క్లాక్స్ సరిగ్గా డిజైన్ చేయలేకపోయాడు. నేహా శెట్టి నుంచి యూత్ ఆశించే రొమాన్స్ ను రాబట్టలేకపోయాడు. కామెడీ కోసం సత్యను రంగంలోకి దింపాడుగానీ, ఆ పాత్రను వాడుకోలేకపోయాడు. న్యూస్ రీడర్ గా వెన్నెల కిశోర్ పాత్ర కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక అజయ్ ఘోష్ .. శ్రీకాంత్ అయ్యంగార్ .. రామ్ ప్రసాద్ పాత్రలను కూడా సరిగ్గా డిజైన్ చేయలేదనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది.

 కామెడీ కోసమే అయినా దర్శకుడు కొన్ని వివాదాస్పద అంశాలను టచ్ చేశాడు. వినడానికి ఇబ్బంది కలిగించే డైలాగ్స్ అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటాయి. హాయిగా నవ్వించే కామెడీ కంటే కూడా, వెకిలి నవ్వులను .. వెకిలి చేష్టలను కామెడీ అనిపించే ప్రయత్నాలు కనిపిస్తాయి. కథ .. కథనాలు .. పాత్రలను మలిచిన విధానం సంగతి అలా ఉంచితే, ఒక పల్లెటూరిని ఆహ్లాదకరంగా ఆవిష్కరించడం కూడా కనిపించదు. పాయింట్ ఫన్ కి సంబంధించినదే అయినా, దానిని ఆవిష్కరించిన విధానం సినిమా స్థాయిలో లేదు.

కార్తికేయ కండలు తిరిగిన హీరోనే .. కానీ ఈ కథకి కావలసింది .. నాన్ స్టాప్ కామెడీ ..  అదే తక్కువైంది. జ్ఞాన బోధ చేస్తున్నట్టుగా అనిపించే పాత్రలో ఎల్బీ శ్రీరామ్ కనిపిస్తాడు. ఆయన చేసిన జ్ఞాన బోధ ఏమిటి? అది హీరోకి ఎలా అర్థమైంది? అనేది మనకి అర్థం కాదు. సాధారణంగా ఈ తరహా పాత్రలలో ఎల్బీ జీవిస్తాడు .. కానీ ఇందులో మాత్రం ఆయన పాత్ర కృతకంగానే కనిపిస్తుంది. 

 
మణిశర్మ అందించిన బాణీలు ఓకే.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా మణిశర్మకి మంచి పేరు ఉంది. కానీ ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయన స్థాయిలో అనిపించదు. ఫొటోగ్రఫీ పరంగా చెప్పుకోవాలంటే .. పల్లె అందాలను .. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనసుకు హత్తుకునేలా ఆవిష్కరించలేదనే అనిపిస్తుంది. వీలైనంత వినోదాన్ని అందించే పాయింటు ఉన్నప్పటికీ, సినిమా స్థాయికి దానిని రీచ్ చేయలేకపోయిన ఒక ప్రయత్నంగానే ఇది కనిపిస్తుందని చెప్పచ్చు.

Trailer

More Movie Reviews