'పాపం పసివాడు' (ఆహా) వెబ్ సిరీస్ రివ్యూ

Movie Name: Papam Pasivadu

Release Date: 2023-09-29
Cast: Sri Ramchandra, Rasi Singh, Sri Vidya,
Director: Lalith Kumar
Producer: Akhilesh Vardhan
Music: Jose Jimmy
Banner: Weekend Show Production
Rating: 2.00 out of 5
  • శ్రీరామచంద్ర హీరోగా రూపొందిన 'పాపం పసివాడు'
  • కామెడీ ప్రధానంగా సాగవలసిన కథ .. ఆ వైపు నుంచే తగ్గిన మార్కులు  
  • పాత్రలను డిజైన్ చేసిన తీరులోనూ తప్పని అసంతృప్తి
  • ఆడియన్స్ జారిపోకుండా ట్రై చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • నిర్మాణ విలువలు .. కెమెరా పనితనం బాగున్నాయి  

సింగర్ శ్రీరామచంద్ర హీరోగా 'పాపం పసివాడు' వెబ్ సిరీస్ రూపొందింది. అఖిలేశ్ వర్ధన్ నిర్మించిన ఈ సిరీస్ కి  లలిత్ కుమార్ దర్శకత్వం వహించాడు. కామెడీ ప్రధానంగా నడిచే ఈ సిరీస్ ఐదు ఎపిసోడ్స్ గా సెప్టెంబర్ 29వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్ ను ప్రధానంగా చేసుకుని డిజైన్ చేసుకున్న ఈ కంటెంట్, వాళ్లకి ఏ స్థాయిలో కనెక్ట్  అయిందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ కథ మొదటి నుంచి చివరివరకూ హైదరాబాదులో జరుగుతుంది. క్రాంతి (శ్రీరామచంద్ర) మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. పెళ్లి చేసుకుపోమని పేరెంట్స్ అతణ్ణి పోరుతుంటారు. అదే సమయంలో అతనికి డింపీ (గాయత్రి)తో బ్రేక్ అప్ అవుతుంది. దాంతో అతను కొన్ని రోజుల పాటు తన ఫ్రెండ్ తో ఉంటానంటూ 'నాసా (మ్యాడీ) రూమ్ కి వచ్చేస్తాడు. అక్కడే తాగుతూ .. దమ్ముకొడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. 


ఒక రోజున అతనికి అనుకోకుండా ఒక యువతి (చారూ - రాశి సింగ్) పరిచయమవుతుంది. చారూతో పాటు ఆమె రూమ్ కి వెళ్లిన క్రాంతి, ఆ రాత్రి అక్కడే ఉండిపోతాడు. మరునాడు ఉదయాన్నే మెలకువ వచ్చిన తరువాత, రాత్రి తమ మధ్య ఏదో జరిగిందని అనుకుంటాడు. అక్కడి నుంచి వచ్చేసిన తరువాత, ఆమె పేరు అడగనందుకు .. ఫ్లాట్ నెంబర్ గుర్తుపెట్టుకోనందుకు తిట్టుకుంటాడు. ఆమె కోసం వెతికినా ప్రయోజనం లేకుండా పోతుంది. 

ఇలాంటి పరిస్థితుల్లోనే అతనికి అనూష (శ్రీవిద్య) పరిచయమవుతుంది. తమ ఇద్దరి అభిరుచులు .. అభిప్రాయాలు కలిశాయనే విషయం క్రాంతికి అర్థమవుతుంది. ఆమెతో ఎంగేజ్ మెంట్ కి అతను అంగీకరిస్తాడు. ఎప్పుడూ పెళ్లి వద్దనే క్రాంతి .. సుముఖతను వ్యక్తం చేయడం పట్ల అతని పేరెంట్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అనూషతో ఎంగేజ్ మెంట్ కి ఏర్పాట్లు చేస్తారు. బంధు మిత్రులతో అక్కడి వాతావరణం అంతా కూడా చాలా సందడిగా ఉంటుంది. 

 ఊహించని విధంగా ఆ ఫంక్షన్ కి చారూ వస్తుంది. ఆమెను చూడగానే క్రాంతి తన కళ్లను తానే నమ్మలేకపోతాడు. చారూతోనే అందమైన జీవితాన్ని ఊహించుకున్న క్రాంతి, అప్పుడు ఏం చేస్తాడు? ఆ తరువాత ఏమౌతుంది? చివరికి క్రాంతి పెళ్లి ఎవరితో జరుగుతుంది? అనేది మిగతా కథ.

'పాపం పసివాడు' అనే టైటిల్ .. ఈ సిరీస్ నుంచి వదిలిన పోస్టర్స్ చూస్తే, ఇది కామెడీ ప్రధానంగా సాగే కథ అనే విషయం అందరికీ అర్థమైపోతూనే ఉంటుంది. దాంతో ఈ కథ అంతా కూడా కామెడీ ప్రధానంగా సాగుతుందని భావించడం సహజం. అలా అనుకుని కథలోకి అడుగుపెట్టినవారికి ఎక్కడా కూడా నవ్వురాదు. సన్నివేశాలలోనే కాదు, సందర్భాల్లోను .. సంభాషణాల్లోను కామెడీ కనిపించదు .. వినిపించదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను బట్టి 'ఇది కామెడీ సీన్ కాబోలు' అనుకోవాలంతే.

ప్రధానమైన కథలోకి చూస్తే .. హీరోగారి లైఫ్ లో ముగ్గురు హీరోయిన్స్ కనిపిస్తారు. బ్రేకప్ లు .. అలకలు పక్కన పెడితే, ఈ ముగ్గురూ హీరో లైఫ్ ను ప్రభావితం చేసినవారే. అయితే ఆ ముగ్గురూ హీరో లైఫ్ లోకి ఎంటర్ కావడమనేది ఎఫెక్టివ్ గా చూపించలేదు. అందువలన ఈ మూడు ట్రాకులు కూడా చాలా సాదా సీదాగా .. ఎలాంటి ఆసక్తిని రేకెత్తించకుండా అలా నడుస్తూ ఉంటాయి. ఏ వైపు నుంచి ఎలాంటి ట్విస్టులు కనిపించవు. 

పబ్ కి వెళ్లిన హీరోయిన్ .. అదే పబ్ కి వచ్చిన హీరో వాష్ రూమ్స్ దగ్గర కలుసుకుంటారు. వాళ్ల ట్రాక్ కి సంబంధించి అదే వాళ్ల ఇంట్రడక్షన్. అంతకుముందు వాళ్ల మధ్య పరిచయం లేదు. వాష్ రూమ్స్ కి 'అవుటాఫ్ సర్వీస్' బోర్డులు తగిలించి ఉంటాయి. పక్కనే తన ఫ్రెండ్ ఫ్లాట్ ఉందనీ .. అక్కడి వాష్ రూమ్ ను వాడుకోమని చెప్పి, హీరోను వెంటబెట్టుకుని ఆ హీరోయిన్ తన కారులో తీసుకు వెళుతుంది. ట్రెండ్ పేరుతో కథ కాస్త చొరవ తీసుకోవడం ఇక్కడ కనిపిస్తుంది.    

ప్రధానమైన పాత్రలు కొన్నే ఉన్నప్పటికీ, అవి ఆడియన్స్ ను ప్రభావితం చేసే స్థాయిలో డిజైన్ చేయలేదు. నవ్వించడానికి హీరో .. అతని పేరెంట్స్ చాలా కష్టాలు పడ్డారుగానీ, కంటెంట్ లో బలం లేకపోవవడం వలన పాపం .. వాళ్ల వల్ల కాలేదు. అందుకేనేమో హీరో మేనమామ పాత్రలో అశోక్ కుమార్ ను - ఆయన కూతురును రంగంలోకి దింపారు. కానీ ఆ ట్రాక్ నవ్వు తెప్పించలేకపోగా కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. 

కథలో బలం లేదు .. కథనంలో విషయం లేదు .. పాత్రలను డిజైన్ చేయడం కుదరలేదు .. కామెడీ వర్కౌట్ కాలేదు. కానీ జోస్ జిమ్మీ మాత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కొంతవరకూ కాపాడగలిగాడు. గోకుల్ భారతి కెమెరా పనితనం కూడా కొంతవరకూ హెల్ప్ అయింది. నిర్మాణ పరమైన విలువలు కూడా బాగానే ఉన్నాయి. కంటెంట్ విషయంలో .. దానికి అవసరమైన కామెడీ విషయంలో కసరత్తు చేసి ఉంటే, ఈ టీమ్ తోనే ఈ సిరీస్ బాగా వర్కౌట్ అయ్యుండేదేమో!
Trailer

More Movie Reviews