'హాయ్ నాన్న' - మూవీ రివ్యూ

Movie Name: Hi Nanna

Release Date: 2023-12-07
Cast: Nani, Mrunal Thakur, Baby Kiara Khanna, Jayaram, Priyadarshi Pulikonda,Angad Bedi, Shruti Haasan
Director: Shouryuv
Producer: Mohan Cherukuri
Music: Hesham Abdul Wahab
Banner: Vyra Entertainments
Rating: 3.00 out of 5
  • నాని హీరోగా రూపొందిన 'హాయ్ నాన్న'
  • దర్శకుడిగా శౌర్యువ్ పరిచయం 
  • ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కథ 
  • నిదానంగా సాగే ఫస్టాఫ్ 
  • ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్

మొదటి నుంచి కూడా నాని విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ వస్తున్నాడు. 'శ్యామ్ సింగరాయ్' .. 'దసరా' వంటి సినిమాలు చూస్తే, లుక్ పరంగా కూడా ఆయన ఎంత కేర్ తీసుకుంటున్నాడనే విషయం అర్థమవుతుంది. 'హాయ్ నాన్న' సినిమా విషయంలోను ఆయన అదే పద్ధతిని ఫాలో అయ్యాడు. ఈ రోజునే ఈ సినిమా విడుదలైంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నడిచే ఈ కథ, ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందనేది చూద్దాం. 

ఈ కథ ముంబై .. కూనూరు .. గోవాలలో జరుగుతుంది.  విరాజ్ (నాని) పేరున్న ఫొటోగ్రాఫర్. ఆయన ఆరేళ్ల కూతురు 'మహి' (బేబీ కియారా) .. ఆమెకి ఎంతో ఇష్టమైన ఒక పెంపుడు కుక్క. ఇదే వాళ్ల ప్రపంచం. 'మహి'కి పుట్టుకతోనే ఒక అరుదైన జబ్బు ఉంటుంది. అందువలన ఆమె ఎక్కువ కాలం బ్రతకదని డాక్టర్లు చెబుతారు. తన కూతురు తప్పకుండా బ్రతికి తీరుతుందనే ఒక బలమైన నమ్మకంతో విరాజ్ ఉంటాడు. కంటికి రెప్పలా పాపని కాపాడుకుంటూ ఉంటాడు. 

తన తల్లి గురించి 'మహి' తరచూ తండ్రిని అడుగుతూ ఉంటుంది. తాను పాపకి చెప్పే కథల్లో కూడా తల్లి పాత్ర లేకుండా అతను జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్లకి 'యశ్న' (మృణాళ్ ఠాకూర్) పరిచయమవుతుంది. ఆమె ఒక సంపన్న కుటుంబానికి చెందిన యువతి. డాక్టర్ అరవింద్ తో ఆమె వివాహం ఆల్రెడీ నిర్ణయించబడుతుంది. పెళ్లి జరగవలసిన తేదీ కూడా దగ్గరికి వస్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే 'మహి'ని ఒక ప్రమాదం నుంచి కాపాడిన 'యశ్న',  ఆ పాపకి దగ్గరవుతుంది. 

తల్లి ప్రేమ తెలియని 'మహి'  .. 'యశ్న'తో సంతోషంగా ఉండటాన్ని విరాజ్ గమనిస్తాడు. అలా పాప ద్వారా జరిగిన పరిచయం వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీస్తుంది. ఒకసారి అమ్మకథను చెప్పమని పాప పట్టుబట్టడంతో, యశ్న సమక్షంలోనే కొంతవరకూ చెబుతాడు విరాజ్. అతను ఆ కథను మధ్యలోనే ఎందుకు ఆపేశాడనేది 'యశ్న'కి అర్థం కాదు. దాంతో పాప లేని సమయం చూసుకుని, ఆ తరువాత ఏం జరిగిందనేది తనతో చెప్పమని విరాజ్ ను అడుగుతుంది. 

అప్పుడు విరాజ్ ఏం చెబుతాడు? అతని భార్య ఎవరు? ఎందుకు ఆమె అతనికి దూరమవుతుంది? తల్లి కోసం తపించిపోతున్న బిడ్డ దగ్గర అతను ఎంతవరకూ నిజం దాస్తూ వస్తాడు? అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ బిడ్డను అతను రక్షించుకోగలుగుతాడా? మహి పట్ల 'యశ్న'కి గల అనురాగానికి కారణమేమిటి? ఆమె వివాహం అరవింద్ తోనే జరుగుతుందా? అనేవి ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తాయి.

దర్శకుడు శౌర్యువ్ కి ఇది మొదటి సినిమా. అయినా ఆయన ఈ కథను తయారు చేసుకోవడంలోగానీ, ఆ కథను తెరపైకి తీసుకుని రావడంలో గాని ఎక్కడా కన్ఫ్యూజన్ కనిపించదు. అంత నీట్ గా ఆయన ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు. కథలోని చిన్న మెలిక ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అదే ఈ కథను మరింత బలంగా ముందుకుతీసుకుని వెళుతుంది.  కథ అంతా కూడా హీరో .. హీరోయిన్ .. పాప పాత్రల చుట్టూనే తిరుగుతుంది. మరికొన్ని పాత్రలు నామ మాత్రంగా వచ్చి వెళుతూ ఉంటాయి అంతే. 

దర్శకుడు ఎంచుకున్న కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కానీ దానిని కావాల్సినంత స్పీడ్ తో చెప్పలేకపోయాడు. అందువలన ఫస్టాఫ్ కాస్త నిదానంగా .. డల్ గానే నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి కథలో ఉన్న మెలిక ఏమిటనేది ఆడియన్స్ కి అర్థమవుతుంది. అప్పటి నుంచి కాస్త ఆసక్తికరంగా కథను ఫాలో కావడం మొదలుపెడతారు. ఇంటర్వెల్ కి ముందు హీరోయిన్ .. హీరోతో ఒక మాట అంటుంది.  క్లైమాక్స్ లో అదే డైలాగ్ ను ఆమెతో రివర్స్ లో చెప్పించడం బాగుంది.

 తండ్రీ కూతుళ్లుగా నాని - కియారా కాంబినేషన్ సీన్స్ అక్కడక్కడా కళ్లు చెమ్మగిల్లేలా చేస్తాయి. అలాగే ఎటూ తేల్చుకోలేని ఒక అయోమయ స్థితిని కలిగిన మృణాళ్ పాత్ర పట్ల సానుభూతి కలుగుతుంది.  పాత్రల పరంగా నటన విషయంలో ముగ్గురూ పోటీపడ్డారు. బేబీ కియారా అంత బాగా చేస్తుందని ఎవరూ ఊహించరు. అమ్మకావాలనే ఒక బలమైన కోరిక .. అమ్మ ప్రేమను పొందాలనే ఆరాటం .. నాన్న మాట కాదనలేని ఆవేదనను కియారా గొప్పగా ఆవిష్కరించింది.

 నాని - మృణాళ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అయితే ఈ పెయిర్ అంతగా సెట్ కాలేదేమోనని అనిపిస్తుంది. దర్శకుడు  కథలోని మెయిన్ పాయింటును ఇంటర్వెల్ తరువాత మాత్రమే చెప్పాలనే ఉద్దేశంతో, ఫస్టాఫ్ కాస్త లాగుతూ వెళ్లాడనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లో బీచ్ సాంగ్ ఓకే .. కానీ దాని కోసం శ్రుతి హాసన్ ను తీసుకుని రావడం అనవసరం అనిపిస్తుంది. పనిగట్టుకుని తీసుకురావడం వలన అతకలేదనిపిస్తుంది. పైగా ఆమె అంత గ్లామరస్ గా కనిపించలేదు .. అలా చూపించలేదు కూడా. 

ఈ కథలో పరిస్థితులే హీరో పాలిట విలన్. కామెడీ .. యాక్షన్ అనేవి కనిపించవు. ప్రధానమైన పాత్రలు మూడే ... మరో మూడు నాలుగు పాత్రలు నామ మాత్రంగా కనిపిస్తాయి అంతే. హేషమ్ అందించిన పాటలు సందర్భాన్ని బట్టి బాగానే ఉన్నాయనిపిస్తుంది. ఆ తరువాత మాత్రం గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సాను జాన్ వర్గీస్ కెమెరా పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. 'కూనూరు'లోని లొకేషన్స్ ను చాలా అందంగా చూపించాడు. ప్రవీణ్ ఆంటోని ఎడిటింగ్ ఓకే. 

మొత్తంగా చూసుకుంటే ఈ కథ ఫస్టాఫ్ స్లోగా నడుస్తుంది .. సెకండాఫ్ మొదట్లో కాస్త పుంజుకుని, క్లైమాక్స్ కి ముందు కాస్త స్పీడ్ అందుకుంటుంది. 'కొన్ని బంధాలను కలపలేం .. కొన్ని బంధాలను విడదీయలేం' అనే కాన్సెప్ట్ తో ఈ కథ నడుస్తుంది. కూతురు పట్ల ఒక తండ్రికి గల ప్రేమ, విధిని సైతం ఎదిరించగలదనే విషయాన్ని అంతర్లీనంగా ఆవిష్కరిస్తుంది. సున్నితమైన భావోద్వేగాలకు ప్రాధాన్యతను ఇవ్వడం వలన, యూత్ కంటే కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: కథలోని కొత్త పాయింట్ .. నాని - మృణాళ్ - కియారా నటన .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ... ఫొటోగ్రఫీ. 

మైనస్ పాయింట్స్: ఫస్టాఫ్ స్లోగా ఉండటం .. కథతో సంబంధం లేకుండా శ్రుతి హాసన్ ను అనవసరంగా తీసుకురావడం.
Trailer

More Movie Reviews