'జపాన్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ

Movie Name: Japan

Release Date: 2023-12-11
Cast: Karthi, Anu Emmanuel, Sunil, Vijay Milton, Jithan Ramesh,K. S. Ravikumar
Director: Raju Murugan
Producer: S.R.Prakash Babu - Prabhu
Music: G. V. Prakash Kumar
Banner: Dream Warrior Pictures
Rating: 2.50 out of 5
  • నవంబర్ 10న విడుదలైన 'జపాన్'
  • ఈ నెల 11 నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి 
  • రీసెంటుగా అందుబాటులోకి వచ్చిన తెలుగు వెర్షన్
  • ఆసక్తికరంగాలేని కథాకథనాలు 
  • కార్తి - సునీల్ నటన ప్రత్యేక ఆకర్షణ

డబ్బు చుట్టూ .. నిధి చుట్టూ .. బంగారం చుట్టూ తిరిగే కథలు గతంలో చాలానే వచ్చాయి. దోచుకున్నవాడికీ ... తిరిగి దానిని దక్కించుకోవాలనుకునేవాడికి .. మధ్యలో ఆశపడేవాడికి మధ్య జరిగే పోరాటంగా చాలా కథలు పలకరించాయి. అలా 200 కోట్ల రూపాయల ఖరీదు చేసే గోల్డ్ చుట్టూ తిరిగే కథాకథనాలతో రూపొందిన సినిమానే 'జపాన్'. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నవంబర్ 10న థియేటర్స్ కి వచ్చింది. రీసెంటుగా 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులోకి వచ్చింది.

జపాన్ (కార్తి) ఒక గజదొంగ. పేదరికంలో పుట్టిపెరిగిన జపాన్ కీ, తన తల్లి సింగారమ్మ పేదరికంలోనే చనిపోవడం బాధను కలిగిస్తుంది. తాను కూడా అదే పేదరికంలో చనిపోకూడదనే ఉద్దేశంతో అతను దొంగతనాలకు పాల్పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ బ్యాంక్ నుంచి 200 కోట్ల రూపాయల ఖరీదు చేసే బంగారం దొంగిలించబడుతుంది. అంత పెద్ద దొంగతనాన్ని జపాన్ మాత్రమే చేయగలడని పోలీస్ డిపార్టుమెంటు భావిస్తుంది. దాంతో జపాన్ కోసం లోకల్ పోలీస్ ఆఫీసర్ శ్రీధర్ (సునీల్) .. స్పెషల్ ఆఫీసర్ భవాని (విజయ్ మిల్టన్) గాలించడం మొదలుపెడతారు.

 అయితే పోలీస్ వారు జపాన్ కోసం అంత సిన్సియర్ గా వెతకడానికి మరో కారణం ఉంది. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కి సంబంధించిన ఒక సీక్రెట్ వీడియో జపాన్ దగ్గర ఉంటుంది. అది బయటికి వస్తే, డిపార్టుమెంటుకు చెడ్డపేరు వస్తుంది. అందువలన బంగారం పేరుతో జపాన్ ను వేటాడి, అతని నుంచి ఆ వీడియోను తీసుకుని ఎన్ కౌంటర్ చేయాలనేది అసలు ప్లాన్. ఇక జపాన్ విషయానికి వస్తే, అక్కడక్కడా కొట్టేసిన ధనంతో అతను చాలా సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అతను దాచేసిన ధనం ఎక్కడ ఉందనేది అతని అనుచరులకు కూడా తెలియదు.

 తాను కొట్టేసిన డబ్బుతో తానే హీరోగా సినిమాలు తీయాలనీ, హీరోయిన్ సంజన (అనూ ఇమ్మాన్యుయేల్) ను పెళ్లి చేసుకోవాలని అతను భావిస్తూ ఉంటాడు. అదే సమయంలో అతనికి ఎయిడ్స్ సోకిందనే విషయం బయటపడుతుంది. దాంతో జపాన్ ఇక ఎక్కువ కాలం బ్రతకడని భావించిన ప్రధానమైన అనుచరులు అతనిని దొంగదెబ్బ తీయడానికి సిద్ధమవుతారు. జపాన్ ను చంపేసి అతని దగ్గరున్న డబ్బును తాము నొక్కేయాలని నిర్ణయించుకుంటారు. ఇలా పోలీస్ వారితో పాటు తన ముఠాలోని సభ్యుల నుంచే తనకి ప్రమాదం పొంచి ఉందని భావించిన జపాన్ ఏం చేస్తాడు? అతనే ఆ బంగారాన్ని కాజేశాడా? సంజనతో అతని వివాహం జరుగుతుందా? అనే మలుపులతో ఈ కథ నడుస్తుంది.

 ఈ సినిమాలో కార్తి పాత్ర పేరు 'ముని' .. కానీ తల్లి అతణ్ణి 'జపాన్' అని పిలిచేది. అందుకు చెప్పిన రీజన్ కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. అంతే కాదు .. ఈ టైటిల్ ఈ సినిమాకి మైనస్ అయిందని కూడా అనుకోవాలి. 200 కోట్ల రూపాయలను బ్యాంక్ నుంచి కొల్లగొట్టడంతో ఈ కథ మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి ఒక రేంజ్ లో కథ పరుగెడుతుందని ఆడియన్స్ అనుకుంటారు. కానీ అలాంటిదేం జరగదు. ఫస్టాఫ్ విషయంలో అసంతృప్తిగా ఉన్న ప్రేక్షకులు, సెకండాఫ్ చూశాక ఫస్టాఫ్ చాలా బెటర్ అనుకునే పరిస్థితి ఉంటుంది. 

ఇక అనూ ఇమ్మాన్యుయేల్ కి హాట్ బ్యూటీ అనే పేరు ఉంది. ఆమెను హీరో ఎప్పుడు కలుసుకుంటాడా? ఆమెతో కలిసి ఏ రేంజ్ లో రొమాన్స్ చేస్తాడా? అని మాస్ ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే అంతలోనే హీరోకు ఎయిడ్స్ అని చెప్పి, అతని చేతిలో రిపోర్ట్స్ పెడతాడు డాక్టర్. దాంతో ఆడియన్స్ ఉస్సూరు మంటారు. హీరోకి ఎయిడ్స్ పెట్టడం వలన కథకి ఏం ఒరిగిందనేది దర్శకుడికే తెలియాలి. ఒకవేళ క్లైమాక్స్ లో హీరో తీసుకునే నిర్ణయానికి ఇదే కారణమనుకుందామంటే, అది కూడా ఆడియన్స్ కి నిరాశను కలిగించేదే. 

కార్తి - సునీల్ యాక్టింగ్ .. వాళ్ల లుక్స్ .. డైలాగ్ డెలివరీ ఈ సినిమాకి హైలైట్. ఇక మిగతా పాత్రలను గురించి మాట్లాడుకోలేం. ఎందుకంటే అవన్నీ నామమాత్రంగా వచ్చి వెళుతూ ఉంటాయి. సాంకేతిపరంగా చూసుకుంటే, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం .. రవి వర్మన్ ఫొటోగ్రఫీ .. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ఫరవాలేదనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోను ఎదుర్కునే బలమైన విలన్ కనిపించడు. హీరో తన హీరోయిజాన్ని చూపించడం కనిపించదు. హీరోయిన్ మాత్రం పేరుకే అలా కనిపిస్తుందంతే.  సినిమా అంతా హీరో కోసం పోలీసులు వెదుకుతూ ఉంటారు. మనమేమో కథ కోసం తెరపై వెదుకుతూ ఉంటాము. చివరికి వాళ్లకి హీరో దొరికాడా లేదా అనేది సస్పెన్స్ లో పెడితే, మనకి మాత్రం కథ దొరకదు.

 అక్కడక్కడా కార్తి మార్క్ కామెడీ కనిపిస్తుంది. మదర్ సెంటిమెంట్ .. భార్యాభర్తల ఎమోషన్స్ ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతాయి. హీరో - హీరోయిన్ మధ్య రెండు డ్యూయెట్లు ఉన్నాయి. అయితే ప్రేక్షకులను రెండున్నర గంటలకి పైగా కూర్చోబెట్టడానికి ఈ కొలత సరిపోదు. కొత్తదనం లేని కథ .. తాపీగా .. సాదా సీదాగా సాగే కథనం ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తుంది. 


ప్లస్ పాయింట్స్: కార్తి - సునీల్ పాత్రలు, నిర్మాణ విలువలు 


మైనస్ పాయింట్స్: ముఖ్యమైన పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం
Trailer

More Movie Reviews