' చేరన్స్ జర్నీ' (సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ

Movie Name: Cherans Journey

Release Date: 2024-01-12
Cast: Sarathkumar, Prasanna, Aari Arujunan, Kalaiyarasan, Divyabharathi, Kashyap Barbhaya, Jayaprakash, Ilavarasu, Naren, Anju Kurian
Director: Cheran
Producer: Compass 8 Films
Music: -
Banner: Compass 8 Films
Rating: 2.75 out of 5
  • చేరన్ నుంచి వచ్చిన వెబ్ సిరీస్ 
  • 9 ఎపిసోడ్స్ గా రూపొందిన కథ 
  • అందుబాటులో ఉన్న తెలుగు వెర్షన్
  • సందేశంతో కూడిన కథాకథనాలు 
  • నిడివి ఎక్కువగా అనిపించే సన్నివేశాలు

తమిళంలో రచయితగా ... దర్శకనిర్మాతగా .. నటుడిగా చేరన్ కి మంచి పేరు ఉంది. తన సినిమాలకి అవసరమైన కథలను ఆయన జనంలో నుంచే తీసుకుంటారు. అనుభూతి ప్రధానంగా తెరపై వాటిని ఆవిష్కరించడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ వెళతాడు. 2004లో ఆయన నుంచి వచ్చిన 'ఆటోగ్రాఫ్' సినిమా చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆయన రూపొందించిన వెబ్ సిరీస్ 'చేరన్స్ జర్నీ' ఈ నెల 12 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 9 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

అశోక్ (శరత్ కుమార్) పెద్ద బిజినెస్ మేన్. కార్లను తయారు చేసే సంస్థను ఆయన నిర్వహిస్తూ ఉంటాడు. వేలమంది ఉద్యోగులు ఆ సంస్థలో పనిచేస్తూ ఉంటారు. అయితే ఒక కీలకమైన జాబ్ కోసం ఒకరిని తీసుకోవాలని ఆయన భావిస్తాడు. అందుకోసం ఇంటర్వ్యూల ద్వారా వడబోస్తూ ఒక ఐదుగురిని ఫైనల్ లిస్టులోకి తీసుకుని వస్తాడు. అందులో నుంచి ఒకరిని ఎంపిక చేయడానికిగాను ఆయన తన స్నేహితుడైన మాధవన్ (జయప్రకాశ్) సాయాన్ని కోరతాడు.

ఆ జాబితాలో అమీర్ .. నితేశ్ .. రాఘవ్ .. ప్రణవ్ ... లత పేర్లు ఉంటాయి. ఈ ఐదుగురి జీవితాలను దగ్గరగా పరిశీలించి .. సోషల్ మీడియాలో వాళ్లు చేసే పోస్టులను బట్టి వాళ్ల స్వభావాన్ని అంచనావేస్తూ .. వాళ్లలో ఒకరిని ఎంపిక చేస్తే బాగుంటుందని మాధవన్ భావిస్తాడు. ఆ ఐదుగురు ఇంటర్వ్యూకి వచ్చేలోగా వాళ్లపై ఒక స్పెషల్ రిపోతును అశోక్ కి ఇవ్వాలనే ఉద్దేశంతో అదే పనిపై కసరత్తు చేయడం మొదలుపెడతాడు. 

అమీర్ తన మతం కారణంగా ఉద్యోగాన్ని పొందలేక, ఆర్ధికంగా అనేక ఇబ్బందులను పడుతూ ఉంటాడు. చెప్పుల షాపులో పనిచేసే తన తండ్రి కలను నిజం చేయడం కోసం తాను మంచి ఉద్యోగాన్ని పొందాలనే పట్టుదలతో ఉంటాడు. తన కొడుకును మించి అమీర్ ఎదగకూడదనే స్వార్థంతో అతణ్ణి అణగదొక్కడానికి ఒక దుర్మార్గుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక మేజర్ జనరల్ కొడుకైన నితేశ్, తాను చేయని తప్పుకు కుటుంబానికి దూరమవుతాడు. తన తండ్రి తలెత్తులకునేలా చేయడం కోసం, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. 

రాఘవ్ (ప్రసన్న) ఓ సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. పేద విద్యార్థులను చదివించాలనే తండ్రి కోరిక నెరవేరడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే 'వీసా'ల పరమైన సమస్య కారణంగా అతను తన ఊరికి తిరిగి రావలసి వస్తుంది. తండ్రి ఆశయం నెరవేర్చాలనేదే ప్రస్తుతం అతని ముందున్న లక్ష్యం. ఇక రాజకీయం - రౌడీయిజం కలిసి చేస్తున్న అరాచకానికి ప్రణవ్ ఓ ప్రత్యక్ష సాక్షి. ఆదర్శవంతమైన అధికారాన్ని అతను ఆకాంక్షిస్తూ ఉంటాడు.

ఇక లతా విషయానికి వస్తే .. స్నేహితులతో కలిసి జాలీగా ఒక ఫారెస్టు ఏరియాకి వెళ్లిన ఆమెకి, అక్కడ రైతు కుటుంబానికి చెందిన దంపతులు తారసపడతారు. వ్యవసాయం ప్రాధాన్యత .. నేటి యువత వ్యవసాయానికి దూరంగా వెళ్లడం గురించి ఆ దంపతులు చెప్పిన మాటలు వాళ్లందరినీ ఆలోచింపజేస్తాయి. దాంతో వాళ్లంతా కలిసి వ్యవసాయం దిశగా యువతను మళ్లించాలనే నిర్ణయానికి వస్తారు. ఆ దిశగా అడుగులు వేస్తారు. 

ఇలా అశోక్ కార్ల సంస్థలో ఉద్యోగానికి నిలిచిన ఐదుగురి వెనుక అనేక సమస్యలు .,. కష్టాలు ఉండటం, వాటిని అధిగమించాలనే పట్టుదల వారిలో బలంగా ఉండటాన్ని మాధవన్ గమనిస్తాడు. వివిధ ప్రాంతాలకి చెందిన ఆ ఐదుగురు ఒకే రోజున ఇంటార్వ్యూకి హాజరవుతారు. ఉన్నది ఒక్కటే ఉద్యోగం .. హాజరైంది ఐదుగురు ప్రతిభావంతులు. వాళ్లలో అశోక్ ఎవరిని ఎంపిక చేస్తాడు? ఆయన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు? అనేదే ఆసక్తికరమైన అంశం. 

             
కొన్ని కథలు కొన్ని జీవితాలకు దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. మరికొన్ని కథలు ... జీవితాల్లో నుంచే పుడతాయి. ఆ రెండో కోవకి చెందిన కథ ఇది. చేరన్ ఐదుగురు వ్యక్తులను తీసుకుని .. ఆ పాత్రల చుట్టూ కథను అల్లుతూ వెళ్లాడు. 9వ ఎపిసోడ్ అంతా కూడా ఇంటర్వ్యూలతోనే కొనసాగుతుంది. మిగతా 8 ఎపిసోడ్స్ లోను ఎమోషన్స్ ఉండేలా చూసుకున్నాడు. విలేజ్ ... టౌన్ ... సిటీ ... విదేశాలను టచ్ చేస్తూ ఈ కథలు కొనసాగుతాయి. 

ఈ ఐదు ట్రాకులలో అమీర్ - రాఘవ్ ట్రాకులు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. మిగతా ట్రాకులు ఓ మాదిరిగా అనిపిస్తాయి. యువత తమ ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి  ప్రయత్నం చేస్తూనే, అటు కన్నవాళ్ల కళను నిజం చేయడానికి కృషి చేయాలి. అదే సమయంలో తమ చుట్టూ ఉన్నవారికి సాయం చేయడానికి ముందుకు రావాలి అనే సందేశాన్ని ఇచ్చిన తీరు బాగుంది. అయితే అందుకు సంబంధించిన సన్నివేశాలు అవసరానికి మించి సాగదీసినట్టుగా అనిపిస్తుంది.

దర్శకుడు క్లైమాక్స్ ను డిజైన్ చేసిన తీరు బాగుంది. ఇదే ఈ కథకి కరెక్ట్ క్లైమాక్స్ అని కూడా అనిపిస్తుంది. ఆయా పాత్రలకి సంబంధించిన ట్రాకుల నిడివికి ఎక్కువ సమయాన్ని కేటాయించినట్టుగా అనిపించినప్పటికీ, క్లైమాక్స్ విషయంలో ఆడియన్స్ సంతృప్తి చెందుతారు. ఆర్టిస్టులంతా కూడా తమ పాత్రలను సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్లారు. ఫొటోగ్రఫీ ... నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ అన్నీ కూడా కథను మరింత సపోర్టు చేశాయి. వినోదం పరంగా కంటే, సందేశం పరంగా మంచి మార్కులు కొట్టేసే సిరీస్ ఇది. 

Trailer

More Movie Reviews