'గుడ్ లక్ గణేశా' (ఆహా) మూవీ రివ్యూ

Movie Name: Good Luck Ganesha

Release Date: 2024-01-19
Cast: Yogibabu, Ramesh Thilak, Urvasi,Karunakar, Uday Chandra, Harish Peradi
Director: Rejish Midhila
Producer: Lijo
Music: Bharath Shankar
Banner: Mahadev Annabhimoju
Rating: 2.75 out of 5
  • యోగిబాబు ప్రధాన పాత్రగా 'గుడ్ లక్ గణేశా'
  • చిన్న బడ్జెట్ .. సింపుల్ కంటెంట్ 
  • సహజత్వానికి పెద్దపీట వేసిన దర్శకుడు 
  • బలమైన సందేశాన్ని ఇచ్చిన కథ 
  • మరింత ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి ఛాన్స్ ఉన్న కాన్సెప్ట్ ఇది

భగవంతుడు మనిషి రూపంలో ఈ లోకంలోకి వచ్చి, తాను మార్పును ఆశించినవారి కోసం రంగంలోకి దిగడం .. స్వార్థంతో ప్రవర్తించేవారి కళ్లు తెరిపించే కార్యక్రమాలను పెట్టుకోవడం వంటి సరదా సంఘటనలతో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అలాంటి ఒక నేపథ్యంతో వచ్చిన తమిళ సినిమానే 'యానై ముగతాన్'. 2023 ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా, 'గుడ్ లక్ గణేశా' టైటిల్ తో ఈ రోజు నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. యోగిబాబు ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

1999లో ఈ కథ మొదలవుతుంది. చెన్నైలోని ఒక పెంట్ హౌస్ లో గణేశ్ (రమేశ్ తిలక్) అద్దెకి ఉంటూ ఉంటాడు. అతనికి పెంట్ హౌస్ ఇచ్చిన మల్లిక (ఊర్వశి)నే ఆటో కూడా అద్దెకి ఇస్తుంది, దానిని నడుపుకుంటూ అతను తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే అతనికి ఉన్న తాగుడు వ్యసనం వలన, పరిచయమైన వాళ్లందరి దగ్గర అప్పు చేస్తూ ఉంటాడు. చివరికి మల్లికకు కూడా మూడేళ్లుగా అద్దె ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. 

గణేశ్ కి వినాయకుడు అంటే ఇష్టం. ప్రతి రోజు తన రూమ్ లోని విగ్రహానికి దణ్ణం పెట్టుకుని హుండీలో ఒక రూపాయి వేస్తూ ఉంటాడు. అప్పు ఇచ్చినవాళ్లలో ఎవరైనా తనని వేధిస్తూ ఉంటే, వాళ్లకి చెడు జరిగేలా చేయమని ఆ స్వామిని కోరుతూ ఉంటాడు. ఎంతసేపు తన గురించి తప్ప మరెవరి గురించిన ఆలోచన చేయడు. ఎవరికి ఎలాంటి సాయం చేయకపోగా, ఆటోని చుట్టూ తిప్పి తీసుకెళ్లి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. 

 ఒక రోజున తన పూజ గూట్లో ఎలుకపై కూర్చుని ఉండే వినాయకుడు మాయం కావడంతో, కంగారు పడిపోయి వినాయకుడి కేలండర్ వైపు చూస్తాడు. అందులోను ఆయనకి వినాయకుడు కనిపించడు. వినాయకుడు తప్ప అన్నీ కనిపిస్తూ ఉంటాయి .. అందరూ కనిపిస్తూ ఉంటారు. దాంతో తాను తరచూ వెళ్లే వినాయకుడి గుడికి పరిగెడతాడు. గర్భాలయంలోని వినాయకుడు తనకి మాత్రమే కనిపించకపోవడంతో ఆలోచనలో పడతాడు. అందుకు కారణం ఏమిటనేది అర్థంకాక అయోమయంలో పడతాడు.

గణేశ్ కి అప్పుడు ఇచ్చినవాళ్లలో కొంతమంది అతనిని హెచ్చరించి వెళుతూ ఉంటారు. మరికొంతమంది బెదిరించి మరీ గడువు పెట్టి వెళుతూ ఉంటారు. ఈ క్రమంలోనే రంగన్న (హరీశ్ పేరడి) కూతురు పెళ్లి పెట్టుకుంటాడు. పెళ్లి సమయానికి డబ్బు అందజేస్తానని చెప్పిన గణేశ్ ఆ విషయంలో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ సమయంలో అతని ముందు సాధారణమైన వ్యక్తిగానే వినాయకుడు (యోగిబాబు) ప్రత్యక్షమవుతాడు. తానే వినాయకుడినని గణేశ్ తో చెబుతాడు. ఆ మాటను నమ్మడానికి అతనికి కొంత సమయం పడుతుంది. 

 గణేశ్ స్వార్థ బుద్ధి కారణంగానే తాను కనిపించకుండా వెళ్లిపోయానని వినాయకుడు చెబుతాడు. ఇకనైనా మంచి మార్గంలో నడవటానికి ప్రయత్నించమని సలహా ఇస్తాడు. ఒక రోజంతా తాను నిజాయితీగా బ్రతకడానికి ట్రై చేస్తాననీ, అయితే వినాయకుడి అసలు రూపాన్ని తనకి చూపించాలని గణేశ్ కోరతాడు. అందుకు వినాయకుడు అంగీకరిస్తాడు. 

ఆ రోజు ఉదయం నుంచి అర్థరాత్రి 12 గంటల వరకూ అబద్దం చెప్పకుండా .. అన్యాయం చేయకుండా నిజాయతీగా బ్రతకాలనే పట్టుదలతో గణేశ్ బయల్దేరతాడు. ఆ రోజు అతని ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు అతను ఏం చేస్తాడు? తానన్న మాటను అతను నిలబెట్టుకోగలుగుతాడా? వినాయకుడి అసలు రూపాన్ని చూడగలుగుతాడా? అనేది మిగతా కథ.

దర్శకుడు రెజీశ్ మిథిలా తయారు చేసుకున్న కథ ఇది.  ఒక మనిషిలో మంచి మార్పు రావాలంటే అతని కళ్లముందు కొన్ని సంఘటనలు జరగాలి. కొన్ని అనుభవాలు ఎదురుకావాలి. అలాంటివాటిని సృష్టించేది కూడా ఆ దేవుడే అనే విషయాన్ని ఆవిష్కరించిన కంటెంట్ ఇది. దేవుడిని కూడా మనిషిలానే చూపిస్తూ, మనిషిలో మార్పు తీసుకొచ్చే కాన్సెప్ట్ ఇది. మరింత  ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి అవకాశం ఉన్న కథావస్తువు ఇది. 

కేవలం ఆరు ప్రధానమైన పాత్రలతోనే ఈ కథ అంతా నడుస్తూ ఉంటుంది. కామెడీని .. ఎమోషన్స్ ను టచ్ చేస్తూ, సందేశం దిశగా ఈ కథ పరిగెడుతుంది. సింపుల్ కంటెంట్ తో .. సహజమైన లొకేషన్స్ లోనే ఈ కథ సాగుతుంది. పాత్రలు .. సన్నివేశాలు .. సంభాషణలు .. వాస్తవానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి. కార్తీక్ నాయర్ ఫొటోగ్రఫీ .. భరత్ శంకర్ నేపథ్య సంగీతం ఈ కథలోని సహజత్వాన్ని కాపాడుతూ వెళ్లాయి. 

 దేవుడిని అన్వేషిస్తూ వెళ్లడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. నువ్వు మనిషివని నిరూపించుకోవాలనుకుంటే ఎదుటివారిలో దేవుడిని చూడటానికి మించిన మార్గం లేదు. మానవత్వానికి మించిన మంత్రం లేదు. దేవుడు అలాంటి మంత్రానికే లొంగుతాడనే సందేశాన్ని ఇచ్చిన సినిమా ఇది. 
Trailer

More Movie Reviews