'బూట్ కట్ బాలరాజు' (ఆహా) మూవీ రివ్యూ!

Movie Name: Bootcut Balaraju

Release Date: 2024-02-26
Cast: Syed Sohel, Meghalekha, Suman, Indrajam Sunil, Mukku Avinash
Director: Sree Koneti
Producer: Md. Pasha
Music: Bheems Ceciroleo
Banner: Katha Veruntadhi Productions
Rating: 2.25 out of 5
  • 'బూట్ కట్ బాలరాజు'గా సోహెల్ 
  • నిన్న సాయంత్రం నుంచి స్ట్రీమింగ్ 
  • తన పాత్రలో మెప్పించిన సోహెల్
  • కంటెంట్ ను ప్రమాదంలో పడేసిన లూజ్ సీన్స్
  • మరింత జరగాల్సిన  కసరత్తు   

సోహెల్ హీరోగా చేసిన 'బూట్ కట్ బాలరాజు' సినిమా, ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి థియేటర్ల నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. అలాంటి ఈ సినిమా నిన్నటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీ కోనేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందనేది చూద్దాం.

ఈ కథ తెలంగాణ ప్రాంతంలోని ఒక గ్రామంలో నడుస్తుంది. ఆ గ్రామానికి సర్పంచ్ గా ఇంద్రావతి (ఇంద్రజ) ఉంటుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం .. ఇచ్చిన మాటపై నిలబడటం ఆమెకి తండ్రి నుంచి వచ్చిన లక్షణం. ఊరు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం, భర్తను వదిలేయడానికి కూడా వెనుకాడని వ్యక్తిత్వం ఆమె సొంతం. ఆమె ఒక్కగానొక్క కూతురే మహాలక్ష్మి( మేఘలేఖ). చిన్నప్పటి నుంచి తల్లి పట్టుదల తెలిసిన కూతురు. 

అదే గ్రామానికి చెందిన ఓ మధ్యతరగతి యువకుడే బాలరాజు (సోహెల్). అతను .. మహాలక్ష్మి ఒకే కాలేజ్ లో చదువుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంతో బాలరాజుకు సాన్నిహిత్యం ఉంటుంది. బాలరాజు పట్ల మహాలక్ష్మికి గల అభిమానం ప్రేమగా మారుతుంది. అదే సమయంలో అదే కాలేజ్ లో చదువుతున్న సిరి (సిరి) కూడా బాలరాజును ఇష్టపడుతూ ఉంటుంది. అది తెలిసిన మహాలక్ష్మి, బాలరాజుకు ఐ లవ్ యూ చెబుతుంది. దాంతో అతను కూడా ఆమె ప్రేమలో పడిపోతాడు. 

ఇంద్రావతితో ఊరుకు సంబంధించిన పనిపై వచ్చిన సబ్ కలెక్టర్, మహాలక్ష్మిని చూసి మనసు పారేసుకుంటాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. తన తల్లిదండ్రులతో ఆ విషయాన్ని గురించి మాట్లాడిస్తాడు. తన కూతురు తన మాట కాదనదనే ఉద్దేశంతో ఇంద్రావతి వారికి మాట ఇస్తుంది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆమె, ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయిన మహాలక్ష్మినీ, బాలరాజును చూస్తుంది. ఆగ్రహావేశాలను తట్టుకోలేకపోతుంది. తాను బాలరాజును పెళ్లి చేసుకుంటానని తల్లితో మహాలక్ష్మి చెబుతుంది. 

సబ్ కలెక్టర్ కి తాను మాట ఇచ్చిన విషయం ఇంద్రావతి చెబుతుంది. ఆ సమయంలోనే ఆమె ప్రెసిడెంట్ పదవిని గురించి బాలరాజు ఎదిరించి మాట్లాడతాడు. ఎన్నికలలో ప్రెసిడెంట్ గా బాలరాజు గెలిస్తే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాననీ, ఒకవేళ ఓడిపోతే ఊరు వదిలి వెళ్లిపోవాలని ఇంద్రావతి షరతు పెడుతుంది. ఎన్నికలలో గెలవడం కోసం బాలరాజు ఏం చేస్తాడు? ఎంతో మంచి పేరున్న ఇంద్రావతిని కాదని బాలరాజు గెలుస్తాడా? అనేది మిగతా కథ.

 'మాట' ను ప్రాణంగా భావించే తల్లికీ .. ప్రేమను ప్రాణంగా భావించే కూతురుకు మధ్య జరిగే పోరాటం ఈ కథ. ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడం కోసం, ఊరు పెద్దపై ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు చేసే పోరాటం ఈ కథ. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ కథను, దర్శకుడు శ్రీ కోనేటి తయారు చేసుకున్నాడు. ప్రధానమైన పాత్రలతో పాటు ... గ్రామస్థులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ కథను నడిపించాడు. ఈ కథలో గ్రామాన్ని కూడా ఒక పాత్ర చేయగలిగాడు. 

అయితే దర్శకుడు అసలు విషయంలోకి ఆడియన్స్ ను లాగడానికి చాలా సమయం తీసుకున్నాడు. బాలరాజు ఫ్రెండ్స్ తో కలిసి వేసే ఆకతాయి వేషాలు, బాలరాజు - మహాలక్ష్మి చిన్ననాటి ఎపిసోడ్, బాలరాజును ఒక వైపున మహాలక్ష్మి .. మరో వైపున సిరి ప్రేమించే సన్నివేశాలతోనే చాలావరకూ కాలయాపన చేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ను ప్లాన్ చేసిన తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ తరువాత ఏం జరుగుతుందా అనే ఆసక్తి పెరుగుతుంది. 

సెకండాఫ్ లో సునీల్ ఎంట్రీ ఇస్తాడు. అతనిరాకతో కథ మరింత ఊపందుకుంటుందని అంతా అనుకుంటారు. కానీ సునీల్ వచ్చిన తరువాత కూడా బాలరాజు వైపు నుంచి కామెడీ నడిపించడానికి ట్రై చేయడం మైనస్ గా అనిపిస్తుంది. ఇక వడ్డీల వరలక్ష్మి ఇంటికి బాలరాజు బ్యాచ్ దొంగతనానికి వెళ్లే ఎపిసోడ్ అంతా కూడా అనవసరమైనదనే చెప్పాలి. కథ స్పీడ్ అందుకుంటున్న సమయంలో ఈ ఎపిసోడ్ దెబ్బకొట్టేస్తుంది. ఈ ఎపిసోడ్ లో మెల్లకళ్ల పనిమనిషిగా రోహిణి నటన ఆకట్టుకుంటుంది. 

ఇక ప్రెసిడెంట్ ఎన్నికలలో బాలరాజు టీమ్ ప్రచారానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు సరదాగా అనిపిస్తాయి. అక్కడక్కడా కామెడీని .. ఎమోషన్స్ ను టచ్ చేస్తూనే కథ ముందుకు వెళుతూ ఉంటుంది. క్లైమాక్స్ కూడా కరెక్టుగానే అనిపిస్తుంది. హీరోగా సోహెల్ లుక్ .. కామెడీతో కూడిన యాక్టింగ్ బాగానే అనిపిస్తాయి. గత చిత్రాలకంటే ఈ సినిమాలో డాన్స్ బాగా చేశాడు. ఇంద్రజ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. మిగతా వాళ్లంతా ఓకే. 

సంగీత దర్శకుడిగా భీమ్స్ అందించిన బాణీలు ఫరవాలేదు. నేపథ్య సంగీతం కూడా ఓకే. గోకుల్ భారతి ఫొటోగ్రఫీ ఫరవాలేదు. గ్రామీణ వాతావరణాన్ని అందంగా ఆవిష్కరిస్తే, కథ మరింతగా కనెక్ట్ అయ్యేది. ఎడిటింగ్ విషయానికి వస్తే .. కాలేజ్ లో బాలరాజు బ్యాచ్ ను లెక్చరర్ అవమానించడం .. బస్సులో కామెడీ .. సునీల్ ట్రాక్ .. వడ్డీల వనజాక్షి ఎపిసోడ్ ట్రిమ్ చేస్తే బాగుండేదేమో. కథపై మరింత కసరత్తు జరిగితే మరింత బెటర్ అవుట్ పుట్ వచ్చేదేమో అనిపిస్తుంది.

Trailer

More Movie Reviews