'ది ఫ్యామిలీ స్టార్' - మూవీ రివ్యూ!

Movie Name: The Family Star

Release Date: 2024-04-05
Cast: Vijay Devarakonda, Mrunal Thakur, Jagapathi Babu, Vennela Kishore, Vasuki,
Director: Parashu Ram
Producer: Dil Raju
Music: Gopi Sundar
Banner: Sri Venkateshwara Creations
Rating: 2.75 out of 5
  • విజయ్ దేవరకొండ హీరోగా 'ది ఫ్యామిలీ స్టార్'
  • పాత కథనే పదును పెట్టిన పరశురామ్    
  • హీరో - హీరోయిన్ పాత్రలపైనే ఫోకస్ చేసిన దర్శకుడు
  • మెప్పించిన బాణీలు .. నేపథ్య సంగీతం 
  •  'గీత గోవిందం' స్థాయిలో కనిపించని ఎంటర్టైన్ మెంట్   


విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన 'ది ఫ్యామిలీ స్టార్' ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా  భారీ విజయాన్ని సాధించింది. అందువలన 'ది ఫ్యామిలీ స్టార్' పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా మృణాల్ ఠాకూర్ నటించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో నడిచే ఈ కంటెంట్, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూద్దాం. 

గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఓ మధ్యతరగతి కుర్రాడు. ఇద్దరు అన్నయ్యలు .. వదినలు .. ఆ రెండు జంటలకు ఐదుగురు పిల్లలు .. ఒక బామ్మ .. ఇది అతని ఫ్యామిలీ. ఇద్దరు అన్నయ్యలు ఇంకా సెటిల్ కాకపోవడంతో, ఒంటిచేత్తో గోవర్ధన్ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. తన ఒక్కడి జీతంతోనే ఇల్లు నడవాలి కనుక .. ఖర్చులను కట్టడి చేస్తూ, పొదుపు ఎక్కువగా పాటిస్తూ ఉంటాడు. అందువలన చూసేవాళ్లకి అతను ఓ పిసినారిలా కనిపిస్తూ ఉంటాడు.

గోవర్ధన్ కి తెలియకుండా పెంట్ హౌస్ ను అతని బామ్మ (రోహిణి హట్టంగడి) ఇందూ (మృణాళ్ ఠాకూర్) అనే యువతికి రెంట్ కి ఇస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీలో ఇందూ చదువుతూ ఉంటుంది. గోవర్ధన్ - ఇందూ మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. గోవర్ధన్ కి తన కుటుంబం పట్ల గల ప్రేమాభిమానాలను ఇందూ అర్థం చేసుకుంటుంది. అతని ఫ్యామిలీ ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడటానికి సాయం చేస్తుంది. దాంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని గోవర్ధన్ నిర్ణయించుకుంటాడు. 

అయితే మధ్య తరగతి కుటుంబాలు ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తాయి అనే విషయంపై థీసీస్ రాయడానికి ఆమె తన ఇంట్లో అద్దెకి దిగిందనే విషయం గోవర్ధన్ కి తెలుస్తుంది. తన ఇంట్లో ఉంటూ .. తన ఫ్యామిలీని దగ్గరగా పరిశీలిస్తూ .. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను గురించి ఆమె రాయడం గోవర్ధన్ కి కోపాన్ని తెప్పిస్తుంది. అందుకోసం తనని ఆమె ప్రేమించినట్టుగా నటించడం పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తూ చేయిచేసుకుంటాడు. ఆమె కళ్ల ముందే ఎదిగి తానేమిటో చూపించాలని నిర్ణయించుకుంటాడు. 

అనుకున్నది సాధించడం కోసం, పెద్ద పేరున్న సంస్థలో ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. ఆ సంస్థ యజమాని (జగపతిబాబు)ను రిక్వెస్ట్ కోటి రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటాడు. తాను అనుకున్నవన్నీ కొనేసుకుంటూ .. ఆమెకి ఆ వీడియోస్ పోస్ట్ చేస్తూ తన రేంజ్ చూపిస్తూ ఉంటాడు. అలా కోటి రూపాయలు ఖర్చు చేసేసిన తరువాత, ఆ సంస్థ యజమాని కూతురే ఇందూ అనీ, తాను పనిచేస్తున్న సంస్థకి ఆమెనే సీఈఓ అని గోవర్ధన్ కి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది మిగతా కథ. 

పరశురామ్ ఈ సినిమాకి దర్శకుడు .. కథను ఆయన తయారు చేసుకున్నాడు. కథ విషయానికి వస్తే, అందరిలోకి చిన్నవాడు .. కుటుంబ భారం మొత్తం మోస్తున్నవాడు .. ఖర్చులు తగ్గించుకుంటూ వెళ్లే మధ్యతరగతి మానవుడు వంటి అంశాలతో పాత కథలను గుర్తుచేస్తూనే ఉంటుంది. పోనీ పరశురామ్  పాత కథలో కొత్త పాయింట్ ఏమైనా చెప్పగలిగాడా? అంటే చెప్పగలిగాడనే అనాలి. అయితే ఆ విషయాన్ని ఆశించినస్థాయిలో ఆసక్తికరంగా .. అనుకున్నంత బలంగా చెప్పలేకపోయాడని కూడా చెప్పుకోవాలి. జీవితంలో తొందరపడి ఎవరినీ అపార్థం చేసుకోకూడదు .. వ్యక్తితో పాటు వారి వెనుక ఉన్న ఫ్యామిలీని ప్రేమించేదే నిజమైన ప్రేమ అనే ఒక కొత్త పాయింటును పరశురామ్ టచ్ చేశాడు. 

ఫస్టాఫ్ లో హీరో - హీరోయిన్ మధ్య పరిచయం .. ప్రేమకి సంబంధించిన సన్నివేశాలు సరదాగానే సాగుతాయి. ఫ్యామిలీతో సహా రవిబాబు కంపెనీకి వెళ్లి అతని గ్యాంగ్ ను కొట్టేసే సీన్ ఆకట్టుకుంటుంది. అలాగే ఫస్టాఫ్ లో వచ్చే 'ఏమిటిది చెప్పీచెప్పనట్టుగా' అనే సాంగ్ మనసుకి పట్టుకుంటుంది. ఈ సినిమాలో హిట్ సాంగ్ ఇదేనని చెప్పచ్చు. ఇక సెకండాఫ్ దగ్గరికి వచ్చేసరికి అమెరికాలో హీరో - హీరోయిన్ మధ్య అలకలు - గొడవలకి సంబంధించిన సీన్స్ కూడా సరదాగానే అనిపిస్తాయి. సెకండాఫ్ లో వచ్చే 'మధురం కదా' అనే పాట కూడా మధురంగానే అనిపిస్తుంది. 

ఇంటర్వెల్ బ్యాంగ్ .. సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా సంతృప్తి కరంగానే అనిపిస్తాయి. అయితే జగపతిబాబు .. వెన్నెల కిశోర్ .. దివ్యాన్ష కౌశిక్ లాంటి ఆర్టిస్టుల పాత్రలను సరిగ్గా డిజైన్ చేసుకోకపోవడం వలన నామమాత్రంగా అనిపిస్తాయి. ఇక మిగతా పాత్రలకు  కూడా ఎలాంటి ప్రాధాన్యత కనిపించదు. చివర్లో తప్ప ఎక్కడా ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ కాలేదు. గోవర్ధన్ అన్నయ్య ఎందుకు తాగుడికి బానిస అయ్యాడనే విషయం వెనుక, మనసును మెలిపెట్టే ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉండనుందనే బిల్డప్ ఇచ్చారు. తీరా ఆ ఫ్లాష్ బ్యాక్ చూస్తే అందులో విషయమే లేదు. 


--- విజయ్ దేవరకొండ లుక్ బాగుంది .. ఆయన తన పాత్రను పెర్ఫెక్ట్ గా పోషించాడు. ఇక మృణాల్ ఠాకూర్ నటనకి కూడా వంకబెట్టలేం. నిర్మాణ విలువలు బాగున్నాయి. గోపీసుందర్ బాణీలలో రెండు బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా కథను సపోర్టు చేస్తూ వెళుతుంది. మోహనన్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ ఓకే. అక్కడక్కడా పొడి పొడి సన్నివేశాలు ఉన్నప్పటికీ, చాలావరకూ సరదా సన్నివేశాలతోనే ఈ కథ నడుస్తుంది. హీరో - హీరోయిన్ పాత్రలపై మాత్రమే ఫోకస్ చేయడం .. వాటితో సమానంగా మిగతా ప్రధానమైన పాత్రలను అల్లుకోకపోవడం ఒక లోపంగా కనిపిస్తుంది. అలాగే కథనంలో వేగం లోపించడం కూడా కాస్త నిరాశపరుస్తుంది. లేదంటే ఈ సినిమా మరో 'గీత గోవిందం' అయ్యుండేదేమో.  

Trailer

More Movie Reviews