'తలైమై సేయలగం' (జీ 5) వెబ్ సిరీస్ రివ్యూ!

Movie Name: Thalaimai Seyalagam

Release Date: 2024-05-17
Cast: Kishore, Sriya Reddy, Bharath, Remya Nambeesan, Adithya Menon, Kani Kusruti
Director: Vasanthabalan
Producer: Radhika Sarathkumar
Music: Ghibran
Banner: Radaan Media works
Rating: 3.50 out of 5
  • రాడాన్ నుంచి వచ్చిన భారీ వెబ్ సిరీస్ 
  • పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
  • ఆసక్తికరంగా అనిపించే కథనం  
  • హైలైట్ గా నిలిచే సస్పెన్స్ .. ఎమోషన్స్
  • ఫ్యామిలీతో చూడదగిన ఇంట్రెస్టింగ్ సిరీస్



రాడాన్ బ్యానర్ పై రాధిక శరత్ కుమార్ గతంలో చాలా టీవీ సీరియల్స్ ను నిర్మించారు. ఈ బ్యానర్ పై వచ్చిన సీరియల్స్ చాలావరకూ విశేషమైన ఆదరణ పొందాయి. అలాంటి ఈ బ్యానర్ నుంచి 'తలైమై సేయలగం' అనే వెబ్ సిరీస్ ను వదిలారు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సిరీస్, ఈ నెల 17వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ కిశోర్ .. శ్రేయా రెడ్డి .. రమ్య నంబిసన్ ..  భరత్ .. ఆదిత్య మీనన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 
 
అరుణాచలం (కన్నడ కిశోర్) తమిళనాడు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతుంటాడు. భార్య .. ఇద్దరు ఆడపిల్లలు ఇది అతని కుటుంబం. ఇద్దరు కూతుళ్లకు వివాహం అవుతుంది. పెద్ద కూతురు అముదవల్లి (రమ్య నంబిసన్) తండ్రితో పాటు రాజకీయాలలో చురుకైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. చిన్న కూతురు ఆనందవల్లి ఇంటి పట్టునే ఉంటుంది. అయితే ఆమె భర్త హరిహరన్ మాత్రం ఇల్లరికం వచ్చేసి, రాజకీయాలలో తిరుగుతూ ఉంటాడు. ఇక అరుణాచలం మేనకోడలు సప్తమి ఆ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటూ ఉంటుంది.

అరుణాచలంతో కొట్రవై ( శ్రేయా రెడ్డి) సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటుంది. వాళ్ల బంధాన్ని గురించిన ఒక సందేహం మాత్రం చాలామందిలో ఉంటుంది. కొట్రవై కూతురు 'మాయ' ఈ వార్తలు విని ఉండటం వలన, ఆమె తన తల్లిని అపార్థం చేసుకుంటుంది. ఆమెకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక సమయం చూసి అరుణాచలాన్ని దెబ్బతీయడానికి అతని శత్రువులైన కృష్ణమూర్తి - రంగరాజన్ ఎదురుచూస్తూ ఉంటారు.

ఆ శత్రువుల చేతికి ఒక ఆయుధం దొరుకుతుంది. 17 ఏళ్ల క్రితం అరుణాచలంపై ఉన్న అవినీతి కేసులో అతణ్ణి జైలుకు పంపించడానికి ఆ ఇద్దరూ శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఫైనల్ హియరింగ్ సమయం దగ్గర పడటంతో అందరిలో ఉత్కంఠ పెరుగుతుంది. ముఖ్యమంత్రి సీటు కోసం ఆయన పెద్ద కూతురు .. చిన్న అల్లుడు పోటీ పడుతుంటారు. కొట్రవై తమకి అడ్డుపడుతుందేమోనని భయపడుతూ ఉంటారు.   

ఇక దుర్గ (ఖుస్రుతి) తరచూ కొట్రవైని కలుస్తూ ఉంటుంది. షిప్ యార్డ్ లో ఉన్న తన కంటెయినర్ ను బయటికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి ద్వారా హెల్ప్ చేయమని కోరుతూ ఉంటుంది. అందుకు కొట్రవై అంగీకరించకపోవడంతో కోపంతో రగిలిపోతుంది. దుర్గ గతం గురించి తెలుసుకున్న డీఎస్పీ మణికందన్ ( భరత్) .. సీబీఐ ఆఫీసర్ నవాజ్ (ఆదిత్య మీనన్) ఆమె కోసం  గాలిస్తూ ఉంటారు. 

అరుణాచలంపై ఉన్న అవినీతి కేసు ఏమిటి? కుట్రవై గతం ఎలాంటిది? దుర్గ ఎవరు? ఆమెతో కొట్రవైకి  ఉన్న సంబంధం ఎలాంటిది? అధికారం కోసం అరుణాచలం పెద్ద కూతురు ఏం చేస్తుంది? ఆయన చిన్నల్లుడు ఎలాంటి ప్లాన్ వేస్తాడు? దుర్గ కోసం గాలిస్తున్న పోలీస్ అధికారులకు ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? అనేది మిగతా కథ.

ఈ కథను దర్శకుడు వసంతబాలన్ - జయ మోహన్ కలిసి తయారుచేశారు. ప్రధానమైన ఆరు పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ప్రజలకు మంచి చేయాలనే ఒక ముఖ్యమంత్రి .. అతణ్ణి ఆ సీటు మీద నుంచి దింపేయాలనే దురుద్దేశంతో ఉన్న శత్రువులు .. ముఖ్యమంత్రి జైలుకు వెళితే తాము ఆ సీట్లో కూర్చోవాలని ప్రయత్నించే కుటుంబ సభ్యులు .. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుటుంబసభ్యులు మోసాలకు పాల్పడటం వలన కుంగిపోయే ఒక ముఖ్యమంత్రి. ఇలా ఈ కథ అనేక కోణాల్లో .. అనేక మలుపులతో నడుస్తూ వెళుతుంది. 

కథను ఎత్తుకున్న తీరుతోనే దర్శకుడు సగం మార్కులు కొట్టేశాడు. మొదటి సీన్ లో మొదలైన సస్పెన్స్ ను చివరివరకూ కొనసాగించాడు. అలా స్క్రీన్ ప్లే ఈ సిరీస్ కి హైలైట్ గా నిలిచింది. ప్రధానమైన పాత్రలను రిజిస్టర్ చేసిన తీరు .. ఆ పాత్రలను చివరివరకూ నడిపించిన విధానం మెప్పిస్తుంది. అనవసరమైన సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. చివర్లోని ట్విస్టులు ఈ సిరీస్ బలాన్ని మరింత పెంచుతాయి. తెరవెనుక జరిగే రాజకీయాలు .. రంగులు మార్చే మనుషులను వాస్తవానికి దగ్గరగా చూపించారు.   

ఆర్టిస్టులంతా చాలా సహజంగా తమ పాత్రలను పండించారు. నిర్మాణ పరమైన విషయాలలో రాడాన్ వారు రాజీపడలేదనే చెప్పాలి. రవిశంకరన్ ఫొటోగ్రఫీ .. గిబ్రాన్ నేపథ్య సంగీతం .. రవికుమార్ ఎడిటింగ్ ఈ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారని చెప్పాలి. రాజకీయాలకి సంబంధించిన సన్నివేశాలను, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ముడిపెట్టడం వలన ఆడియన్స్ అసహనానికి లోనయ్యే అవకాశం ఉండదు. 

 డబ్బు కొంతమంది శత్రువులను తయారు చేస్తుంది. పదవి మరికొంతమంది శత్రువులను తయారుచేస్తుంది. డబ్బు - పదవి కలిసినప్పుడు అసలు శత్రువులు ఎవరనేది కనుక్కోలేకుండా చేస్తుంది. ఈ అంశానే సహజత్వానికి చాలా దగ్గరగా చెబుతూ ఈ సిరీస్ సాగుతుంది. ఆరంభంలో కనిపించే రక్తపాతాన్ని ఫార్వార్డ్ చేసేస్తే, ఆ తరువాత ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్ నే ఇది. 

Trailer

More Movie Reviews