'కలియుగం పట్టణంలో' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Movie Name: Kaliyugam Pattanamlo

Release Date: 2024-05-24
Cast: Vishwa Karthikeya, Ayushi, ChitraShukla, Rupalakshmi, Devi Prasad
Director: Ramakanth Reddy
Producer: Maheshwar Reddy
Music: Ajay Arasada
Banner: Raamaa Creations
Rating: 2.00 out of 5
  • క్రైమ్ థ్రిల్లర్ గా 'కలియుగం పట్టణంలో'
  • ఆకట్టుకోని కథాకథనాలు 
  • ఎక్కువైపోయిన ట్విస్టులు .. నాటకీయత
  • నటన పరంగా సహజత్వం లోపించిన కంటెంట్

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ జోనర్ హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్లాట్ ఫామ్ పైకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది .. ఆ సినిమా పేరే 'కలియుగం పట్టణంలో. విశ్వకార్తికేయ ఈ సినిమాతోనే హీరోగా పరిచయమయ్యాడు. తొలి సినిమాలోనే ఆయన హీరోగానే కాదు, విలన్ గా కూడా చేయడం విశేషం. రీసెంటుగా ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
 
ఈ కథ అంతా కూడా నంద్యాల నేపథ్యంలో జరుగుతుంది. మోహన్ (దేవిప్రసాద్) దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒకరు విజయ్ (విశ్వకార్తికేయ) .. ఒకరు సాగర్ (విశ్వకార్తికేయ). ఇద్దరూ కూడా కవలలు. పదేళ్ల వయసులోనే సాగర్ పెంపుడు జంతువులను చంపుతూ మానసికపరమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. దాంతో అతణ్ణి మానసిక వైద్యశాలలో చేర్పిస్తారు. విజయ్ బుద్ధిమంతుడు .. మంచివాడు కావడంతో తమ దగ్గరే చదివిస్తారు. 

మోహన్ భార్య కల్పన (రూపాలక్ష్మి) సాగర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మోహన్ మాత్రం అతని విషయంలో అయిష్టంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. కాలక్రమంలో విజయ్ పెద్దవాడవుతాడు .. ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతూ ఉంటాడు. తన అన్నయ్య మామూలు మనిషి కాగానే, అతణ్ణి ఇంటికి తీసుకొచ్చి తల్లికి ఆనందాన్ని కలిగించాలని అతనికి ఉంటుంది. ఇదే సమయంలో కాలేజ్ లో అతణ్ణి శ్రావణి (ఆయుషి పటేల్) ప్రేమిస్తూ ఉంటుంది.

శ్రావణి తల్లిదండ్రులు ఇంటిపట్టునే ఉంటూ ఉంటారు. ఆమె తండ్రి నడవలేని స్థితిలో ఉంటాడు. శ్రావణి ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా కొంతమంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, సైలెంట్ గా వారిని చంపేస్తూ ఉంటుంది. దాంతో నంద్యాల వాసులంతా ఈ హత్యలు ఎవరు చేస్తున్నదీ అర్థంకాక అయోమయంలో పడతారు. భయం గుప్పెట్లో బ్రతుకుతుంటారు. ఈ మర్డర్ మిస్టరీలను ఛేదించడానికి శ్రావణి పిన్ని రంగంలోకి దిగుతుంది. 

శ్రావణి పిన్ని (చిత్రా శుక్లా) ఓ పోలీస్ ఆఫీసర్. గతంలో ఎన్నో కీలకమైన కేసులను పరిష్కరించిన సామర్థ్యం ఆమెకి ఉంటుంది. ఆమె తన బాస్ ప్రభాకర్ (అనీష్ కురువిల్ల) ఆదేశం మేరకు నంద్యాల చేరుకుంటుంది. ఇక అదే సమయంలో తన అన్నయ్యను కలుసుకోవడానికి విజయ్ మానసిక వైద్యశాలకు వెళతాడు. అయితే అక్కడి నుంచి సాగర్ బయటికి వస్తాడు. లోపల ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు.

మానసిక వైద్యశాల నుంచి బయటికి వచ్చిన సాగర్ .. విజయ్ మాదిరిగా నటిస్తూ తిరుగుతుంటాడు. విజయ్ లవర్ శ్రావణికి కూడా అతను దగ్గరవుతూ ఉంటాడు. విజయ్ స్థానంలో ఉన్నది సాగర్ అనే విషయాన్ని తల్లి గమనిస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? మానసిక వైద్యశాల నుంచి బయటపడిన సాగర్ ఏం చేస్తాడు? శ్రావణి ఎందుకు వరుస హత్యలు చేస్తూ వెళుతోంది? విజయ్ స్థానంలోకి సాగర్ ఎలా వస్తాడు? అనేది మిగతా కథ.

రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఒక వైపున సైకో ఆగడాలు .. గంజాయి మాఫియా .. వరుస హత్యలు .. ఇలా మూడు వైపులుగా ఈ సినిమా నడుస్తుంది. వరుస హత్యలు తెరపై జరిగిపోతూ ఉంటాయి .. ఎందుకో తెలియదు. సైకో హఠాత్తుగా తన లక్షణాన్ని పక్కన పెట్టేసి గంజాయి బిజినెస్ చేస్తుంటాడు. అతని ఉద్దేశం ఏమిటో అర్థం కాదు. తమ ఇంట్లో ఉన్నది విజయ్ నా? సాగర్ నా? అనే విషయాన్ని  చాలారోజుల వరకూ పేరెంట్స్ కనిపెట్టలేకపోవడం ఆశ్చర్యం. 

విశ్వకార్తికేయ నటన ఓ మాదిరిగా ఉంది. నటనలో అతను నేర్చుకోవలసిన అంశాలు చాలానే ఉన్నాయి. ఆయుషి నటన కూడా అంతంత మాత్రంగానే ఉంది. నటన సంగతి అలా ఉంచితే ఇద్దరికీ మ్యాచ్ కాలేదు. చిత్ర శుక్లా తన పాత్రకి న్యాయం చేసింది. దర్శకుడు కొత్త నటీనటుల నుంచి సరైన రియాక్షన్స్ ను రాబట్టుకోలేదు. అందువలన అక్కడక్కడా చాలా కృతకంగా అనిపిస్తూ ఉంటుంది. దాంతో ప్రేక్షకుడు కథలో నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటాడు. 

ప్రీ క్లైమాక్స్ లోను .. క్లైమాక్స్ లోను కథ అనేక మలుపులు తిరుగుతుంది. నాటకీయ పరిణామాలు ఎక్కువై పోయాయనిపిస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కూడా ఓ మాదిరిగానే అనిపిస్తాయి. ఈ సినిమాలో ప్రధానమైన రెండు పాత్రలు ఆడియన్స్ ను పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. తెరపై పాత్రలు హడావిడి చేస్తున్నా, ప్రేక్షకుడు తాపీగా కూర్చుంటాడు. ఈ సినిమాకి సీక్వెల్ ఉందంటూ హింట్ ఇవ్వడం కోసం మెరుపు అనుకోవాలి. 

Trailer

More Movie Reviews