'ధూమం' (ఆహా) మూవీ రివ్యూ!

Movie Name: Dhoomam

Release Date: 2024-07-11
Cast: Fahadh Faasil ,Aparna Balamurali ,Roshan Mathew ,Vineeth,Achyuth Kumar
Director: Pawan Kumar
Producer: Vijay Kiragandur
Music: Poornachandra Tejaswi
Banner: Hombale Films
Rating: 2.75 out of 5
  • ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రగా 'ధూమం'
  • మలయాళంలో క్రితం ఏడాది విడుదల 
  • ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతున్న సినిమా
  • హైలైట్ గా నిలిచే స్క్రీన్ ప్లే
  • సీక్వెల్ కోసం వెయిట్ చేయవలసిందే  

మలయాళంలో ఫహాద్ ఫాజిల్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు డిఫరెంట్ గా ఉంటాయి. అందువలన ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆసక్తిని చూపించేవారు ఎక్కువగానే ఉంటారు. అలాంటి ఆయన నుంచి వచ్చిన సినిమానే 'ధూమం'. క్రితం ఏడాది అక్కడి థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ జరుపుకుంటోంది. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

అవినాశ్ (ఫహాద్ ఫాజిల్) ఒక సిగరెట్ కంపెనీలో సేల్స్ డిపార్టుమెంట్ హెడ్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని బాస్ సిద్ధార్థ్ ( రోషన్ మాథ్యూ ). తన సంస్థకి అవినాశ్ తెలివి తేటలు బాగా ఉపయోగపడతాయని భావించిన ఆయన, అతణ్ణి ఎంతో అభిమానంతో చూసుకుంటూ ఉంటాడు. బిజినెస్ కి సంబంధించిన ప్రతి డీల్ కూడా అవినాశ్ సమక్షంలోనే చేస్తుంటాడు. ఇది సిద్ధార్థ్ బాబాయ్ ప్రవీణ్ (వినీత్)కి నచ్చదు. ఆ సంస్థలో అతను కూడా ఒక భాగస్వామి కావడంతో, అవినాశ్ గుర్రుగా ఉంటాడు.

ఇక ఆ ప్రాంతానికి చెందిన మినిస్టర్ (జోయ్ మాథ్యూ), సిగరెట్ బిజినెస్ విషయంలో తనతో చేతులు కలపమని సిద్ధార్థ్ ను కోరతాడు. చిన్న పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే ఆ డీల్ పట్ల అవినాశ్ అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. సిద్ధార్థ్ తో తమ డీల్ కి అవినాశ్ అడ్డుగా ఉన్నాడని మినిస్టర్ గ్యాంగ్ భావిస్తుంది. తన జాబ్ విషయంలో అసంతృప్తికి లోనైన అవినాశ్, రిజైన్ చేయాలని భావిస్తాడు. అదే విషయాన్ని ఒక రోజున సిద్ధార్థ్ తో చెబుతాడు .. అయితే అందుకతను ఒప్పుకోడు.    

ఓ రోజున అవినాశ్ తన భార్య దియా ( అపర్ణ బాలమురళి)తో కలిసి కార్లో వెళుతూ ఉండగా, ఊహించని విధంగా వాళ్లపై దాడి జరుగుతుంది. ఇద్దరూ స్పృహలోకి వచ్చేసరికి ఊరికి దూరంగా ఒక నిర్జన ప్రదేశంలో ఉంటారు. అప్పుడు అవినాశ్ కి ఒక కాల్ వస్తుంది. దియా బాడీలో మైక్రో బాంబ్ ను ఫిక్స్ చేయడం జరిగిందనీ, తాను చెప్పినట్టుగా చేయకపోతే ఆ బాంబ్ ను పేల్చేస్తామని ఆ వ్యక్తి బెదిరిస్తాడు. దాంతో అవినాశ్ కంగారుపడిపోతాడు. 
    
 అతను చెప్పినట్టుగా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అవినాశ్ చెబుతాడు. కోటి రూపాయలు డబ్బు తీసుకెళ్లి తాను చెప్పిన రెండు ఇళ్లలో సమానంగా ఇవ్వమని ఆ వ్యక్తి చెప్పడంతో అలాగే చేస్తాడు. దియాతో పాటు వెళ్లి ఆ రెండు ఇళ్లలో డబ్బులు పెట్టేసి, అక్కడి నుంచి అవినాశ్ బయల్దేరతాడు. మార్గమధ్యలో ఒక హోటల్లో అతను టీవీలో లైవ్ న్యూస్ చూస్తాడు. ప్రణీత్ ను ఎవరో దారుణంగా చంపారనీ, గాయాల పాలైన సిద్ధార్థ్ హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకుని షాక్ అవుతాడు. 

జరిగిన సంఘటనకి అవినాశ్ కారకుడని భావించిన పోలీస్ ఆఫీసర్ ప్రకాశ్ (అచ్యుత్ కుమార్) తన టీమ్ తో గాలించడం మొదలుపెడతాడు. ఇక మరో వైపున అవినాశ్ కోసం మినిస్టర్ మనుషులు కూడా వెతకడం మొదలుపెడతారు. ఇంతకీ అవినాశ్ దంపతులపై దాడి చేసింది ఎవరు? దియా బాడీలో మైక్రో బాంబ్ సెట్ చేసింది ఎవరు? ప్రవీణ్ ను ఎవరు హత్య చేస్తారు?  సిద్ధార్థ్ ను అంతం చేయాలనుకోవడానికి కారణం ఏమిటి? ఈ సమస్య నుంచి బయటపడటానికి అవినాశ్ దంపతులు ఏం చేస్తారు? అనేది కథ. 

 సిగరెట్ బిజినెస్ నేపథ్యంలో నడిచే కథ కావడం వలన, ఈ సినిమాకి 'ధూమం' అనే టైటిల్ పెట్టారు. కథ మొదలైన దగ్గర నుంచి తరువాత ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూనే ఉంటుంది. ఒక వైపున అవినాశ్ .. ఒక వైపున సిద్ధార్థ్ .. మరో వైపున మినిస్టర్ .. ఇంకో వైపున అజ్ఞాతవ్యక్తి .. ఈ నాలుగు పాత్రల మధ్య కథ నడుస్తూ ఉంటుంది. స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను అలా కూర్చోబెడుతుంది. 

దియా బాడీలో బాంబు ను ఫిక్స్ చేయడం .. సిగరెట్ స్మోకింగ్ కీ .. ఆ బాంబ్ బ్లాస్టింగ్ కి లింక్ పెట్టిన తీరు .. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దియా లోపలి బాంబు పేలకుండా ఉండాలంటే ఆమె అలా సిగరెట్స్ తాగుతూనే ఉండాలనేలా డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. మొదటి నుంచి చివరి వరకూ సీరియస్ గా సాగినప్పటికీ బోర్ కొట్టదు. జరుగుతున్న సంఘటనలకు గల కారణం రొటీన్ గానే అనిపించినప్పటికీ, ట్రీట్మెంట్ కుతూహలాన్ని రేకెత్తిస్తూ ఉంటుంది.  

తెరపై ఎక్కువగా కనిపించే పాత్రలు ఫహాద్ ఫాజిల్ .. రోషన్ మాథ్యూ .. అపర్ణ బాలమురళివే. కథ అంతా కూడా ఈ పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ ముగ్గురూ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. ప్రీత జయరామ్ ఫొటోగ్రఫీ .. పూర్ణచంద్ర తేజస్వి నేపథ్య సంగీతం .. సురేశ్ ఆర్ముగం ఎడిటింగ్ ఈ కథకు మంచి సపోర్టుగా నిలిచాయి. క్లైమాక్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. సీక్వెల్ ఉందనే హింట్ ఇస్తూ ఈ సినిమాను ముగించారు. థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చొచ్చు.  


Trailer

More Movie Reviews