'ది గోట్ లైఫ్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

Movie Name: The Goat Life

Release Date: 2024-07-22
Cast: Prithviraj Sukumaran, Amala Paul , Gokul, Jimmy Jean-Louis, Shobha Mohan
Director: Blessy
Producer: Blessy
Music: A R Rahman
Banner: Visual Romance
Rating: 2.50 out of 5
  • పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్'
  • ఎడారి నేపథ్యంలో నడిచే కథ 
  • హీరో లుక్ .. నటన సినిమాకి హైలైట్ 
  • వినోదం పాళ్లు లోపించిన కంటెంట్ 
  • సహనాన్ని పరీక్షించే సాగతీత సన్నివేశాలు 

మలయాళంలో ఈ ఏడాది మొదటి మూడు నెలలలో వచ్చిన హిట్ చిత్రాలలో 'ది గోట్ లైఫ్' ఒకటి. పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, బ్లెస్సీ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది మార్చి 28వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్లకు వచ్చింది. అదే రోజున తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 19వ తేదీన 'నెట్ ఫ్లిక్స్' లోకి అడుగుపెట్టింది. ఈ రోజు నుంచే తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. 

నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు. తల్లి .. భార్య సైనూ (అమలా పాల్) .. ఇది అతని కుటుంబం. సైనూ గర్బవతి .. అందువలన ఆమెను అతను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. నజీబ్ పెద్దగా చదువుకోలేదు .. అందువలన తాను ఇక్కడ ఏ పని చేసినా ఇల్లు గడవదని తెలుసు. తన ఊళ్లో ఉన్న కొంతమంది కుర్రాళ్లు 'దుబాయ్' వెళ్లి బాగా సంపాదిస్తున్నారని తెలిసి, తాను కూడా వెళ్లాలనుకుంటాడు. 

ఈ విషయంలో తల్లినీ .. భార్యను ఒప్పించి, తన దగ్గరున్న డబ్బు మొత్తాన్ని ఒక ఏజెంటుకు సమర్పించుకుంటాడు. తన కుటుంబానికి బాగా తెలిసిన హాకిమ్ (గోకుల్) ను వెంటబెట్టుకుని బయల్దేరతాడు. ఆ ఏజెంట్ దొంగ వీసాపై దుబాయ్ చేర్చి, అక్కడి నుంచి పట్టించుకోవడం మానేస్తాడు. దాంతో నజీబ్ - గోకుల్ ఇద్దరూ అక్కడి ఎయిర్ పోర్టులో బిక్కుబిక్కుమంటూ నిలబడిపోతారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కాఫీల్ (తాలిబ్) వారిని అక్కడి నుంచి ఒక ఎడారి ప్రాంతానికి తీసుకుని వెళతాడు. 
   
ఒక కాఫీల్ నజీబ్ ను తనతో పాటు తీసుకుని వెళితే, మరో కాఫీల్ గోకుల్ ను తీసుకుని వెళతాడు. అలా విడిపోవడం వాళ్లిద్దరినీ చాలా బాధపెడుతుంది. ఎడారిలో ఏ మూలన కూడా కాస్తంత నీడ ఉండదు. ఆ ఎండలో గొర్రెలు ..  ఒంటెలు మేపాలి. నిప్పులపై కాల్చిన రొట్టె .. మంచినీళ్లు తప్ప వాళ్లకి మరో ఆహారం లేదు. తాము అక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యమనే విషయం నజీబ్ కి అర్థమైపోతుంది. అందువలన అతను మౌనంగా తన పని చేసుకుంటూ వెళుతుంటాడు.

ఇంటికి సంబంధించిన ఆలోచనలు అతనిని చుట్టుముడుతూ ఉంటాయి. భార్యతో గడిపిన అపురూపమైన క్షణాలు అతనికి కాస్త బలాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంటాయి. తన భార్య .. తన తల్లి తన కోసం ఎదురుచూస్తుంటారనే ఆలోచన అతని మనసును భారం చేస్తూ ఉంటుంది. అతనితో పాటు  పనిచేసే వ్యక్తి చనిపోతే, అతని శరీరాన్ని రాబందులకు వేయడం చూసి భయపడిపోతాడు. 

ఇక అక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలనే ఒక నిర్ణయానికి వస్తాడు. అదే సమయంలో అతనికి గోకుల్ తారసపడతాడు. తాను పనిచేసే చోట ఇబ్రహీమ్ (జిమ్మీ లీన్) అనే ఒక ఆఫ్రికన్ ఉన్నాడనీ, అతనికి ఆ ఎడారి నుంచి బయటపడటం తెలుసనీ గోకుల్ అంటాడు. ఒక పెళ్లి పనిపై కాఫీల్స్ అంతా కలిసి వేరే ప్రాంతానికి వెళుతున్నారనీ, వాళ్లు తిరిగి వచ్చేలోగా తాము రోడ్డు మార్గానికి చేరుకుంటే చాలని అంటాడు. అలాగే ఆ ముగ్గురూ కలిసి అక్కడి నుంచి బయల్దేరతారు. వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఇండియాకి చేరుకున్నారా లేదా? అనేది మిగతా కథ.  

మలయాళంలోని 'ఆడుజీవితం' అనే నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. యథార్థ సంఘటనల ఆధారంగా రాసిన నవల ఇది. గ్రామాల్లో పెద్దగా చదువుకోని కుర్రాళ్లు .. దుబాయ్ వెళ్లడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతూ ఉంటారు. ఒకరు వెళ్లారని మరొకరు ఆ బాట పడుతూ ఉంటారు. అక్కడ కొన్నేళ్లు పనిచేస్తే, తిరిగి వచ్చిన తరువాత లైఫ్ హ్యాపీగా సెటిలైపోతుందని కొంతమంది చెప్పే మాటలు వాళ్లపై ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. 

అలా అక్కడికి వెళ్లి నానా ఇబ్బందులు పడుతున్న వాళ్లు .. తమని కాపాడమని వేడుకుంటున్న వారు చాలామందినే కనిపిస్తారు. అలాంటి వారి కన్నీటి కథ ఆధారంగా రూపొందిన సినిమా ఇది. అక్కడి నుంచి తప్పించుకోవడం కుదరదు. అందుకు కారణం భాష తెలియక పోవడం .. దేశాలు దాటిరాగల తెలివితేటలు లేకపోవడం .. ఎడారిలో ఏ వైపు వెళ్లాలో తెలియకపోవడం .. కనుచూపు మేరలో ఉన్నా, వెతికే వాళ్లకి కనబడిపోవడం కారణంగా తప్పించుకోవడం కష్టం. 

వీటన్నిటినీ కూడా దర్శకుడు తెరపై బాగా చూపించాడు. పరిమిత సంఖ్యలో పాత్రలతోనే తాను చెప్పదలచుకున్న కథను చెప్పాడు. హీరోకి ఎదురయ్యే అనుభవాలు .. అవస్థలు, అతను తప్పించుకునే తీరు .. ఇవన్నీ కూడా దర్శకుడు బాగానే చూపించాడు. హీరో - హీరోయిన్ .. లవ్ .. రొమాన్స్ .. ఎంటర్టైన్ మెంట్ కి సంబంధించిన కథ కొంతవరకూ నడిపి, ఆ తరువాత కథను ఎడారికి షిఫ్ట్ చేస్తే బాగుండేదేమో.

లేదంటే అతని కోసం ఎదురుచూస్తున్నట్టుగా హీరోయిన్ ను అప్పుడప్పుడు తెరపైకి తీసుకుని రావొచ్చు, ఆమె వైపు నుంచి కొంత ఫీల్ ను వర్కౌట్ చేయవచ్చు. కానీ కథలో 90 శాతం ఎడారిలోనే నడిపించారు. చుట్టూ ఎడారిని చూస్తూ అక్కడ హీరో ఎంత ఇబ్బంది పడుతుంటాడో .. ఇక్కడ ప్రేక్షకులు కూడా అంతే ఇబ్బంది పడుతుంటారు. ఎడారిలో రెండు .. మూడు పాత్రల మధ్యనే కథ నడుస్తుంది. హీరో తప్పించుకునే సీన్స్ ను కూడా అలా సాగదీస్తూ వెళ్లారు. అలా సాగదీయడం వలన నిడివి పెరిగిపోయింది. ఫలితంగా ప్రేక్షకులు కొంత అసహనానికి లోనవుతారు. 
   

 పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ .. నటనకి వంకబెట్టవలసిన పనిలేదు. ఏఆర్ రెహ్మాన్ నేపథ్య  సంగీతం కూడా కథను అలా ముందుకు నడిపిస్తుంది. ఫొటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే, ఎడారిలో పడే అవస్థలు .. ఎడారిలో ప్రయాణం తాలూకు సీన్స్ ను ట్రిమ్ చేస్తే బాగుండేది. ఇక 'ఆడుజీవితం' అనే నవల ఆధారంగా రూపొందించడం వరకూ ఓకే. ఆ నవల పేరును సినిమా టైటిల్ కి జోడించడంతో చాలామందికి టైటిల్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఒక సినిమాకి కావలసిన వినోదపరమైన అంశాలు లేకపోవడం, సాగతీత సన్నివేశాలతో నిడివి పెంచడం ఈ సినిమాకి మైనస్ అయిందని చెప్పచ్చు. 


Trailer

More Movie Reviews