'మనోరథంగల్' (జీ 5) వెబ్ సిరీస్ రివ్యూ!

Movie Name: Manorathangal

Release Date: 2024-08-15
Cast: Mohanlal, Mammootty, Fahaf Fassil, Biju Menon, Aparna Balamurali, Parvathi Thiruvothu
Director: Priyadarshan
Producer: -
Music: Bijibal
Banner: Yoodlee Films - Jumping Tomato
Rating: 2.50 out of 5
  • వాసుదేవ నాయర్  కథల సమాహారం 
  • 9 మంది స్టార్స్ నటించిన 9 కథలు 
  • ఒక్కో ఎపిసోడ్ ను రూపొందించిన ఒక్కో దర్శకుడు
  • పుస్తకం చదువుతున్నట్టుగానే అనిపించే కథలు 
  • అసహనాన్ని కలిగించేలా నిదానంగా సాగే కథనం 
  • లొకేషన్స్ .. ఫొటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ  
           

ఒకప్పుడు నవలల ఆధారంగా సినిమాలను తెరకెక్కించారు. అలాంటి సినిమాలలో సహజంగానే కథా బలం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. ఓటీటీలో వెబ్ సిరీస్ ల జోరు మొదలయ్యాక ఆంథాలజీ కథలకు డిమాండ్ పెరిగింది. ప్రముఖ రచయితలు రాసిన కథా సంకలనాలు ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. అలా మలయాళ రచయిత ఎమ్. టి. వాసుదేవ నాయర్ రాసిన కథలను 'మనోరథంగల్' పేరుతో రూపొందించారు.

అయితే ఈ వెబ్ సిరీస్ కి ఒక ప్రత్యేకత ఉంది.  ఏ కథకు ఆ కథగా కనిపించే ఈ సిరీస్ లో, మలయాళ స్టార్స్  ప్రధానమైన పాత్రలను పోషించారు. మోహన్ లాల్ .. మమ్ముట్టి .. ఫహద్ ఫాజిల్ .. బిజూ మీనన్ .. మధుబాల .. పార్వతి తిరువోతు .. అపర్ణ బాలమురళి తదితరులు నటించారు. 8 మంది దర్శకులు రూపొందించిన 9 కథలు .. 9 ఎపిసోడ్స్ గా జీ 5లో ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. 

'ఒలవుమ్ తీరవుమ్' అనే ఈ (బ్లాక్ అండ్ వైట్) కథలో బాపుట్టి (మోహన్ లాల్) ప్రధానమైన పాత్రధారి. అతను తన స్నేహితుడి చెల్లెలైన నబీషా ప్రేమలో పడతాడు. అయితే ఆమెను వశపరచుకోవడానికి కుంజాలి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతను డబ్బున్నవాడు కావడం వలన, బాపుట్టిని దూరం పెట్టాలని నబీషా  తల్లి నిర్ణయించుకుంటుంది. పర్యవసానంగా ఏం జరుగుతుందనేది ఈ కథ.

'కడుగన్నావా' అనే కథ, జర్నలిస్ట్ వేణు (మమ్ముట్టి) ప్రధాన పాత్రగా నడుస్తుంది. ఒక ముఖ్యమైన సమావేశం కోసం శ్రీలంక వెళ్లిన వేణు, లీల అనే ఒక యువతి కోసం అన్వేషించడం మొదలుపెడతాడు. లీల ఎవరు? ఆమెతో అతనికున్న అనుబంధం ఏమిటి? అనేది ఈ కథ.

'కజ్ చా' అనే కథ విషయానికి వస్తే, సుధ (పార్వతి తిరువోతు) వ్యక్తిత్వం ఉన్న యువతి. సంగీతం అంటే ఆమెకి ప్రాణం. తన భర్త తన అభిరుచిని ఎంతమాత్రం గుర్తించకపోవడం .. అబాధ్యతగా ప్రవర్తించడాన్ని తట్టుకోలేకపోతుంది. దాంతో ఆమె తన పుట్టింటికి చేరుకుంటుంది. అక్కడ ఆమెకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయనేది ఈ కథ చెబుతుంది.

'శిలాలిఖితం' అనే కథలో గోపి ( బిజూ మీనన్) ప్రధానమైన పాత్రలో కనిపిస్తాడు. ఒక వైపున బాగా చదువుకున్న వారిలోను .. మరో వైపున ఆచార సంప్రదాయాలను పట్టుకుని వ్రేళ్లాడే వారిలోను మానవత్వమనేది మరుగున పడిపోతోందని ఈ కథ చెబుతుంది. ఎవరిని చూసి ఎవరు నేర్చుకోవాలి? అనే అంశాన్ని ఆలోచింపజేసే కథ ఇది. 

'విల్పన' అనే కథ .. అనుభూతి కరవైన జీవితం మనిషిని ఒక వస్తువుగా మార్చేస్తుందని చెబుతుంది. మధుబాల ప్రధాన పాత్రగా నడిచే కథ ఇది. ఇక ఫహాద్ ఫాజిల్ - నదియా ప్రధానమైన పాత్రలుగా రూపొందిన 'షెర్లాక్', బ్రతకడం కోసం విదేశాలకు వెళ్లినవారి పరిస్థితికి అద్దం పడుతుంది. అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రగా సాగే 'కాదలక్కాట్టు' అనుబంధానికి .. ఆకర్షణకి నిర్వచనంగా నిలుస్తుంది.

సిద్ధికీ పాత్ర ప్రధానంగా నడిచే 'అభ్యం తీడి వీండుమ్' అనే కథ, ప్రకృతితో అనుబంధం ఎలా ఏర్పడుతుందనేది చెబుతుంది. నెడుముడి వేణు ముఖ్య పాత్రగా 'స్వర్గం తురక్కున్న సమయం' అనే కథ, తన అవసాన దశలో పిల్లలు దగ్గర లేరని బాధపడే ఒక తండ్రి ఆవేదనను ఆవిష్కరిస్తుంది.

ఈ కథలన్నీ కూడా అనుబంధం .. అనుభూతి అనే అంశాల చుట్టూ తిరుగుతాయి. భార్యాభర్తలు .. ప్రేమికులు .. తల్లిదండ్రులు .. అక్కాతమ్ముళ్లు .. ప్రకృతి ఆరాధన .. ఇలా మనిషి జీవితాన్ని పెనవేసుకుపోయే అంశాలను అందంగా ఆవిష్కరించారు. సున్నితమైన ఎమోషన్స్ తో ఈ కథలు నడుస్తాయి. ఈ కథలలో ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా నటనలో తామేంటన్నది నిరూపించుకున్నవారే. అలాగే దర్శకులు కూడా తమ ప్రతిభతో పురస్కారాలు అందుకున్నవారే.

అయితే ఈ కథల్లోని మూలాన్ని తీసుకుని, ఆసక్తికరంగా ఆవిష్కరించడం జరగలేదు. ఒక కథను చదువుతుంటే పాఠకుడి కళ్లముందు అందుకు సంబంధించిన దృశ్యాలు కదులుతూ ఉంటే ఎలా ఉంటుందో .. అలాగే అనిపిస్తుంది. అలాంటి కథలను తెరపైకి తీసుకుని వచ్చినప్పుడు అవి చాలా నిదానంగా .. నింపాదిగా సాగుతూ ఉన్నట్టుగా అనిపిస్తాయి. అంత సమయాన్ని కేటాయించలేని ఈ జనరేషన్ కి కాస్త అసహనాన్ని కూడా కలిగిస్తాయి. ముగింపును ప్రేక్షకుల ఊహకు వదిలేయడం అందుకు మరో కారణం.  

ఈ కథలన్నీ కేరళ ప్రాంతం నేపథ్యంలోనే నడుస్తాయి. అందువలన కొన్ని కథల్లోని లొకేషన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. లొకేషన్స్ కోసమైనా ఈ కథలను ఫాలో కావొచ్చునేమో అనిపించేలా ఉన్నాయి. కమల్ వ్యాఖ్యానంతో పలకరించే ఈ కథలను, ప్రేక్షకుల ముందుంచడానికి దర్శకులు .. సంగీత దర్శకులు .. కెమెరామెన్లు తమవంతు కృషి చేశారు. అయితే సామాన్య ప్రేక్షకులను రంజింపజేసే స్థాయిలో ఆవిష్కరించకపోవడమే లోపంగా అనిపిస్తుంది. అనుభూతి ప్రధానమైన కథలను ఇష్టపడే కొందరికి నచ్చవచ్చునేమో కూడా. 

Trailer

More Movie Reviews