'శేఖర్ హోమ్' (జియో సినిమా) వెబ్ సిరీస్ రివ్యూ!

Movie Name: Shekhar Home

Release Date: 2024-08-14
Cast: Kay Kay Menon, Ranvir Shorey, Rasika Dugal ,Kirti Kulhari, Dibyendu Bhattacharya
Director: Srijit Mukherjee
Producer: Sameer Gogate
Music: -
Banner: BBC Studios Productions
Rating: 2.75 out of 5
  • 6 ఎపిసోడ్స్ గా వచ్చిన 'శేఖర్ హోమ్'
  • క్రైమ్ డ్రామా నేపథ్యంలో సాగే సిరీస్
  • 1990లలో నడిచే కథ   
  • నిదానంగా సాగే కథనం
  • ఫరవాలేదనిపించే కంటెంట్ 

డిటెక్టివ్ డ్రామా సిరీస్ అనగానే చాలామందికి 'షెర్లాక్ హోమ్స్' గుర్తొస్తుంది. దానిని స్ఫూర్తిగా తీసుకుని హిందీలో రూపొందించిన వెబ్ సిరీస్ 'శేఖర్ హోమ్'. కేకే మీనన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ కి, రోషన్ సిప్పీ - శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. 6 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ఈ నెల 14వ తేదీ నుంచి 'జియో సినిమా'లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ డ్రామా జోనర్లో నడిచే ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ 1990లలో .. పశ్చిమ బెంగాల్ లోని 'లోన్ పూర్' నేపథ్యంలో మొదలవుతుంది. డిటెక్టివ్ శేఖర్ ( కేకే మీనన్) ఒక ఇంట్లో అద్దెకి ఉంటాడు. చాలా సాధారణమైన వ్యక్తిలా కనిపిస్తూ, క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు. శేఖర్ ను వెతుక్కుంటూ వచ్చిన జయ్ వ్రత్ (రణ్ వీర్ షోరే) అతనితో కలిసి పనిచేయడం మొదలుపెడతాడు. నేరస్థులను పసిగట్టే విషయంలో .. కేసులను పరిష్కరించే విషయంలో శేఖర్ స్పీడ్ ను జయ్ వ్రత్ అందుకోలేకపోతుంటాడు.

స్థానికంగా జరుగుతున్న వరుస హత్యలను గురించి పరిశోధించిన శేఖర్, హంతకులను చట్టానికి అప్పగిస్తాడు. ఆ తరువాత అతను జయ్ వ్రత్ తో కలిసి 'బీహార్' వెళతాడు. అక్కడ అధికారంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల రహస్యాలను వీడియో రూపంలో ఒక అజ్ఞాత వ్యక్తి దగ్గర ఉంటాయి. తాను కోరినంత డబ్బు ఇవ్వాలంటూ ఆ వ్యక్తి  వాళ్లకి హెచ్చరికలు పంపుతూ ఉంటాడు. ఆ గండం నుంచి గట్టెక్కించమని వారు కోరడంతో శేఖర్ రంగంలోకి దిగుతాడు. 

ఈ సమయంలోనే శేఖర్ కి 'ఇరాబతి' (రసిక దుగల్)తో పరిచయమవుతుంది. ఆమె అతణ్ణి వెంటబెట్టుకుని ఒక గ్రామానికి తీసుకుని వెళుతుంది. అది ఓ జమీందారు కుటుంబం. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు కొందరు హత్యకి గురవుతారు. అదంతా దెయ్యం పనే అని అంతా చెప్పుకుంటూ ఉంటారు. ఆ కుటుంబానికి చెందిన మిగతావారితో శేఖర్ మాట్లాడతాడు. ఆ ఇంట్లో వారిని మాత్రమే కాకుండా ఆ గ్రామస్థులను సైతం భయపెడుతున్న ఆ అదృశ్యశక్తి ఎవరనేది తెలుసుకోవడానికి సిద్ధమవుతాడు. 

అప్పుడు అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఆ సందర్భంలో అతను ఎలా స్పందిస్తాడు? ఈ కేసును ఎలా పరిష్కరిస్తాడు? శేఖర్ చివరికేసు ఏమిటి? అది అతనికి ఎలాంటి సవాళ్లు విసురుతుంది? ఆయన వాటిని ఎలా ఛేదిస్తాడు? అనేవి ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తాయి. 
               
డిటెక్టివ్ గా శేఖర్ ముందుకు ఒక్కో కేసు రావడం .. తనదైన స్టైల్లో ఆయన వాటిని పరిష్కరించుకుంటూ వెళ్లడమే ఈ కథలో కనిపిస్తుంది. ప్రధానమైన పాత్రలు మినహా, ప్రతి కేసుకు సంబంధించిన ఇతర ఆర్టిస్టులు మారిపోతూ ఉంటారు. అందువలన ఈ సిరీస్ మొత్తంలో చాలా పాత్రలు తెరపైకి వచ్చి వెళుతూ ఉంటాయి. ప్రధానమైన పాత్రలు మాత్రమే ఒక కేసులో నుంచి మరో కేసులోకి ప్రయాణం చేస్తూ ఉంటాయి. 

1990లలో జరిగే కథ కావడం వలన పెద్దగా  సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలంలో  శేఖర్ తన సమయస్ఫూర్తితో కేసులను పరిష్కరించాడు? అనే విషయంపైనే కథ నడుస్తుంది. కేసులు .. పరిశోధన .. వ్యూహాలతోనే ఈ సిరీస్ నడుస్తుంది. యాక్షన్ దృశ్యాల జోలికి వెళ్లలేదు. ఒక కథ తరువాత ఒక కథగా ఈ సిరీస్ పరిగెడుతుంది. అయితే ఈ కథలన్నీ కూడా కాస్త రొటీన్ గానే అనిపిస్తాయి. ఎక్కడా కొత్తగా అనిపించే అంశాలేవీ లేవు. 

చివరి ఎపిసోడ్ లో మాత్రం ఊహించని ఒక ట్విస్ట్ ఉంటుంది. అయితే కాస్త సాగదీసినట్టుగా అనిపించే ఎపిసోడ్ కూడా ఇదే. 90లలో నడిచే కథ కాబట్టి  అదే వాతావరణంలో ఉంటుంది .. ఆనాటి స్క్రీన్ ప్లేతోనే నడుస్తుంది. ప్రధానమైన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు జీవం పోశారు. అయితే హీరో పరిష్కరించే కేసులు .. వాటి తాలూకు నేపథ్యాలు గతంలో మనం చూసినవే. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనిపించే ఉత్కంఠభరితమైన అంశాలేవీ లేవు. 

నేపథ్య సంగీతం .. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ ఇవన్నీ కూడా 1990ల కాలానికి చెందిన కథతో ముడిపడే సాగుతాయి. ఈ కాలంలో క్రైమ్ డ్రామాలు ఒకరకమైన హడావిడి చేస్తూ దూసుకు వెళుతున్నాయి. కానీ చాలా సాదాసీదాగా .. సహజత్వానికి దగ్గరగా 'శేఖర్ హోమ్' కనిపిస్తుంది. ఆ కాలంనాటి కథ .. అప్పటి ట్రీట్మెంట్ అనుకుని సరిపెట్టుకుంటే, ఫరవాలేదనిపిస్తుందంతే. 
 

Trailer

More Movie Reviews