'సి టి ఆర్ ఎల్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

Movie Name: CTRL

Release Date: 2024-10-04
Cast: Ananya Panday, Vihaan Samat, Devika Vatsa, Kamakshi Bhat , Suchita Trived
Director: Vikramaditya Motwane
Producer: Nikhil Dwivedi - Arya Menon
Music: Sneha Khanwalkar
Banner: Saffron Magicworks
Rating: 2.75 out of 5
  • స్క్రీన్ లైఫ్ థ్రిల్లర్ జోనర్లో  'సి టి ఆర్ ఎల్'
  • ప్రధానమైన పాత్రలో అనన్య పాండే 
  • 'A I' టెక్నాలజీ నేపథ్యంలో సాగే కథ 
  • ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ 
            

ఇంతవరకూ థ్రిల్లర్ జోనర్లో క్రైమ్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ .. హారర్ థ్రిల్లర్ లు ఓటీటీ ప్రేక్షకులను ఎక్కువగా పలకరిస్తూ వచ్చాయి. అందుకు భిన్నంగా ఈ సారి ప్రేక్షకుల ముందుకు 'స్క్రీన్ లైఫ్ థ్రిల్లర్' వచ్చింది. ఈ జోనర్లో నిర్మితమైన సినిమానే  'సి టి ఆర్ ఎల్'. అనన్య పాండే ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 4వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోను అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం. 

'నెల్లా' (అనన్య పాండే) జో (విహాన్ సమత్) ఇద్దరూ కూడా సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యెన్సర్లు. ఇద్దరి మధ్య స్నేహం .. ప్రేమగా మారుతుంది. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళుతుంటారు .. ఆ మూమెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. అలా వారి ప్రేమయాత్ర హ్యాపీగా సాగిపోతూ ఉండగా, అనుకోని ఒక సంఘటన జరుగుతుంది. వేరే యువతితో 'జో' చనువుగా ఉండటం నెల్లా కంటపడుతుంది. దాంతో ఆమె అతనిపై కోపంతో మండిపడుతుంది. 

అప్పటి నుంచి నెల్లా అతనికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే .. ఆ ఒంటరితనంలోనే ఆమె 'మంత్ర AI 'ను ఆశ్రయిస్తుంది. AIలో తనకి నచ్చిన ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకుని, స్క్రీన్ పై కనిపించే ఆ రూపంతో తనకి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఓ రోజున ఆమె ఇంటికి 'జో' వస్తాడు. ఆమెతో ఓ విషయాన్ని గురించి అత్యవసరంగా మాట్లాడటానికి వచ్చానని చెబుతాడు. అయితే అతను చెప్పేది వినిపించుకోకుండా ఆమె గెంటించేస్తుంది. 

అంతేకాదు .. గతంలో తాను 'జో'తో గడిపిన హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించిన పిక్స్ లో నుంచి అతని రూపాన్ని పూర్తిగా డిలీట్ చేస్తుంది. తనని కలవడానికి తన ఇంటికి వచ్చిన రోజు నుంచి 'జో' కనిపించకుండా పోయాడని తెలిసి 'నెల్లా' ఆలోచనలో పడుతుంది. అతనిని కాంటాక్ట్ చేయడానికి తనకున్న అన్ని మార్గాలను ఉపయోగిస్తుంది. 'జో' చనిపోయాడనే విషయం ఆ సమయంలోనే ఆమెకి తెలుస్తుంది.

'జో' ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? అనే విషయం తెలుసుకోవాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఆ దిశగా తన ప్రయత్నాలు మొదలుపెడుతుంది. అప్పుడు ఆమెకి  'జో' చేసిన ఒక సెల్ఫీ వీడియో దొరుకుతుంది. 'మంత్ర' అనే యాప్ గురించీ .. ఆ యాప్ ఉద్దేశాన్ని గురించి 'జో' చెబుతాడు. కొన్ని రకాల యాప్స్ వలన, ఆయా వ్యక్తులకు సంబంధించిన పూర్తి సమాచారం ఎలా ఆ యాప్స్ గుప్పెట్లోకి వెళుతున్నాయనేది వివరిస్తాడు. 

'మంత్ర' యాప్ కి సంబంధించిన రహస్యాన్ని తాను .. తన మిత్రుడు కలిసి కనుక్కున్నామనీ, దాంతో ఆ యాప్ టీమ్ తన స్నేహితుడిని హత్య చేసిందనీ, తనని కూడా చంపేయవచ్చని అంటాడు. యాప్స్ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలనీ, ఇలాంటి యాప్స్ వలన ప్రపంచమే పెద్ద ప్రమాదంలో పడనుందని హెచ్చరిస్తాడు. అప్పుడు నెల్లా ఏం చేస్తుంది? పర్యవసానంగా ఏం జరుగుతుంది? అనేది కథ.

 ఇది లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. కామెడీతో కూడిన రెగ్యులర్ కథ కాదు. ఒక ప్రేమజంట జీవితాన్ని ఒక యాప్ ఎలా ప్రభావితం చేసిందనే దిశగా ఈ కథ నడుస్తుంది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యెన్సర్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వాళ్లు నిరంతరం సోషల్ మీడియాలో ఉండటానికి ఎంతగా ఆరాటపడతారు. కొత్తగా వచ్చిన 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' వాళ్ల జీవితాలను ఎలా అల్లకల్లోలం చేస్తుంది? అనే విషయాన్ని వివరించడానికి వచ్చిన కాన్సెప్ట్ ఇది. 

అత్యంత కీలకమైన సమాచారం .. కోట్లాదిమంది జీవితాలకు సంబంధించిన ఒక ఆధారాన్ని AI క్షణాల్లో ఎలా మార్చేస్తుందనేది చూస్తే, ఆలోచనలో పడని ప్రేక్షకుడు ఉండడు. భవిష్యత్తు తరాలు  ఎలాంటి ప్రమాదంలో పడనున్నాయనడానికి ఈ ఒక్క సంఘటన అద్దం పడుతుంది. స్మార్టు ఫోన్లు వదలకుండా పట్టుకుని, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జనరేషన్ సంబంధించిన కంటెంట్ ఇది. ఇతర ప్రేక్షకులు చూసినా వారికి అర్థం కాదు.

రెండు ప్రధానమైన పాత్రలను తీసుకుని, వాటి చుట్టూ ఈ కథను నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. AI టెక్నాలజీకి సంబంధించిన విషయాలను స్క్రీన్ పై ఆవిష్కరించిన తీరు బాగుంది. సాధ్యమైనంత వరకూ అర్థమయ్యేలా చెప్పడానికే దర్శకుడు ప్రయత్నించాడు. అయితే క్లైమాక్స్ కొంతమందికి అసంతృప్తిని కలిగించే అవకాశం కనిపిస్తుంది. 

ఇది పూర్తిగా అనన్య పాండే సినిమా . ఆమె నటనకి వంక బెట్టవలసిన పనిలేదు. నిడివి తక్కువగానే ఉన్న ఈ కంటెంట్ ఈ జనరేషన్ పిల్లలకు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ప్రతీక్ షా ఫొటోగ్రఫీ .. స్నేహా ఖన్వాల్కర్ నేపథ్య సంగీతం .. జహాన్ ఎడిటింగ్ ఓకే. వినోదపరమైన అంశాలకు దూరంగా నడిచే సినిమా ఇది. కొత్తగా వచ్చే యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకుంటూ, తమకి తెలియకుండానే తమ జీవితాలను వాటి చేతిలో పెడుతున్న యూత్ కి ఈ సినిమా కనెక్ట్ కావొచ్చు.  

Trailer

More Movie Reviews