'శబరి' (ఆహా) మూవీ రివ్యూ!

Movie Name: Sabari

Release Date: 2024-10-18
Cast: Varalakshmi Sharath Kumar, Mime Gopi, Shashank, Ganesh Venkatraman, Madhu Nandan
Director: Anil Katz
Producer: Mahendra Nath
Music: Gopi Sundar
Banner: Maha Movies
Rating: 2.50 out of 5
  • యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన 'శబరి'
  • మే 3వ తేదీన విడుదలైన సినిమా 
  • నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • వరలక్ష్మి శరత్ కుమార్ నటన హైలైట్ 
  • లాజిక్స్ కి దూరంగా నడిచిన కంటెంట్

తెలుగు .. తమిళ భాషల్లో వరలక్ష్మి శరత్ కుమార్ కి మంచి క్రేజ్ ఉంది. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలలోను మెప్పిస్తూ వెళుతున్న ఆమె, నాయిక ప్రధానమైన కథలతోను ప్రేక్షకులను అలరిస్తోంది. అలాంటి సినిమాల వైపు నుంచి ఆమె డిమాండ్ పెరిగింది. అలా ఆమె చేసిన సినిమా పేరే 'శబరి'. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది మే 3వ తేదీన థియేటర్లకు వచ్చింది. నిన్నటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.

సంజన (వరలక్ష్మీ శరత్ కుమార్) పదేళ్ల వయసులోనే తల్లిని కోల్పోతుంది. సవతి తల్లి కారణంగా ఇబ్బందులు పడుతుంది. యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆమె, అరవింద్ (గణేశ్ వెంకట్రామన్)తో ప్రేమలో పడుతుంది. అతణ్ణి పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కంటుంది .. ఆ పాప పేరే రియా.  చైర్మన్ కూతురుతో అరవింద్ చనువుగా ఉండటం చూసిన సంజన, రియాను తీసుకుని ముంబై నుంచి విశాఖ వచ్చేస్తుంది. అక్కడ తన స్నేహితురాలి ఇంట్లో ఉంటూ ఉద్యోగం సంపాదించుకుంటుంది. 

సంజన తన కూతురు రియాను స్కూల్ లో చేరుస్తుంది. అలాగే అద్దె తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఊరికి దూరంగా ఉన్న ఇల్లు తీసుకుంటుంది. ఇక తన ఎదుగుదలకు తన భార్యాబిడ్డల ప్రస్తావన అడ్డు తగులుతుందని అరవింద్ భావిస్తాడు. సంజన కేరక్టర్ మంచిది కాదని నిరూపించి, తనపై పడిన మచ్చను చెరిపేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో అతను వైజాగ్ వస్తాడు. అప్పుడే అతను ఆమెకి ఒక నిజం చెబుతాడు. 

సంజన పెంచుతున్న కూతురు ఆమెకి పుట్టలేదనీ, ఆమె జన్మనిచ్చిన పాప చనిపోయిందని అరవింద్ చెబుతాడు. సూర్య అనే వ్యక్తి కూతురైన 'రియా'ను హాస్పిటల్ సిబ్బంది నుంచి కొన్నానని అంటాడు. ఆ మాటలకు సంజన షాక్ అవుతుంది. హాస్పిటల్ కి వెళ్లి గతంలో జరిగిన సంఘటన గురించి ఆరా తీస్తుంది. అరవింద్ చెప్పింది నిజమేనని తెలిసి కన్నీళ్ల పర్యంతమవుతుంది. 

హాస్పిటల్ సిబ్బంది వలన అప్పుడే సంజనకు మరో విషయం తెలుస్తుంది. 'రియా' తండ్రి సూర్య ఒక క్రిమినల్ అనీ, అతను తన పాపను దొంగతనంగా తీసుకెళ్లిన వారి గురించి వెదుకుతున్నాడని చెబుతారు. తన పాపను తనకి దూరం చేసిన నర్స్ నీ .. వార్డు బాయ్ ను సూర్య చంపేసి, తన సొంత ఇంట్లో దహనం చేశాడని అంటారు. సూర్య ఆ ఇద్దరినీ దహనం చేసిన ఇంట్లోనే తాను ఉంటున్నాననే విషయం అప్పుడు సంజనకు తెలుస్తుంది. 

అప్పుడు సంజన ఏం చేస్తుంది? తాను అనుకున్నది సాధించడం కోసం అరవింద్ ఎలాంటి ప్లాన్ వేస్తాడు? తన కూతురిని దక్కించుకోవడం కోసం సూర్య ఏ నిర్ణయం తీసుకుంటాడు? అనేది మిగతా కథ. 

బాల్యంలోనే తల్లి ప్రేమకు దూరమైన సంజన, వివాహం తరువాత పురిటిలోనే బిడ్డను కోల్పోతుంది. బంధానికి అర్థం తెలియని భర్త నుంచి దూరంగా ఉంటూ, తాను పెంచుకుంటున్న అమ్మాయి కోసం తన ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అలాంటి ఒక లైన్ తో దర్శకుడు అనిల్ కాట్జ్ తయారు చేసుకున్న కథ ఇది. తాను ఏదైతే అనుకున్నాడో దానిని తెరపైకి తీసుకుని రావడంలో దర్శకుడు కొంతవరకూ సక్సెస్ అయ్యాడు.

వరలక్ష్మి .. మైమ్ గోపి పాత్రలను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది. కానీ గణేశ్ వెంకట్రామన్ పాత్ర విషయంలో దర్శకుడు క్లారిటీ మిస్సయ్యాడు అనిపిస్తుంది. ఆ పాత్ర వైపు నుంచి లాజిక్ కూడా మిస్సయ్యింది. ఎమోషన్స్ .. సెంటిమెంట్స్ .. ఫ్యామిలీ బాండింగ్ కి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వని అరవింద్, తన కూతురు కాని అమ్మాయిని తన ఇంటికి తీసుకుని వెళ్లాలనుకోవడం విచిత్రంగా అనిపిస్తుంది. తాను మంచివాడినని నిరూపించుకోవాలంటే తన భార్య మంచిది కాదని నిరూపించాలనుకోవడం కరెక్టుగా అనిపించదు.

ఇక తనపై సూర్య ఎప్పుడైనా ఎటాక్ చేయవచ్చనే భయం సంజనకు ఉంటుంది. తన కూతురిని అతను కిడ్నాప్ చేస్తాడేమోననే అభద్రత .. ఆందోళన ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అద్దె తక్కువని ఊరి బయట ఇల్లు తీసుకోవడం సహజత్వానికి దూరంగా అనిపిస్తుంది. ఇలా అక్కడక్కడా లాజిక్ కి దూరంగా వెళ్లిన సందర్భాలు అలా ఉంచితే, మిగతా కంటెంట్ ఫరవాలేదు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ ను ఇష్టపడేవారికి ఫరవాలేదనిపించవచ్చు. 

సినిమా మొత్తంలో వరలక్ష్మి శరత్ కుమార్ .. మైమ్ గోపి యాక్షన్ హైలైట్ గా నిలుస్తాయి. రాహుల్ శ్రీవాత్సవ్ ఫొటోగ్రఫీ బాగుంది. నైట్ ఎఫెక్ట్ సీన్లు .. ఫారెస్టు లొకేషన్స్ ఆకట్టుకుంటాయి. గోపీసుందర్ నేపథ్య సంగీతం సందర్భానికి తగిన మూడ్ లో ముందుకు తీసుకుని వెళుతుంది. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ ఓకే. అరవింద్ పాత్ర విషయంలో కసరత్తు చేసి ఉంటే, సహజత్వానికి దూరంగా వెళ్లకుండా ఉంటే, మరో మంచి కంటెంట్ గా ఇది మార్కులు కొట్టేసి ఉండేది. కథలో లాజిక్కుల సంగతి అలా ఉంచితే, 'శబరి' అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది అర్థం కాదు. అదేదో సినిమాలో డైలాగ్ మాదిరిగా 'వర్డ్ బాగుందని వాడేశారేమో'. 

Trailer

More Movie Reviews