'రైడ్' (ఆహా) మూవీ రివ్యూ!

Movie Name: Raid

Release Date: 2024-10-19
Cast: Vikram Prabhu, Sri Divya, Ananthika, Velu Prabhakaran, Soundararaja
Director: Karthi
Producer: Kanishk - Manikannan
Music: Sam C S
Banner: M Studios
Rating: 2.00 out of 5
  • విక్రమ్ ప్రభు హీరోగా రూపొందిన 'రైడ్' 
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • యాక్షన్ పై మాత్రమే దృష్టిపెట్టిన డైరెక్టర్ 
  • బలహీనమైన స్క్రీన్ ప్లే 
  • రొటీన్ కి కాస్త దూరంగా కూడా వెళ్లలేకపోయిన కంటెంట్    

కోలీవుడ్లో విక్రమ్ ప్రభు తన ఇమేజ్ కి తగిన కథలను .. పాత్రలను ఎంపిక చేసుకుంటూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'రైడ్'. కన్నడలో శివరాజ్ కుమార్ చేసిన 'తగారు' సినిమాకి ఇది రీమేక్. కార్తీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రితం ఏడాది నవంబర్లో థియేటర్లకు వచ్చింది. ఈ నెల 19 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.

 ఏసీపీ ప్రభాకరన్ (విక్రమ్ ప్రభు)కి భయమనేది తెలియదు. ప్రమాదానికి ఎదురెళ్లడం ఆయన హాబీ. వృత్తిపట్ల ఆయనకి గల అంకితభావాన్ని చూసిన ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్, తన కూతురు 'వెన్బా' ను అతనికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఆయన పట్ల గల గౌరవభావంతో ప్రభాకరన్ అందుకు అంగీకరిస్తాడు. ఆయన జీవితంలోకి అర్థాంగిగా అడుగు పెట్టనున్నందుకు ఆమె సంతోషపడుతుంది.

ప్రభాకరన్ పోలీస్ స్టేషన్ లో అమ్మాయిల మిస్సింగ్ కేసులు .. హత్యలు .. ఆత్మహత్యలకి సంబంధించిన కేసులు వరుసగా నమోదవుతూ ఉంటాయి. దాంతో వాటిపై ప్రభాకరన్ ప్రత్యేకమైన దృష్టి పెడతాడు. ఈ నేరాలకు కారకులు ఎవరనే దిశగా విచారణ చేస్తూ వెళతాడు. అప్పుడు ఆయనకి డాలీ .. చిట్టూ పేర్లు వినిపిస్తాయి.

డాలీ - చిట్టూ ఇద్దరూ స్నేహితులు. జైల్లో జరిగిన వారి పరిచయం, బయటికి వచ్చిన తరువాత బలపడుతూ వెళుతుంది. ఇద్దరూ కలిసి నేరాలు చేస్తూ వెళుతుంటారు. ఆ ఇద్దరికీ డాన్ అంకుల్ ఆశ్రయమిస్తాడు. దాంతో వాళ్లు మరింత చెలరేగిపోతారు. ఒక రిసార్టును నడుపుతూ .. అక్కడ వాటర్ గేమ్స్ ను నిర్వహిస్తూ, అక్కడికి వచ్చిన అమ్మాయిల వీడియోలను రహస్యంగా చిత్రీకరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. 

వాళ్ల ఉచ్చులో పడిన అమ్మాయిలు పరువుకు భయపడి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఈ విషయంలో డాలీ తమ్ముడు కాక్రోచ్ ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తూ ఉంటాడు. డాలీకి తన తమ్ముడు కాక్రోచ్ అంటే చాలా ఇష్టం. ఇక డాలీ పగబట్టాడంటే, అతని బారి నుంచి తప్పించుకోవడం ఎవరివలనా కాదు. ఎవరినైనా సరే అతను కిరాతకంగా చంపుతూ ఉంటాడు. అందువలన అతనిని అందరూ సైకో అని పిలుస్తుంటారు. 

అలాంటి డాలీ తమ్ముడిని ప్రభాకరన్ ఎన్ కౌంటర్ చేస్తాడు. తన తమ్ముడిని చంపిన ప్రభాకరన్ అంతు చూడవలసిందే అనే కసితో డాలీ రంగంలోకి దిగుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? మాఫియా ముఠా నుంచి ఎలాంటి సవాళ్లను ప్రభాకరన్ ఎదుర్కొంటాడు? అనేది మిగతా కథ.

'రైడ్' .. ఇది ఒక పోలీస్ కథ. కొంతమంది రాజకీయ నాయకులకు .. రౌడీలకు దగ్గర సంబంధాలు ఉంటూ ఉంటాయి. రాజకీయ నాయకుల అండతోనే చిన్నచిన్న రౌడీలు డాన్ లుగా ఎదుగుతూ ఉంటారు. తమ స్వార్థం కోసం రౌడీలను వాడుకునే రాజకీయ నాయకులు, వాళ్లను కాపాడుకోవడం కోసం పోలీస్ అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఆ గుప్పెట్లోకి రాని అధికారులను అటు రాజకీయనాయకులు .. ఇటు రౌడీలు టార్గెట్ చేస్తూ ఉంటారు. 

ఇది కూడా అలాంటి ఒక కథనే. సాధారణంగా పోలీస్ కథల్లో హీరోకి .. రౌడీలకు మధ్య ఒక గేమ్ నడుస్తూ ఉంటుంది. ఒకరిని ఒకరు దెబ్బ తీయడానికి వ్యూహాలు పన్నుతుంటారు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ ఎమోషన్స్ ను కూడా టచ్ చేస్తూ ఉంటారు. హీరో ఒక వైపున హీరోయిన్ తో డ్యూయెట్లు పాడుతూనే నేరస్థుల అటకట్టిస్తూ ఉంటాడు. కానీ అందుకు భిన్నంగా ఈ కథ చాలా సీరియస్ గా సాగుతుంది. హీరో ఫైట్ చేసే సమయంలోనే కాదు .. హీరోయిన్ పక్కనే ఉన్నప్పుడు కూడా అలా సీరియస్ గానే ఉంటాడు. 

కన్నడంలో శివరాజ్ కుమార్ చేసిన 'తగారు' బాగానే ఆడింది. అక్కడ శివరాజ్ కుమార్ కి ఉన్న ఇమేజ్ వేరు .. ఆయనను చూపించిన విధానం వేరు. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ ప్రభు కనెక్ట్ కావడం కాస్త కష్టమే అయింది. దానికి తోడు లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్లు లేకుండా ముందుకు వెళ్లడం మైనస్ అయింది. అటు రౌడీల పాత్రలను గానీ .. ఇటూ హీరో .. హీరోయిన్ల పాత్రలను గానీ ఆకట్టుకునేలా దర్శకుడు మలచలేకపోయాడు. 

రౌడీలు నేరాలు చేస్తుంటారు .. పోలీసులు వాళ్లను వెంటాడుతుంటారు. ఇది అన్ని కథల్లో కామన్ గా జరిగేదే. అయితే నేరాలు .. ఇన్వెస్టిగేషన్ జరిగే తీరు ఇవేవీ కూడా ఆసక్తిని పెంచలేకపోయాయి. ఇక ప్రధానమైన కథకి వినోదపరమైన అంశాలు తోడుకావాలి. అప్పుడు ప్రేక్షకులు బోర్ లేకుండా కథను ఫాలో కాగలుగుతారు. ఎంతసేపూ పోలీసులు .. రౌడీల కొట్లాటలు .. రక్తపాతం  చూడాలంటే అది కాస్త ఇబ్బందికరమైన విషయమే. కేవలం ఆ గొడవలే చూడటానికైతే థియేటర్ కి వెళ్లవలసిన అవసరం లేదు కూడా. కతిరవన్ ఫొటోగ్రఫీ .. సామ్ సీస్ సంగీతం .. మణి మారన్ ఎడిటింగ్ ఫరవాలేదు.     

Trailer

More Movie Reviews